బీఆర్ఎస్‌లో తోట చేరిక వెనుక‌…వేల కోట్ల డీల్!

బీఆర్ఎస్‌లో జ‌న‌సేన నాయ‌కుడు తోట చంద్ర‌శేఖ‌ర్ చేరిక వెనుక వేల కోట్ల లావాదేవీలున్నాయా? అంటే…ఔన‌ని బీజేపీ ఎమ్మెల్యే, లాయ‌ర్ ర‌ఘునంద‌న్‌రావు లెక్క‌ల‌తో స‌హా చెబుతున్నారు. బీఆర్ఎస్ ఏపీ అధ్య‌క్షుడిగా తోట చంద్ర‌శేఖ‌ర్ కావ‌డం వెనుక…

బీఆర్ఎస్‌లో జ‌న‌సేన నాయ‌కుడు తోట చంద్ర‌శేఖ‌ర్ చేరిక వెనుక వేల కోట్ల లావాదేవీలున్నాయా? అంటే…ఔన‌ని బీజేపీ ఎమ్మెల్యే, లాయ‌ర్ ర‌ఘునంద‌న్‌రావు లెక్క‌ల‌తో స‌హా చెబుతున్నారు. బీఆర్ఎస్ ఏపీ అధ్య‌క్షుడిగా తోట చంద్ర‌శేఖ‌ర్ కావ‌డం వెనుక పెద్ద త‌తంగ‌మే న‌డిచింద‌ని ఆయ‌న విరుచుకుప‌డ్డారు. ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేయ‌డం గ‌మ‌నార్హం.

హైద‌రాబాద్ న‌గ‌రంలోని మియాపూర్‌లో సర్వే నంబర్ 78 లో40 ఎకరాలు తోట చంద్ర‌శేఖ‌ర్‌ కొన్నారని ఆరోపించారు. ఇది వివాదాస్ప‌ద భూమి అని అయ‌న చెప్పారు. రూ.4 వేల కోట్ల విలువైన భూముల‌ను తోట చంద్ర‌శేఖ‌ర్‌కు అప్ప‌గించార‌ని ర‌ఘునంద‌న్‌రావు సంచ‌ల‌న ఆరోప‌ణ చేశారు. బీహార్‌కు చెందిన ఐఏఎస్ అధికారి సోమేశ్‌కుమార్ నేతృత్వంలో మియాపూర్ భూస్కామ్ జ‌రిగిన‌ట్టు ఆరోపించారు.

ఇందులో రంగారెడ్డి జిల్లా క‌లెక్ట‌ర్ పాత్ర కూడా ఉన్న‌ట్టు ఆయ‌న చెప్పుకొచ్చారు. గ‌తంలో ఆంధ్రోళ్ల‌ను కేసీఆర్ దొంగ‌లుగా దూషించార‌ని గుర్తు చేశారు. ఇప్పుడు అదే ఆంధ్రా వాళ్లు బంధుమిత్రులుగా ఎలా మారిపోయారో చెప్పాల‌ని ర‌ఘునంద‌న్ డిమాండ్ చేశారు. భూ దందా కోసమే తోట చంద్రశేఖర్‌ను కేసీఆర్ బీఆర్ఎస్‌లో చేర్చుకుని ఏపీకి అధ్యక్షుడిని చేశారని విమర్శించారు.

అప్ప‌నంగా దోచేసిన సొమ్ముతో ఖ‌మ్మం బీఆర్ఎస్ స‌భ‌ను నిర్వ‌హించే బాధ్య‌త‌ను తోట చంద్ర‌శేఖ‌ర్‌కు అప్ప‌గించార‌న్నారు. అలాగే ఏపీలో బీఆర్ఎస్‌ను న‌డ‌ప‌డానికి మియాపూర్‌లో వివాదాస్ప‌ద‌ భూమిని క‌ట్ట‌బెట్టార‌ని ఆయ‌న ఆరోపించారు. మియా పూర్‌లో వ్యాపార వేత్త సుఖేష్ గుప్తా కొన్న 8 ఎకరాలపై సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ వేసిన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ .. తోట చంద్రశే ఖర్ భూములపై ఎందుకు న్యాయ‌స్ధానానికి వెళ్లలేదని ప్రశ్నించారు.

సుఖేశ్ గుప్తాకు ఓ న్యాయం.. తోట చంద్రశేఖర్ కు ఓ న్యాయమా అని ఆయ‌న‌ నిలదీశారు. ఈ భూమిపై తాము న్యాయ‌పోరాటం చేస్తామ‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ కనుసన్నల్లోనే ఈ భూకుంభ కోణాలు జరిగాయని ఆరోపించారు. కేసీఆర్ కు బీఆర్ఎస్ ఆఫీసర్లంటే ప్రేమ ఎక్కువని అన్నారు. బీఆర్ఎస్ అంటే బీహార్ రాష్ట్ర సమితి అని విమర్శించారు.