Advertisement

Advertisement


Home > Politics - Analysis

గొడవలతో బతికి బట్ట కడుతుందా ...?

గొడవలతో బతికి బట్ట కడుతుందా ...?

రాష్ట్ర విభజనవల్ల ఆంధ్రాలో కాంగ్రెస్ కనుమరుగైపోయింది. తిరిగి అక్కడ పునరుజ్జీవం పొందుతుందన్న నమ్మకం కూడా లేదు. తెలంగాణలో కాస్త చురుగ్గా ఉందనిపించిన పార్టీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో గొడవలు, కొట్లాటలు, ఫిరాయింపులతో గందరగోళంగా మారింది. తెలంగాణలో అధికారం మాదే అని కొంతకాలం కిందటి వరకు జబ్బలు చరుచుకున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మునుగోడు ఉపఎన్నిక గెలిస్తే గొప్ప అన్నట్లుగా ఉంది పరిస్థితి. 

పార్టీ రాష్ట్రంలో బతికి బట్ట కడుతుందా అనే సందేహాలు కలుగుతున్నాయి. రేవంత్ రెడ్డిని టీపీసీసీ అధ్యక్షుడిని చేయగానే పార్టీలో అసంతృప్తి భగ్గుమంది. సీనియర్ నాయకులు బహిరంగంగానే మండిపడ్డారు. హైకమాండ్ కు డబ్బులిచ్చి పదవి దక్కించుకున్నాడని ఆరోపించారు.

2017 లో ఆయన టీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరాడు. మరుసటి ఏడాది పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాడు. 2021 లో పీసీసీ అధ్యక్షుడైపోయాడు. అంటే పార్టీలో చేరిన మూడేళ్లకే పార్టీ సారథిగా మారాడు. ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులు అలాగే ఉండిపోయారు. అధిష్టానం రేవంత్ రెడ్డిలో ఏ అంశాన్ని చూసి ప్రాధాన్యం ఇచ్చిందో తెలియదు. 

టీడీపీలో ఉండగా కాంగ్రెస్ ను తిట్టిన విషయం మర్చిపోయింది. రేవంత్ రెడ్డికి పదవి కట్టబెట్టి తాను పార్టీని గాడిలో పెట్టానని అధిష్టానం భావించి ఉండొచ్చు. కానీ ఇప్పుడు లావా ఒక్కసారిగా బద్దలైంది. సీనియర్లలో కొందరు రేవంత్ రెడ్డితో సర్దుబాటు అయినా చాలామంది రగిలిపోతూనే ఉన్నారు. ఈ కారణంగానే రాష్ట్రంలో జరిగిన ఏ ఉప ఎన్నికలోనూ పార్టీ గెలవలేదు.

కోమటిరెడ్డి బ్రదర్స్ లో రాజగోపాల్ రెడ్డి వెళ్ళిపోయాడు. పార్టీని విడిచివెళ్లనని అన్న వెంకటరెడ్డి చెబుతున్నప్పటికీ ఉంటాడనే నమ్మకం కలగడంలేదు. అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ వెళ్ళిపోయాడు. ఆ తరువాత ఎవరున్నారో తెలియదు. తాజాగా అద్దంకి దయాకర్ రావు గొడవ మొదలైంది. ఇది ఎటు దారితీస్తుందో చెప్పలేం. మునుగోడు నియోజకవర్గం చండూరులో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సభలో ఆ పార్టీ నేత అద్దంకి దయాకర్ కోమటిరెడ్డి సోదరులను ఉద్దేశించి అసభ్యంగా మాట్లాడారని ఆయనపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ ప్రారంభయింది. 

కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పార్టీలో ఉంటే ఉండు.. లేకపోతే లేదన్నట్లుగా అద్దంకి దయాకర్ మాట్లాడారు. కాస్త ఘాటైన పదాలు వాడటంతో ఈ అంశం వివాదాస్పదమయింది. దీనిపై  రేవంత్ వ్యతిరేక వర్గంగా పేరు పడిన కొంత మంది సీనియర్ నేతలు ప్రశ్నించడం ప్రారంభించారు. కొంత కాలంగా ప్రత్యక్ష రాజకీయాల్లో కనిపించని సీనియర్ నేత జానారెడ్డి సైతం అద్దంకి దయాకర్ స్పీచ్‌పై పార్టీ తెలంగాణ వ్యవహారాలను చూసే ఢిల్లీ నేతల్లో ఒకరైన బోసురాజుకు ఫోన్ చేసినట్లుగా తెలుస్తోంది. 

అద్దంకి దయాకర్ లాంటినేతలు దూకుడుగా మాట్లాడం వల్ల పార్టీకి నష్టమని బోసురాజు దృష్టికి జానారెడ్డి తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది. అలాంటి నేతల్ని దూరం పెట్టాలని ఆయన సూచించారని జానారెడ్డి వర్గీయులు చెబుతున్నారు. అయితే ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఇంకా స్పందించలేదు. అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు. ఉద్దేశపూర్వకంగా తమ సోదరులను తిట్టిస్తున్నారని ఆయన పరోక్షంగా రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీలో తమకు అవమానాలు జరుగుతున్నా కష్టపడి పని చేశామన్నారు.

మునుగోడు నియోజకవర్గంలో సభ పెట్టి ... అద్దంకి దయాకర్ తమను దూషిస్తున్నా వేదికపై ఉన్న సీనియర్ నేతలు వారించలేదన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా తమను పార్టీ నుంచి వెళ్లగొట్టేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అద్దంకి దయాకర్ తిట్ల వ్యవహారం రేవంత్ ను వ్యతిరేకించే వర్గీయులకు ఓ ఆయుధం లభించినట్లయింది. వారు కోమటిరెడ్డి సోదరులపై దయాకర్ చేసిన వ్యాఖ్యలపై తమకు పరిచయం ఉన్న పార్టీ హైకమాండ్ నేతలకు ఫిర్యాదు చేస్తున్నారు. 

ఇంత కాలం సైలెంట్‌గా ఉన్న జానారెడ్డి కూడా అద్దంకి దయాకర్ లాంటి నేతలు పార్టీకి నష్టమని హైకమాండ్‌కు ఫిర్యాదు చేయడం ఆసక్తి రేపుతోంది.

వలయంలో జగన్

నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా