వాల్తేరు వీరయ్య కాస్తా భోళాశంకర్ గా మారాడు. సంక్రాంతి బరిలో వీరయ్యగా సక్సెస్ అందుకున్న చిరంజీవి, ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంతో తన కొత్త సినిమా, కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేశారు. అదే భోళాశంకర్.
మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది భోళాశంకర్ సినిమా. ఈ సినిమా కోసం భారీ కోల్ కతా సెట్ వేశారు. ఆ సెట్ లోనే ఇవాళ్టి నుంచి కొత్త షెడ్యూల్ మొదలుపెట్టారు.
ఈ మేరకు సెట్ కు సంబంధించిన ఓ పిక్ ను రిలీజ్ చేసింది యూనిట్. అందులో నిర్మాత అనీల్ సుంకర, దర్శకుడు మెహర్ రమేష్ స్టయిల్ గా నిల్చొని ఫొటోకు పోజులిచ్చారు.
రీమేక్ ప్రాజెక్టుగా వస్తోంది భోళాశంకర్. ఈ సినిమాలో చిరంజీవి సరసన తమన్న హీరోయిన్ గా నటిస్తోంది. మరో హీరోయిన్ కీర్తిసురేష్, చిరంజీవి చెల్లెలి పాత్రలో కనిపించనుంది. సినిమాకు సంబంధించి ఇప్పటికే 60 శాతానికి పైగా షూటింగ్ పూర్తయింది.
వాల్తేరు వీరయ్య థియేటర్లలోకి వచ్చేయడంతో, ఇకపై తన ఫోకస్ మొత్తం భోళాశంకర్ పైనే పెట్టబోతున్నారు చిరు. వీలైనంత తొందరగా ఈ సినిమాను పూర్తిచేసి, ఇదే ఏడాదిలో సినిమాను రిలీజ్ చేయబోతున్నారు.
ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నాడు. రావురమేష్, మురళీ శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు.