జనసేనాని, తన మిత్రుడు పవన్‌కల్యాణ్‌పై పోటీకి ప్రముఖ నటుడు, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు అలీ సై అని అన్నారు. మంత్రి ఆర్కే రోజా ప్రాతినిథ్యం వహిస్తున్న నగరిలో ఆయన సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజకీయాలపై తనవైన అభిప్రాయాల్ని నిర్మొహమాటంగా చెప్పారు. సీఎం జగన్ ఆదేశిస్తే… ఎవరిపైనైనా, ఎక్కడి నుంచైనా పోటీకి సిద్ధమన్నారు. పవన్‌పై పోటీ చేయడానికి రెడీ అని తేల్చి చెప్పారు.
అలీ, పవన్‌కల్యాణ్ మంచి మిత్రులు. చాలా సినిమాల్లో ఇద్దరూ కలిసి నటించారు. ఇద్దరూ కలిస్తే సరదాలకు తక్కువేం ఉండదు. అయితే వైసీపీలో అలీ చేరడంతో వాళ్లిద్దరి మధ్య గ్యాప్ వచ్చిందనే ప్రచారం జరుగుతోంది. అలీ కుమార్తె పెళ్లికి కూడా పవన్ వెళ్లకపోవడంపై పెద్ద చర్చే జరిగింది. అయితే విమానం ఆలస్యం కావడంతో పవన్ పెళ్లికి రాలేకపోయినట్టు అలీ వివరణ ఇచ్చారు. ఇంటికొచ్చి కూతురు, అల్లుడిని ఆశీర్వదిస్తానని పవన్ తనకు ఫోన్ చేసి చెప్పనట్టు అలీ పేర్కొన్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో రాజకీయంగా ప్రత్యర్థి అయిన పవన్‌పై పోటీకి సన్నద్ధంగా ఉన్నట్టు అలీ ప్రకటించడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాజకీయం, సినిమా, స్నేహం వేర్వేరన్నారు. రాష్ట్రానికి ఎవరు మేలు చేశారో, చేస్తారో ప్రజలకు బాగా తెలుసని అలీ అన్నారు. 175కు 175 సీట్లలో వైసీపీ గెలుస్తుందని అలీ ధీమా వ్యక్తం చేశారు. మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీతో రోజాకు మంచి సంబంధాలున్నాయన్నారు. రాజకీయాల్లో విమర్శలకు ప్రతి విమర్శలు చేయడం సహజమన్నారు.
రోజాను డైమండ్ రాణి అని పవన్ కామెంట్ చేయడంపై అలీ అదిరిపోయే కామెంట్ చేశారు. డైమండ్ చాలా పవర్ ఫుల్ అని, అది విలువైనదని ఆయన అన్నారు. పవన్ విమర్శల్ని కూడా అలీ సానుకూల ధోరణిలో అభివర్ణించి అసలుసిసలు రాజకీయ వేత్త అనిపించుకున్నారు. రోజా ఎంతో విలువైన నాయకురాలిగా పవన్ విమర్శల్ని తిప్పికొట్టారు. పవన్‌పై పోటీకి సిద్ధమని అలీ ప్రకటనపై జనసేన ఎలా స్పందిస్తుందో చూడాలి.