పిఠాపురంలో కూటమి అభ్యర్థి పవన్‌కల్యాణ్‌పై వైసీపీ అభ్యర్థి ఎవరో తేలిపోయింది. కాకినాడ ఎంపీ వంగా గీతను పిఠాపురం బరిలో నిలిపారు. ఈ మేరకు ఇవాళ వైసీపీ ప్రకటించిన జాబితాలో ఆమె పేరు వుండడం విశేషం. ఇటీవలే పవన్‌కల్యాణ్ తాను పిఠాపురంలో పోటీ చేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే.
అంతకు ముందే పిఠాపురం సమన్వయకర్తగా వంగా గీతను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నియమించారు. అయితే పిఠాపురంలో పవన్ పోటీ చేస్తారనే ప్రచారంతో బలమైన అభ్యర్థిని నిలిపే క్రమంలో వంగా గీతను మారుస్తారని అనుకున్నారు. అలాంటి ప్రచారానికి చెక్ పెడుతూ వంగా గీతే పవన్‌ను ఢీ కొట్టే వైసీపీ అభ్యర్థిగా సీఎం జగన్ తేల్చి చెప్పారు.
వంగా గీత కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకురాలు. గతంలో ఆమె పీఆర్పీ తరపున కూడా గెలుపొందారు. పిఠాపురంలో టీడీపీ తరపున వర్మ పోటీ చేయాలని కొన్నేళ్లుగా ప్రచారం చేసుకుంటున్నారు. అయితే అనూహ్యంగా పవన్‌కల్యాణ్ పేరు తెరపైకి రావడంతో కూటమిలో అలజడి చెలరేగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ వర్మ బరిలో వుంటారని ఆయన అనుచరులు స్పష్టం చేశారు.
ఇవాళ చంద్రబాబునాయుడి పిలుపు మేరకు వర్మ విజయవాడకు వెళ్లారు. బాబు ఆదేశాలను వర్మ పాటిస్తారా? లేక అనుచరుల అభీష్టం మేరకు నడుచుకుంటారా? అనేది తేలాల్సి వుంది. ఏది ఏమైనా వైసీపీ తరపున అభ్యర్థి ఎవరో తెలిసిపోయింది. ఇక పవన్, వర్మ మధ్య పంచాయితీనే తేలాల్సి వుంది. వర్మ కూడా బరిలో వుంటే ముక్కోణపు పోటీ తప్పదు.