కేసీఆర్ ను తూర్పారపట్టేసిన ఆర్కే

తెలంగాణలో కేసీఆర్ కు వ్యతిరేకంగా రాయగలిగిన, రాసే మీడియాను వెదికి పట్టుకోవాలంటే కాస్త కష్టమే. వెలుగు..వి6 లాంటి ఒకటి రెండు తప్ప మరేవీ ఆ ధైర్యం చేయవు. చేయడం లేదు. జనం ఎక్కువగా చదివే…

తెలంగాణలో కేసీఆర్ కు వ్యతిరేకంగా రాయగలిగిన, రాసే మీడియాను వెదికి పట్టుకోవాలంటే కాస్త కష్టమే. వెలుగు..వి6 లాంటి ఒకటి రెండు తప్ప మరేవీ ఆ ధైర్యం చేయవు. చేయడం లేదు. జనం ఎక్కువగా చదివే మెయిన్ స్ట్రీమ్ మీడియా మాత్రం అస్సలు అక్షరం ముక్క రాయదు. కానీ గత కొన్ని రోజులుగా ఆంధ్రజ్యోతి అదే పని చేస్తోంది. 

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కొంటామంటూ తెలంగాణ సిఎమ్ కేసీఆర్ ప్రకటిస్తే..తెలుగు మీడియా సంస్థలు అబ్బో..సూపర్ అన్నాయి. కానీ ఆంధ్రజ్యోతి మాత్రమే అందులోని డొల్లతనాన్ని బయటకు తీసి వరుస కథనాలు ప్రచురించింది. సింగరేణి దగ్గర డబ్బులు యాడున్నాయి అంటూ మొత్తం లెక్కలు బయటకు తీసింది. అసలు స్టీల్ ప్లాంట్ బిడ్లు దాన్ని కొనడానికి కాదు, అది వేరే అని మొత్తం వ్యవహారం బయటకు లాగింది.

కేసీఆర్ కు బాగా సన్నిహిత మిత్రుడైన ఆర్కే ఇప్పుడు ఏకంగా ఆయన వ్యవహారశైలిలోని భిన్న కోణాలను తన కొత్త పలుకులో తూర్పారపట్టేసారు. అందులో దొర్లిన కొన్ని ఆణిముత్యాలు.

*ఉమ్మడి రాష్ట్రంలో మిగులు నిధులతో అలరారిన సింగరేణి కంపెనీ ఇప్పుడు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు కూడా ఆరగించేసి, అప్పుల కోసం వేట మొదలుపెట్టింది.

*తాము అధికారంలోకి వస్తే వంద రోజుల్లోనే మూతపడిన ఈ ఫ్యాక్టరీని తెరిపిస్తామని 2014 ఎన్నికల సందర్భంగా కేసీఆర్‌ అండ్‌ కో ప్రకటించారు. ఇప్పుడు 2023లో ఉన్నాం. నిజాం షుగర్‌ ఫ్యాక్టరీ మూతపడే ఉంది. ఏపీ రేయాన్స్‌ ఫ్యాక్టరీ పరిస్థితి కూడా ఇంతే. తెలంగాణలో మూతపడిన పరిశ్రమల ఊసెత్తని కేసీఆర్‌ .

*రెండేళ్ల కిందట కరోనా మహమ్మారి విజృంభించినప్పుడు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌ రావాలని ప్రయత్నించిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రోగులను అమానవీయంగా అడ్డుకున్నది ఈ కేసీఆర్‌ కాదా?

*సరిహద్దులలో పోలీసులను మోహరింపజేసి కరోనా రోగులను హైదరాబాద్‌కు తీసుకువస్తున్న అంబులెన్సులను వెనక్కి తిప్పిపంపలేదా?

*నిన్నగాక మొన్న తమ ధాన్యాన్ని హైదరాబాద్‌లో అమ్ముకోవడానికి లారీలలో తరలించే ప్రయత్నం చేసిన ఆంధ్ర రైతులను అడ్డుకోవడం నిజం కాదా?

*అధికారంలోకి వచ్చిన కొత్తలో హైదరాబాద్‌లో నివసిస్తున్న ఆంధ్ర మూలాలున్న వారి ఇళ్లు, కార్యాలయాలపైకి జేసీబీలను పంపిన కేసీఆర్‌.

*బ్రాహ్మణులకు పాదాభివందనం చేసే కేసీఆర్‌ దళితులకు ఏ సందర్భంలో కూడా పాదాభివందనం చేయడాన్ని మనం చూడలేదు. బ్రాహ్మణ వర్గానికి చెందిన ప్రణబ్‌ ముఖర్జీ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు, పాదాభివందనం చేయడాన్ని మనం చూశాం! అదే సమయంలో దళితుడైన రామ్‌నాథ్‌ కోవింద్‌ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఆయనకు ఒక్కసారి కూడా పాదాభివందనం చేయలేదు. 

*గతంలో ఇదే అంబేడ్కర్‌ జయంతికి ముందురోజు పంజగుట్ట చౌరస్తాలో బాబాసాహెబ్‌ విగ్రహాన్ని కూల్చి చెత్త కుప్పలో పడేసిన ప్రభుత్వమే ఈనాడు ఆ మహానుభావుడ్ని ఆకాశానికెత్తడం వెనుక ఉన్నవి రాజకీయ ప్రయోజనాలేనని దళితులు కూడా గుర్తిస్తున్నారు.

ఇలా పాయింట్ టు పాయింట్ రాసుకుంటూ వెళ్లారు. గమ్మత్తేమిటంటే ఈ పాయింట్లు ఏవీ కొత్తవి కాదు. ఇన్నాళ్లూ ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియా పట్టించుకుని, ప్రశ్నించలేదు. ఇకపై కూడా ప్రశ్నించకపోవచ్చు.