అసిస్టెంట్ ఇంజినీరింగ్ పరీక్షను రద్దు చేస్తూ టీఎస్‌పీఎస్సీ నిర్ణయం తీసుకుంది. పేపర్ లీకైనట్లు నిర్ధారణ కావడంతో ఈ నెల 5న జరిగిన పరీక్షను రద్దు చేసింది. తర్వలోనే కొత్త పరీక్ష తేదీలను ప్రకటిస్తామని పేర్కొంది. అటు పేపర్ లీక్ ఘటనపై రంగంలోకి దిగిన సిట్ టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో విచారణ చేపట్టింది.
ప్రభుత్వ విభాగాల్లో 837 ఏఈ పోస్టులకు రాష్ట్రవ్యాప్తంగా 74 వేల మంది దరఖాస్తు చేసుకోగా.. దాదాపు 55వేల మంది పరీక్షకు హాజరయ్యారు. ప్రశ్నపత్రం లీకేజీ కేసులో కమిషన్ కార్యాలయ ఉద్యోగి ప్రవీణ్ ప్రధాన నిందితుడిగా గుర్తించి విచారణ చేస్తున్నారు. కాగా.. పరీక్ష ప్రశ్నపత్రాన్ని లీక్ చేసిన టీఎస్‌పీఎస్సీ ఉద్యోగి ప్రవీణ్‌కుమార్ గ్రూప్-1 పరీక్ష రాయడం, అందులో అతనికి 103 మార్కులు రావడంతో గ్రూప్-1 పరీక్ష పేపర్ కూడా లీకైందా? అన్న అనుమానాలు బలపడుతున్నాయి.
కాగా గ్రూప్ 1 పరీక్ష రాసిన ప్రవీణ్ కు 103 మార్కులు వచ్చినా మెయిన్స్‌కు అతను అర్హత సాధించలేదని.. గ్రూప్-1 మెయిన్స్ షెడ్యూలు ప్రకారం నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ బి జనార్దన్‌రెడ్డి ఇప్పటికే సృష్టం చేశారు.