అది ఒక అద్భుతమైన భవనం.. ఒకప్పుడు ఎంతో గొప్పగా వెలుగు వెలిగింది! కానీ కాలక్రమంలో దాని ప్రభలు మసకబారిపోయాయి. యజమానులు మారారు. అడ్డగోలుగా ఆ భవనాన్ని ఆక్రమించుకొని.. తనను తాను యజమానిగా ప్రకటించుకున్న వారు దాని బాగోగుల గురించి పెద్దగా పట్టించుకోలేదు! ఆ భవనం ద్వారా రాగల లాభాలను అనుభవించారే తప్ప ఆ భవనాన్ని కాపాడుకోవడం పై శ్రద్ధ పెట్టలేదు.
రోజులు గడిచాయి.. యజమాని ఆ భవనాన్ని అలా విడిచి పలాయనం చిత్తగించారు. భవనం నెమ్మదిగా శిథిలమైంది. పాడుపడింది. చెట్లు తుప్పలు మొలిచాయి. సాలె గూళ్ళు ఏర్పడ్డాయి.. భవనం జిపిఏ హోల్డర్ చేతిలోకి వెళ్ళింది! నెమ్మదిగా ఆ హోదా లీజుదారుడిలాగా మారింది.. అనుభవించడానికి యోగ్యత లేని భవనం గురించి ఎవరు మాత్రం పట్టించుకుంటారు? చివరికి ఆ లీజు దారుడి పొజిషన్ కాస్తా వాచ్‌మేన్ లాగా దిగజారిపోయింది.
ఆ రకంగా సంపూర్ణంగా శిధిలమై రిపేర్లు చేయించడానికి కూడా పనికిరాకుండా మారిపోయిన భూత్ బంగ్లా కు ఇప్పుడు సరికొత్త వాచ్ మెన్ ను ఏర్పాటు చేసినంత మాత్రాన ఏం ప్రయోజనం ఉంటుంది? ఇది సాధారణంగా ఎవరికీ అర్థం కాని సంగతి. కానీ తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడు మాత్రం ఆ పనే చేస్తున్నారు.
ఇప్పటికి అర్థమైంది కదా.. ఈ శిథిల భూత్ బంగ్లా ప్రస్తావన మొత్తం తెలంగాణ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సంగతి!! చంద్రబాబు ఇప్పుడు తెలంగాణ తెలుగుదేశం పార్టీకి సరికొత్త అధ్యక్షుడిని నియమించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సర్వనాశనం అయిపోయి శవాసనం వేసి ఉన్న తెలుగుదేశం పార్టీకి ఈ అధ్యక్ష బాధ్యత అంటే– సారథ్యం లాంటిది కానే కాదని, కేవలం అక్కరకు రాని శిథిల భవనానికి వాచ్మెన్ లాంటి పోస్ట్ అని సర్వత్రా ఎత్తిపొడుపులు వినిపిస్తున్నాయి!
తెలంగాణ తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడిని మార్చినంత మాత్రాన చంద్రబాబు నాయుడు పార్టీ మీద ప్రేమ కొద్దీ ఇక్కడి రాజకీయాల మీద దృష్టి సారిస్తున్నారని అనుకుంటే పొరపాటే. అతీగతీ లేని పార్టీకి ఇప్పుడు నాయకత్వ మార్పు ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు. రాష్ట్రం విడిపోయిన నాటి నుంచి తెలంగాణ పార్టీకి అధ్యక్షుడిగా ఎల్ రమణను చంద్రబాబు నియమించారు. ఈ తెలుగుదేశాన్ని నమ్ముకుంటే జీవితమంతా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారవుతుందని భయపడిన ఎల్ రమణ టి ఆర్ ఎస్ తీర్థం పుచ్చుకొని ఎమ్మెల్సీగా సెటిల్ అయ్యారు.
ఆ తర్వాత అధ్యక్ష హోదా బక్కని నరసింహులు చేతికి వెళ్ళింది. నాయకులు కార్యకర్తలు లేని పార్టీకి అధ్యక్ష హోదా అంటే.. గుర్రాలు పూన్చని రథానికి పగ్గాలు చేతబట్టడం లాంటిదే అయినా సరే బక్కని నరసింహులు ఏదో కిందా మీదా పడుతూ పార్టీని ముందుకు నడిపించారు. మునుగోడు ఉప ఎన్నికలో కూడా పార్టీని పోటీ చేయించాలని భావించారు. కానీ చంద్రబాబు ఒప్పుకోలేదు. చివరికి ఆయన పదవికే ఎసరు వచ్చింది.
ఇప్పుడు బక్కని నరసింహులును పార్టీ పోలిట్ బ్యూరోలో కూర్చోబెట్టి, అధ్యక్షత స్థానాన్ని కాసాని జ్ఞానేశ్వర్ చేతుల్లో పెట్టారు. ఒకప్పట్లో తెలుగుదేశాన్ని విడిపోయి సొంత దుకాణం పెట్టుకున్న ఈ నాయకుడు ఇప్పుడు శిధిలమైన పార్టీని సరికొత్తగా ఏం ఉద్ధరిస్తారో చూడాలి!