సాధారణ ఎన్నికలు కావొచ్చు, ఉప ఎన్నికలు కావొచ్చు ఎవరి లెక్కలు వారికుంటాయి. ప్రతి పార్టీ తన బలం చూసుకుంటుంది. ఆర్ధికంగా, సామాజికంగా బలమైన అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. బలమైన సామాజిక వర్గాలేమిటో చూస్తుంది. ఏ పార్టీ అయినా ఇలా ఎన్నో అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది. వీటన్నింటిలోకి కులాల లెక్కలు ముఖ్యం. ఏ సామాజిక వర్గం ఎన్నికలను ప్రభావితం చేయగలదో ఆ సామాజిక వర్గానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాయి.
ఏ సామాజిక వర్గానికి ఎక్కువ ఓట్లు ఉన్నాయో ఆ సామాజిక వర్గం అభ్యర్థిని నిలబెట్టడానికే పార్టీలు ప్రయత్నిస్తాయి. మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి ఇప్పుడు అన్ని పార్టీలు సామాజిక వర్గాల లెక్కలు వేసుకుంటున్నాయి. మునుగోడు కాంగ్రెస్ సిట్టింగ్ సీటు కావడంతో అది ఉప ఎన్నికను సవాల్ గా తీసుకుంటోంది. తాను పీసీసీ చీఫ్ అయ్యాకే జరిగిన హుజురుబాద్ ఉప ఎన్నికను పెద్దగా పట్టించుకోని రేవంత్ రెడ్డి.. మునుగోడుపై మాత్రం దూకుడుగా వెళుతున్నారు.
రాజగోపాల్ రెడ్డి రాజీనామా ప్రకటన చేసిన మూడు రోజుల్లోనే మునుగోడుకు వెళ్లి బహిరంగ సభ నిర్వహించారు. రాజగోపాల్ రెడ్డిని తీవ్ర స్థాయిలో టార్గెట్ చేశారు. ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలిచి తీరుతుందని చెప్పారు. ఇక మునుగోడు ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థి విషయంలో రేవంత్ రెడ్డి క్లారిటీగా ఉన్నారని ఆయన అనుచరులు అంటున్నారు. మునుగోడు నియోజకవర్గంలో బీసీ ఓటర్లు చాలా ఎక్కువగా ఉన్నారు.
రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లోనూ బీసీ ఓటర్లు 50 శాతానికి పైగానే ఉంటారు. కాని మునుగోడులో మాత్రం 70 శాతానికి పైగా ఉన్నారని లెక్కలు చెబుతున్నారు. మునుగోడు నియోజకవర్గంలో మొత్తం 2 లక్షల 27 వేల ఓట్లు ఉన్నాయి. సామాజిక వర్గాల వారీగా చూస్తే గౌడ్ లు 35 వేల మంది ఓటర్లు ఉండగా.. పద్మశాలీలు 32 వేల వరకు ఉన్నారు. ముదిరాజ్ లు 31 వేల మంది, యాదవ సామాజిక వర్గం నుంచి దాదాపు 26 వేల మంది ఓటర్లు మునుగోడు నియోజకవర్గంలో ఉన్నారు.
మొత్తంగా దాదాపు లక్షా 50 వేల మంది బీసీ ఓటర్లే ఉన్నారు. ఎస్సీలు కూడా ఎక్కువే. మాదిగలు 25 వేల వరకు ఉండగా..మాలలు 11 వేల ఓటర్లు ఉన్నారు. ఎస్టీలు 11 వేల వరకు ఉన్నారు. మైనార్టీల వర్గానికి చెందిన 6 వేల మంది ఓటర్లు ఉన్నారు. మొత్తంగా మునుగోడు నియోజకవర్గంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సామాజిక వర్గాల వారే 90 శాతానికి పైగా ఉన్నారు.
ఓసీల్లో రెడ్డి ఓటర్లు 7 వేల 6 వందలు కాగా.. కమ్మవారు దాదాపు 5 వేలు ఉన్నారు. వెలమ ఓటర్లు రెండున్నర వేలు ఉండగా.. ఆర్యవైశ్య, బ్రహ్మణ సామాజికవర్గాల నుంచి మరో 4 వేల మంది ఓటర్లు ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్న చెరుకు సుధాకర్ ను రేవంత్ రెడ్డి తెరపైకి తీసుకొచ్చారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఈయనపై ఏకంగా పీడీ చట్టం కింద కేసు పెట్టడంతో ఆరు నెలల పాటు జైలులో ఉన్నారు. ఉద్యమకారుడిగా గుర్తింపు ఉన్న చెరుకు సుధాకర్ ను మునుగోడు బరిలో దింపే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నారని తెలుస్తోంది.
కాంగ్రెస్ మునుగోడు సభ నిర్వహించే రోజే చెరుకు సుధాకర్ ఢిల్లీలో హస్తం పార్టీ కండువా కప్పుకున్నారు చెరుకు సుధాకర్ గౌడ్. మునుగోడులో గౌడ్ ఓటర్లు దాదాపు 35 వేలు. సుధాకర్ భార్య ఎస్సీ (మాదిగ). గతంలో ఆమె నకిరేకల్ ఎస్సీ రిజర్వ్ సీటు నుంచి పోటీ చేశారు. మునుగోడులో ఎస్సీ ఓటర్లు 36 వేలు. చెరుకు సధాకర్ పోటీలో ఉంటే ఈ రెండు సామాజిక వర్గాల మద్దతు లభిస్తుందని రేవంత్ రెడ్డి లెక్కలు వేశారట. ఇక లెఫ్టిస్ట్ భావజలం కలిగిన చెరుకుకు వామపక్ష పార్టీలు మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. మునుగోడు నియోజకవర్గంలో సీపీఐ, సీపీఎంకు బలమైన ఓటు బ్యాంక్ ఉంది.
అందుకే చండూరు సభలో పదేపదే రేవంత్ రెడ్డి కమ్యూనిస్టులను పొగుడుతూ మాట్లాడారు. మునుగోడు ఉపఎన్నికలో కమ్యూనిస్టు పార్టీల మద్దతు కోసం రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. చెరుకుకు టికెట్ ఇస్తే వామపక్షాల మద్దతు కాంగ్రెస్ దక్కే అవకాశం ఉంది. అధికారికంగా మద్దతు ఇవ్వకపోయినా చెరుకుకు కమ్యూనిస్టులు ఓట్లు పడే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి ఈ లెక్కలు ఎంతవరకు వర్కవుట్ అవుతాయో చూడాలి.