తెలంగాణలో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ (బీఆర్ఎస్)కి చెందిన 17 నుంచి 20 మంది ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వుందని సంచలన కామెంట్స్ చేశారు. ఎర్రబెల్లి వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. కేసీఆర్ కేబినెట్లోని మంత్రే 20 మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలపై అసంతృప్తి వుందని చెబుతుంటే, వాస్తవ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చని ప్రతిపక్షాలు విమర్శలకు దిగాయి.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇవాళ పలు సమావేశాల్లో ఎర్రబెల్లి మాట్లాడుతూ తామే తిరిగి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. అయితే ప్రజావ్యతిరేకత ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలను మారిస్తే 100 సీట్లలో విజయం ఖాయమన్నారు. ఆ 20 మంది ఎమ్మెల్యేలు కూడా గెలిస్తే… కేవలం కేసీఆర్ ముఖం చూసి ఓట్లు వేశారని అనుకోవాల్సి వుంటుందని మంత్రి సెలవిచ్చారు. హీనపక్షంలో బీఆర్ఎస్కు 80 -90 సీట్లు వస్తాయని ఆయన తేల్చి చెప్పారు.
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను ఏ మాత్రం లెక్కలోకే తీసుకోలేదని ఆయన అన్నారు. ఆ పార్టీల బలం కేవలం మీడియాలోనే అని వెటకరించారు. క్షేత్రస్థాయిలో ఆ పార్టీల బలం శూన్యమని ఆయన చెప్పుకొచ్చారు. బీజేపీ 15-20 సీట్లలో, కాంగ్రెస్ 20-25 సీట్లలో తమకు పోటీ ఇవ్వగలదని ఆయన అన్నారు.
ఎర్రబెల్లి చెబుతున్నట్టు బీజేపీ మరీ అంత బలహీనంగా ఉందా? అలాగే కాంగ్రెస్ భారీగా పతనం అయ్యిందా? అనే చర్చకు తెరలేచింది. ఇదిలా వుండగా ఎర్రబెల్లి అంటున్నట్టు ప్రజావ్యతిరేకత ఎదుర్కొంటున్న ఆ 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరనే చర్చ ఎక్కువగా అధికార పార్టీలోనే జరుగుతోంది.