ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీలో ధిక్కార స్వరాలు వినిపిస్తున్నాయి. చంద్రబాబుపై విజయవాడ ఎంపీ కేశినేని నాని చాలా కాలంగా తీవ్ర అసంతృప్తిగా ఉన్న సంగతి తెలిసిందే. ఆ మధ్య చంద్రబాబు ఢిల్లీ వెళ్లినప్పుడు మర్యాదపూర్వకంగా బొకే ఇవ్వడానికి కూడా నాని అంగీకరించలేదు. పైపెచ్చు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ఇచ్చిన బొకేను కేశినేని నాని విసురుగా తోసేసయడం అప్పట్లో చర్చనీయాంశమైంది.
రెండు రోజుల క్రితం తన తమ్ముడు కేశినేని చిన్నితో పాటు మరో ముగ్గురు టీడీపీ నాయకులపై నాని ఘాటు వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. తాజాగా చంద్రబాబుపైనే ఆయన లెక్క లేకుండా మాట్లాడ్డం టీడీపీ శ్రేణుల్ని నివ్వెరపరుస్తోంది. విజయవాడ ఎంపీగా పోటీ చేయరనే ప్రచారంపై కేశినేని ఘాటుగా స్పందించారు. ఎంపీగా పోటీ చేయనని ఎవరన్నారని ఆయన ప్రశ్నించారు. ప్రజలు కోరుకుంటే ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో దిగుతానని, ప్రజలు గెలిపిస్తారని చెప్పుకొచ్చారు. తనకు చంద్రబాబు టికెట్ ఇవ్వకపోతే ఏమవుతుందని కేశినేని నాని షాకింగ్ కామెంట్స్ చేశారు.
చంద్రబాబుతో తాడోపేడో తేల్చుకునేందుకే కేశినేని సిద్ధమయ్యారనే చర్చ పెద్ద ఎత్తున నడుస్తోంది. అందుకే బాబు తనకు టికెట్ ఇవ్వకపోతే ఏమవుతుందని నిలదీసే పరిస్థితి వచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తన వ్యతిరేకులను చంద్రబాబు, టీడీపీ అధిష్టాన పెద్దలు కొందరు ఉద్దేశపూర్వకంగా ప్రోత్సహించడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారని అంటున్నారు. తన ఆవేదన తెలియజేయడానికే కేశినేని ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సేవ చేసే వారిని జనం ఆదరిస్తారని ఆయన చెప్పుకొచ్చారు.
గతంలో ప్రధాని మోదీనే పార్లమెంట్ సాక్షిగా వ్యతిరేకించడాన్ని ఆయన గుర్తు చేశారు. అయినంత మాత్రాన బెజవాడలో పనులు ఆగాయా? అని ఆయన ప్రశ్నించారు. తన స్థాయి ఏంటో గుర్తించుకోవాలని ఆయన ప్రత్యేకంగా చెప్పారు. తన వ్యక్తిత్వాన్ని డీగ్రేడ్ చేయాలని చూడొద్దని టీడీపీ అధిష్టానానికి పరోక్షంగా ఆయన హెచ్చరిక జారీ చేశారు.