తెలంగాణలో ప్రకటించిన పెండింగ్ చలాన్ల క్లియరెన్స్ అదాలత్ ఇవాళ్టితో ముగియనుంది. మరోసారి ఈ డిస్కౌంట్ ఆఫర్లు పెంచే అవకాశం కనిపించడం లేదు. ఈ 45 రోజుల్లో పెండింగ్ చలాన్లను ఎవరైనా క్లియర్ చేయకపోతే, ఈరోజు ఆ పని చేయాలని, భారీ డిస్కౌంట్లు అందుకోవాలని పిలుపునిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు.
పెండింగ్ లో ఉన్న వేల కోట్ల చలాన్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటించింది తెలంగాణ పోలీస్ శాఖ. టూ-వీలర్, త్రీ-వీలర్ వాహనాలపై ఏకంగా 70శాతం డిస్కౌంట్ ఇచ్చింది. ఫోర్ వీలర్ తో పాటు హెవీ వెహికల్స్ పై ఉన్న చలాన్లు క్లియర్ చేసేందుకు ఏకంగా 50శాతం ఆఫర్లు ఇచ్చింది. ఇక కరోనా టైమ్ లో మాస్క్ లేకుండా బయట తిరిగిన వ్యక్తులపై వేసిన ఫైన్లపై ఏకంగా 90శాతం ఆఫర్ ప్రకటించింది.
మార్చి 1 నుంచి 31వ తేదీ వరకు ఈ ఆఫర్ ప్రకటించింది. తొలి 2 రోజులు అనూహ్య స్పందన వచ్చింది. ఒక దశలో సర్వర్లు జామ్ అయ్యాయి కూడా. ఆ తర్వాత అనూహ్యంగా ఆదరణ తగ్గిపోయింది. మరోసారి పోలీసులు ప్రచారం కల్పించడంతో పుంజుకుంది. ఆ తర్వాత గడువును మరో 15 రోజులు పెంచారు. అలా పెంచిన గడువు ఇవాళ్టితో ముగియనుంది.
ఇప్పటివరకు 60శాతం మంది తమ పెండింగ్ చలాన్లను క్లియర్ చేసుకున్నట్టు చెబుతున్నారు పోలీసులు. వీటి ద్వారా 250 కోట్ల రూపాయల ఆదాయం సమకూరినట్టు చెబుతున్నారు. మిగిలిన వాహనదారులు కూడా తమ వాహనాలపై ఉన్న చలాన్లను ఈరోజు క్లియర్ చేసుకోవాలని కోరుతున్నారు.
ఈరోజు చలాన్ల క్లియరెన్స్ కు ఆదరణ బాగుంది. ఇన్నాళ్లు బద్దకించిన వాళ్లంతా ఈరోజు ఎకాఎకిన చలాన్లు క్లియర్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, మరికొన్ని రోజులు గడువు పెంచుతారేమో చూడాలి. మరోవైపు వెబ్ సైట్ మాత్రం ఇంకా మొరాయిస్తూనే ఉంది. బండి నంబర్ కొట్టిన వెంటనే వివరాలు ఓపెన్ అవ్వడం లేదు.