టీఆర్ఎస్ పేరు బీఆర్ఎస్ అని మార్చిన దగ్గర నుంచే అన్నీ నెగిటివ్ గా జరుగుతున్నాయి కేసీఆర్ అండ్ బృందానికి అన్నది జనాల్లో ప్రచారం. ఈ మేరకు వార్తలు.. ఇంకా.. ఇంకా. పేరు బలం అనేదాన్ని చాలా మంది నమ్ముతారు. సామాన్యుల దగ్గర నుంచి అసమాన్యుల వరకు.
తెలుగుదేశం అనే పేరు బాగా కలిసి వచ్చింది ఆ రాజకీయ పార్టీకి. జనసంఘ్ అని వుండగా ఏనాడూ పెద్దగా క్లిక్ కాని పార్టీ.. భారతీయ జనతాపార్టీగా మారిన తరువాత కలిసి వచ్చింది. సంపాదకుడు ఎబికె ప్రసాద్ ఇలా పేర్లు పెట్టడంలో సిద్దహస్తులు. ఈనాడు, ఉదయం, సాక్షి, సుప్రభాతం, వార్త ఇవన్నీ ఆయన పెట్టిన పేర్లే. వీటిలో ఉదయం ఓ వెలుగు వెలిగి ఆరింది. మిగిలిన దినపత్రికలు ఈనాటికీ రన్ అవుతున్నాయి.
సినిమా రంగంలో ఈ పేరు సెంటిమెంట్ చాలా వుంది. న్యూమరాలజీని నమ్మేవారు ఓ అక్షరం కలపడమో, తీయడమో చేస్తుంటారు. బాలీవుడ్ లో లక్షల్లో ఫీజు తీసుకునే న్యూమరాలజిస్ట్ లు వున్నారు. దర్శకుడు మారుతి ఏ ఫీజు తీసుకోకుండానే చాలా మందికి పేర్లు మార్చారు. ఆయన పేర్లు ఎలా వుంటే బాగుంటుందో సజెస్ట్ చేస్తే, తీసుకుని బాగుపడిన వారు వున్నారు.
మన ముఖ్యమంత్రులుగా చేసిన చాలా మంది పేర్లు ఆర్ అక్షరంతో ప్రారంభం కావడం లేదా వాళ్ల పేర్లలో ఆర్ అక్షరం వుండడం ఎక్కువగా వుంటుంది. పేర్లలో ఆర్ అక్షరం లేని వాళ్లకు అంత సులువుగా అధికారం రాదని అంటారు. జాతీయ స్థాయిలో సోనియాగాంధీకి అందుకే అవకాశం రాలేదని చెప్పేవారు వున్నారు. రాహుల్ కు మరెందుకు రావడం లేదో? మరి ఈ లెక్కన లోకేష్ సంగతి చూస్తే ఇంటిపేరులో ఆర్ లెటర్ వుంది కనుక నడుస్తుందేమో? పవన్ కళ్యాణ్ కు ఎక్కడా ఆర్ లెటర్ లేదు? ఏం జరుగుతుందో చూడాలి.
ఓ మిడ్ రేంజ్ సినిమా హీరో తన పేరును కొన్నాళ్ల క్రితం మార్చుకున్నారు. ఆ తరువాత మొన్నామధ్య ఎందుకో పాత పేరునే ఓ సినిమా అనౌన్స్ మెంట్ లో వేసారు. ఆ సినిమా ప్రస్తుతం గాలిలో దీపంలా వుండిపోయింది. ఈ లోగా ఆ హీరో తన పేరు మళ్లీ తొందరపడి వేరేలా మార్చుకున్నారు. దీంతో మొదట్లో పేరు మార్చిన వాళ్లను సంప్రదిస్తున్నారట. ముచ్చటగా మూడు పేర్లలో ఏది బెటర్ అని.
మొత్తం మీద న్యూమరాలజీ అనే దాన్ని నమ్మేవారు ఎక్కువ శాతమే వుంటారు. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని మళ్లీ టీఆర్ఎస్ గా మార్చడం అంటే అంత సులువు కాదేమో? జాతీయ స్థాయి రాజకీయాలు చేయడం ఆపేయవచ్చు. కానీ పార్టీని మళ్లీ టీఆర్ఎస్ గా మారుస్తారా? ఏమో? రాజకీయాల్లో, సినిమాల్లో సెంటిమెంట్ పాలు ఎక్కువ వుంటుంది. అందువల్ల మార్చినా మార్చవచ్చు.