Advertisement

Advertisement


Home > Politics - Opinion

కులాన్ని పెంచి పోషించినది ఎవరు?

కులాన్ని పెంచి పోషించినది ఎవరు?

సంక్రాంతి సందర్భంగా విడుదలైన రెండు భారీ సినిమాల నేపథ్యంలో కమ్మ..కాపు కులాలను రెచ్చగొట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించిందని సీనియర్ జ‌ర్నలిస్ట్ ఆర్కే తన కొత్త పలుకులో చెప్పుకువచ్చారు. సంయుక్త ఆంధ్ర ప్రదేశ్ విభజ‌న అనంతరం తెలంగాణ బాగుపడిందని, ఆంధ్ర మాత్రం కుల విద్వేషంతో కొట్టుకుంటోందని విమర్శించారు. మళ్లీ ఆయనే తెలంగాణ చీఫ్ సెక్రటరీ నియామకాన్ని కూడా కుల కోణంలో చూస్తున్నారంటూ ఓ కామెంట్ విసిరారు. మొత్తం మీద కులాలను రెచ్చ కొట్టి, లేదా కులభావనలను మేలుకొలిపి వైకాపా రాబోయే ఎన్నికల్లో పబ్బం గడుపుకోవాలని అనుకుంటోందని తీర్మానించేసారు. అంతే తప్ప చిరంజీవి, బాలకృష్ణల వెనుక కులాల కోణం అస్సలు లేదని, అందరూ వారిని అభిమానిస్తారని అన్నారు.

నిజ‌మే..హీరోలను కులాలకు అతీతంగా అందరూ అభిమానిస్తారు. అందులో అసత్యం లేదు. కానీ వాస్తవం కూడా తెలుసుకోవాలి కదా. కులాల కోణం అన్నది వైకాపా తోనో, జ‌గన్ తోనో, వైఎస్సార్ తోనో ఆంధ్రలో మొదలైందా? అసలు ఆంధ్రలో కులాల కోణం ఇప్పటిదా? వైఎస్సార్, జ‌గన్ లేకపోతే అసలు ఆంధ్ర నాట కులం కలకలం అన్నదే లేదా? ఒక్కసారి వెనక్కు చూసుకుంటే..

ఒకానొక సమయంలో కమ్మ పురోహితులను ఎందుకు ప్రవేశ పెట్టారు? ఎవరు ప్రవేశపెట్టారు. బ్రాహ్మణ పురోహితులు పనికి రారు అని ఎందుకు భావించారు? అప్పటికి వున్న వివాహ విధి విధానం స్థానంలో కమ్మ వివాహ విధి విధానం ఎందుకు ప్రవేశ పెట్టాల్సి వచ్చింది? మరే ఇతర కులంలో అయినా ఇలా కొత్త పురోహిత విధి విధానం అనే ఆలోచన చేసారా? కమ్మ వారికే ఇలాంటి అవసరం ఎందుకు కలిగింది?

హరనాధ్ లాంటి హీరో నేలకు జారిపోవడం వెనుక ఎఎన్నార్..ఎన్టీఆర్ వున్నారని అప్పట్లో ఎందుకు కథలు కథలుగా చెప్పుకునేవారు? హరనాథ్ ను అలవాట్లకు బానిస చేసి అణగదొక్కారని ఏ సోషల్ మీడియా, ఏ పీకే లాంటి ఎన్నికల ప్లానర్ లేని రోజుల్లో ఎలా వ్యాప్తిలోకి వచ్చింది? ఎందుకు వచ్చింది? అందులో నిజ‌మెంత?

కేవలం ఒకే సామాజిక వర్గానికి చెందిన వారే చిరకాలం పాటు టాలీవుడ్ ను ఎలా ఏలగలిగారు? మరే ఇతర కులానికి ఈ చాన్స్ ఎందుకు పెద్దగా రాలేదు? చిరంజీవి వచ్చే వరకు,  దాసరి ఓ రేంజ్ కు వెళ్లే వరకు కాపులకు టాలీవుడ్ లో దక్కిన అవకాశాలు ఎన్ని?

మరి కులపోరాటం అన్నది కొత్తగా వచ్చినట్లు మాట్లాడతారేమిటి?

సినిమా రంగాన్ని పక్కన పెట్టి రాజ‌కీయాలు చూసుకుంటే కమ్మ కులం అన్నది తన ప్రాబల్యం నిలబెట్టుకోవడానికి సదా కృషి చేస్తూనే వుంది కదా? ఓ దినపత్రిక ఓ పథకం ప్రకారం కాంగ్రెస్ ను తెలుగునాట దిగజారుస్తూ వచ్చింది వాస్తవం కాదా? అంజ‌య్య లాంటి ముఖ్యమంత్రిని ప్రజ‌ల్లో చులకన చేసింది అదే పత్రిక కాదా? కాంగ్రెస్ ను ప్రజ‌ల్లో పలుచన చేస్తూ తెలుగుదేశం పార్టీకి గ్రౌండ్ ప్రిపేర్ చేయడం వెనుక కులం అజెండా లేదంటే నమ్మాలా?

