వివేకా హ‌త్య కేసులో ఒకే ఒక్క అరెస్ట్ మిగిలిందా?

మాజీ మంత్రి వివేకా హ‌త్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. హ‌త్య కేసు విచార‌ణ ముగింపు ద‌శ‌కు చేరింది. తాజాగా వైఎస్ భాస్క‌ర్‌రెడ్డి అరెస్ట్‌తో సీబీఐ విచార‌ణ‌పై అంచ‌నాకు రావ‌చ్చు. సీబీఐ వివిధ సంద‌ర్భాల్లో…

మాజీ మంత్రి వివేకా హ‌త్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. హ‌త్య కేసు విచార‌ణ ముగింపు ద‌శ‌కు చేరింది. తాజాగా వైఎస్ భాస్క‌ర్‌రెడ్డి అరెస్ట్‌తో సీబీఐ విచార‌ణ‌పై అంచ‌నాకు రావ‌చ్చు. సీబీఐ వివిధ సంద‌ర్భాల్లో న్యాయ‌స్థానాలకు స‌మ‌ర్పించిన నివేదిక‌ల్లోని అంశాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటే… ఇక ఒకే ఒక్క అరెస్ట్ మిగిలి వుంద‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. ఆ ఒక్క‌డు క‌డ‌ప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి మాత్ర‌మే అనే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

వివేకా హ‌త్య కేసు మొత్తం క‌డ‌ప ఎంపీ, ఆయ‌న తండ్రి చుట్టూ తిరుగుతోంది. అప్రూవ‌ర్‌గా మారిన ద‌స్త‌గిరి ఇచ్చిన వాంగ్మూలం వైఎస్ అవినాష్‌రెడ్డి, ఆయ‌న తండ్రి మెడ‌కు చుట్టుకుంది. రెండు రోజుల క్రితం ఉద‌య్‌కుమార్‌రెడ్డి అరెస్ట్ మ‌రో కీల‌క అంశంగా చెప్పొచ్చు. త‌మ‌ను ఎలాగైనా అరెస్ట్ చేస్తార‌ని అవినాష్‌రెడ్డి, ఆయ‌న తండ్రి భాస్క‌ర్‌రెడ్డికి బాగా తెలుసు. అందుకే అరెస్ట్ కాకుండా వాళ్లిద్ద‌రూ కొంత కాలంగా న్యాయ పోరాటం చేస్తున్నారు.

భాస్క‌ర్‌రెడ్డి పోరాటం ఫ‌లించ‌లేద‌ని ఇవాళ్టి అరెస్ట్ నిరూపించింది. ఇక ఈ కేసులో ప్ర‌ధాన ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న వారిలో అవినాష్‌రెడ్డి ఒక్క‌డే బ‌య‌ట ఉన్నారు. అవినాష్‌రెడ్డి పీఏ రాఘ‌వ‌రెడ్డిని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రోవైపు విచార‌ణ గ‌డువు ముంచుకొస్తోంది. 

దీంతో సీబీఐ వేగం పెంచాల్సిన ప‌రిస్థితి. ఈ నేప‌థ్యంలో వివేకా హ‌త్య కేసులో అవినాష్‌రెడ్డి పాత్ర ఉంద‌ని బ‌లంగా విశ్వ‌సిస్తున్న సీబీఐ అడుగులు మున్ముందు ఎలా ప‌డ‌నున్నాయో అనే ఉత్కంఠ రేపుతోంది. ఏదైనా అద్భుతం జ‌రిగితే త‌ప్ప అవినాష్‌రెడ్డి అరెస్ట్‌ను నిలువ‌రించ‌డం క‌ష్ట‌మ‌ని న్యాయ నిపుణులు అంటున్నారు. ఈ మొత్తం వ్య‌వ‌హారం వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.