మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణలో రోజుకో ట్విస్ట్. తాజాగా తెలంగాణ హైకోర్టులో కడప ఎంపీ అవినాష్‌రెడ్డి వేసిన రిట్పిటిషన్పై తీర్పు రిజర్వ్‌లో ఉంది. విచారణలో భాగంగా అటు, ఇటు వైపుల నుంచి బలమైన వాదనలు జరిగాయి. సీబీఐ విచారణ తీరుపై అవినాష్‌రెడ్డి గట్టిగా వ్యతిరేకించారు. దోషులను పట్టుకోవడంలో కాకుండా తనను టార్గెట్ చేస్తున్నట్టు సీబీఐ విచారణ జరుపుతోందన్నది అవినాష్‌రెడ్డి ప్రధాన ఆరోపణ.
ఈ నేపథ్యంలో దోషులెవరో తేలాలంటే సీబీఐ ఏం చేయాలో అవినాష్‌రెడ్డి కొన్ని విషయాలు చెబుతున్నారు. వాటినే అవినాష్‌రెడ్డి తరపు లాయర్ కూడా హైకోర్టులో బలంగా వినిపించడం గమనార్హం. వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి, వివేకా రెండో భార్య షమీం పాత్రపై సీబీఐ విచారణ చేయడం లేదని అవినాష్ తరపు న్యాయవాది పేర్కొన్నారు. వివేకా కుటుంబంలో ఆస్తితో పాటు కుటుంబ విభేదాలు ఉన్నాయన్నారు. అలాగే వివేకా రాసిన లేఖలో ఏముందో తేల్చాలని అవినాష్ తరపు వాదనలు వినిపించారు. గుండెపోటుతో వివేకా మరణించారని తానెక్కడా చెప్పలేదని కోర్టు దృష్టికి కడప ఎంపీ తీసుకెళ్లారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని దర్యాప్తు జరపాలని అవినాష్ తరపు న్యాయవాది విజ్ఞప్తి చేశారు.
వివేకా హత్య కేసులో వీడియో గ్రఫీ అవసరం లేదని హైకోర్టు పేర్కొంది. అవినాష్ విచారణకు సంబంధించి వీడియో గ్రఫీ, ఆడియో గ్రఫీ, కేసు వివరాలను షీల్డ్ కవర్లో కోర్టుకు సీబీఐ సమర్పించింది. అవినాష్‌రెడ్డి పదేపదే ప్రస్తావించే లెటర్‌ను కూడా హైకోర్టుకు సీబీఐ అందజేసింది. తుది తీర్పు ఇచ్చేంత వరకు అవినాష్‌రెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సీబీఐని హైకోర్టు ఆదేశించింది.
పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో మంగళవారం సీబీఐ విచారణకు హాజరు కాకుండా ఆదేశాలు ఇవ్వాలని అవినాష్ తరపు న్యాయవాది హైకోర్టును కోరారు. ఆ విషయమై సీబీఐకి దరఖాస్తు చేసుకోవాలని కోర్టు సూచించింది. సీబీఐ విచారణలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసుకు సంబంధించి ఇరు వైపు వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది.