కొత్త నాట‌కం షురూ!

శ‌నివారం మ‌ధ్యాహ్నం ఆట‌కి తెర‌. కొత్త నాట‌కం ప్రారంభం. వేట‌గాళ్లు విల్లు స‌ర్దుకుంటారు. బాణాలు ప‌దును పెడ‌తారు. ఎవ‌న్ని వేటాడుతారో వాళ్ల‌కి వేట‌లో వాటా ఇస్తారు. Advertisement ఎండ‌లో కూడా నాయ‌కులు వ‌ణుకుతారు. వాన…

శ‌నివారం మ‌ధ్యాహ్నం ఆట‌కి తెర‌. కొత్త నాట‌కం ప్రారంభం. వేట‌గాళ్లు విల్లు స‌ర్దుకుంటారు. బాణాలు ప‌దును పెడ‌తారు. ఎవ‌న్ని వేటాడుతారో వాళ్ల‌కి వేట‌లో వాటా ఇస్తారు.

ఎండ‌లో కూడా నాయ‌కులు వ‌ణుకుతారు. వాన వ‌స్తే త‌మ పార్టీ వ‌రుణుడిని ఒప్పించి కురిపించింద‌ని అంటారు. ఊరూరా ఉచిత కౌగిలి. క‌ష్టాల‌కి కన్నీళ్లు కారుస్తారు. క‌న్నీళ్ల‌లో క‌ల్తీ లేదంటారు. గెలిపిస్తే ఇంటికో ప‌రుస‌వేది.

జ‌నానికో జాత‌ర కావాలి. పండ‌గ కావాలి. కోలాట ఖ‌ర్చంతా ఎవ‌డో భ‌రించాలి. క‌ష్ట‌ప‌డిన వాడు పైకొస్తాడు. ప్ర‌వ‌చ‌నం చెబితే ప‌య్యి (ఒళ్లు) ప‌గులుతుంది. క‌ష్ట‌ప‌డిన వాడు పైకి పోతాడు, తొంద‌ర‌గా జ‌బ్బు ప‌డి.

క‌ష్ట‌పడిన వాళ్లంతా పైకొస్తే, రోజుకి 12 గంట‌లు ప‌ని చేసే డ్రైవ‌ర్లు, వంట‌వాళ్లు, తోట‌మాలీలు , సేల్స్ గ‌ర్ల్స్ నెల జీతం కోసం అడుక్కోరు. క‌ష్ట‌మంటే క‌ప‌టం. దానికి మించిన నిచ్చెన లేదు.

వూరంతా తెల్ల‌బ‌ట్ట‌లోళ్లు దిగుతారు. మాసిపోయినోన్ని హ‌త్తుకుంటారు. నేను వ‌స్తే నీ జీవితం త‌ళ‌త‌ళ‌లాడే మెరుపు అంటారు. ఉచితంగా వాషింగ్ సోప్ ఇస్తారు. నుర‌గే త‌ప్ప‌, తెలుపురాని స‌బ్బు. నుర‌గ వ‌ల్ల గాలి బుడ‌గ‌లు వ‌స్తాయి. బుడ‌గ‌ల్లో కూడా ఇంద్ర‌ధ‌న‌స్సు చూపించ‌డ‌మే రాజ‌కీయం.

పులికి పులి చ‌ర్మాన్ని అమ్మి ధ్యానం చేయించ‌డ‌మే రాజ‌కీయం. అది త‌న చ‌ర్మ‌మే అని పులికి తెలియ‌దు. చ‌ర్మం వ‌లిచి ఒంటికి పెయింట్ వేస్తే వాన వ‌స్తే త‌ప్ప పులి కూడా క‌నుక్కోలేదు.

అంతా మారిపోతుంది అంటారు. ఏదీ మార‌దు. మార్పుకి అర్థం సామూహికం కాదు, వ్య‌క్తిగ‌తం.

మీడియా కొత్త ప‌దాలు వెతుకుతూ త‌న అర్థాన్ని మ‌రిచిపోతుంది. ఊరూరా బుర‌ద ఫ్యాక్ట‌రీలు వెలిసి బ‌కెట్ల కొద్ది సర‌ఫ‌రా చేస్తాయి. అస‌లే ఎండాకాలం. ప‌డిన బుర‌ద క‌డుక్కోడానికి నీళ్లు కూడా లేవు.

నోరు వీధి కుళాయిగా మారి బూతు ప్ర‌వ‌హిస్తుంది. సోష‌ల్ మీడియాలో త‌ల‌లు మారుస్తారు. అంతా అసాంఘిక‌మే. అన్ని రాజ‌కీయ తోట‌ల్లో నీతిబీర‌కాయల‌ పంట‌లే.

త‌న‌ని తాను మ‌రిచిపోవ‌డ‌మే ఆధ్యాత్మిక జ్ఞానం. జ‌నాన్ని జ్ఞానం వైపు త‌ర‌లించ‌డానికే వైన్స్‌. ఇది Divine Truth. బార్ల‌లో చౌక‌బారు, నేల‌బారు, దుబారు అని మూడు ర‌కాలు. ఒక పెగ్గు ప‌డితే అంద‌రు సార్లూ నేల‌బారు, సాంబారు.

కండువాలు రంగులు మారుతాయి. మ‌నుషులు కుబుసం విడుస్తారు. పండే క‌దా అని కొరికితే త‌క్ష‌కుడు వ‌చ్చి కాటేస్తాడు.

నోట్లు మారుతున్న‌ప్పుడు గాంధీ తాత క‌న్నీళ్లు పెడ‌తాడు. ఆయ‌న మ‌ళ్లీ పుడితే నోటు మీద త‌న బొమ్మ తీసేయాల‌ని మొండి స‌త్యాగ్ర‌హం చేస్తారు.

అంద‌రి నాయ‌కుల ఏకైక పాస్‌వ‌ర్డ్ ప్ర‌జాస్వామ్యం. చంపేది వాళ్లే. బ‌తికిస్తామ‌ని వాగ్దానం చేసేది వాళ్లే. ఇదే క‌దా ఇండియా. ఆడండి ఇక దాండియా.

జీఆర్ మ‌హ‌ర్షి