తెలుగుదేశం పార్టీ ఆరంభంలో దాంట్లో ప్రముఖ పాత్ర పోషించిన వారు ఎన్టీఆర్, నాదెండ్ల, ఉపేంద్ర, ఇంకా మరి కొందరు. వీరంతా ఒకే కులానికి చెందిన వారు కావడం యాధృశ్ఛికమా? వీరికి అదే కులానికి చెందినవారి మీడియా సంస్థ అన్ని విధాలా సహాయ సహకారాలు అందించడం ఇంకా యాదృశ్ఛికమా? ఇలా చేస్తే మాత్రం కులపిచ్చ కాదు. దానిని ఎవరు ప్రశ్నిస్తే వారికి కులపిచ్చ వున్నట్లు..అంతే కదా? సినిమా రంగంలోని రామానాయుడు, అశ్వనీదత్, మురళీమోహన్, వారందరికీ తెలుగుదేశంలో అవకాశాలు దక్కాయి. వీరందరి కులం ఒకటే కావడాన్ని ఏ కోణంలో చూడాలి? ఎన్టీఆర్ పవర్ లోకి వస్తూనే ఎక్కడి నుంచో వెదికి మరీ తెచ్చిన కాకర్ల, కోనేరు, నార్ల వంటి ప్రముఖులందరి కులం ఒకటే కావడం కూడా అస్సలు పట్టించుకోకుండా వదిలేయాల్సిన అంశమేనా?

ఒక్క కుటుంబం లేని నియోజ‌కవర్గాల్లో కూడా ఏరి కోరి తమ సామాజిక వర్గాల వారికే టికేట్ లు కేటాయించింది ఎన్టీఆర్ కాదా? బిసిలు అధికంగా వుండే, అసలు కమ్మవారి ప్రసక్తి లేని ఇచ్ఛాపురం, చీపురుపల్లి లాంటి చోట్ల తొలిసారి ఎన్టీఆర్ తమ సామాజీకులకు టికెట్ లు ఏ ప్రాతిపదికన ఇచ్చారు. మరి దీనిని ఏ విధంగా చూడాలి?

ఒకప్పుడు తెలంగాణ రెడ్లు, రాయలసీమ రెడ్లు, కోస్తా రెడ్లు, నెల్లూరు రెడ్లుగా విడిపోయి అనైక్యతతో వుండేవారు. వీళ్ల కాళ్లు వాళ్లు..వాళ్ల కాళ్లు వీళ్లు లాక్కునేవారు. కమ్మవారి ఐక్యత చూసి, వైఎస్సార్ అందరికీ ఒక తాటి మీదకు తీసుకురాగలిగారు. కమ్మవారి ఏలుబడిలో, ఐక్యత కారణంగా తమకు జ‌రుగుతున్న అన్యాయం చూసి రెడ్లు ఒక్కటయ్యారు. అది ఇప్పుడు కంటగింపుగా మారుతోంది. అందుకు ఇప్పుడు కులము..కులము అని ఆవులిస్తున్నారు.

కులాలు కొత్తగా రాలేదు. రెడ్డి హాస్టళ్లు, కమ్మ సంఘాలు జ‌గన్ తోనో, ప్రశాంత్ కిషోర్ తోనో రాలేదు. చరిత్రలోనే వున్నాయి. ఆఖరికి చరిత్ర కెక్కిన పల్నాటి యుద్దం వెనుక కులం కోణం వుందనే వాదనలు వున్నాయి. రాయలసీమలో ఫ్యాక్షనిజం పురుడు పోసుకోవడం వెనుక ఆంధ్ర నుంచి అక్కడకు వలస వెళ్లి, ముందుగా వ్యవసాయం ఆపై అధికారం అందుకోవడానికి జ‌రిగిన ప్రయత్నాలు వున్నాయనే కథనాలు వున్నాయి.

ఆంధ్రలో కులపిచ్చ వుంది..తెలంగాణలో లేదు అంటున్నారు. మరి నిజామాబాద్, బోధన్, అమీర్ పేట్ ఇలా చాలా అంటే చాలా చోట్ల వున్న కమ్మసంఘాల వైనం ఏమిటి? బాలయ్య సినిమా మొన్న విడుదలైతే బోధన్ లో 150 కార్లతో కమ్మవారు చేసి ర్యాలీ ని ఏ విధంగా చూడాలి?

తెల్లవారుఝమున నాలుగు గంటలకు హైదరాబాద్ లోని అన్ని చోట్ల 200 వందలకే వీరసింహారెడ్డి సినిమా చూపిస్తే కూకట్ పల్లిలో మాత్రం బెనిఫిట్ షో అంటూ 2000 టికెట్ వసూలు చేసారు కదా. మరి దీని వెనుక ఏముంది? ఎవరున్నారు? ఇదేమీ జ‌గన్ దో, పీకె దో వ్యూహం కాదు కదా? చిరంజీవి వాల్తేర్ వీరయ్య సినిమాకు ఇలా ఏమీ జ‌రగలేదు కదా?

జ‌గన్ వచ్చిన తరువాతే విజ‌యవాడలో కులసమరాలు జ‌రిగాయా? ఈస్ట్ లో చాలా చోట్ల కాపులకు కమ్మలకు మధ్య వైరుధ్యం నెలకొందా? ఇవ్వాళ భాజ‌పాకు జ‌గన్ ను దత్తపుత్రుడు అంటున్నారు. అసలు ఏ కులం ఈక్వేషన్ తో భాజ‌పాను చాలా కాలం పాటు తెలుగుదేశం బి టీమ్ గా మార్చేసింది ఎవరు?

కులం తెలుగునాట కొత్తగా పురుడు పోసుకోలేదు. ప్రశాంత్ కిషోర్ నో, జ‌గన్ నో దాన్ని పెంచి పోషించలేదు. కులాల సమరం అన్నది ఆంధ్రుల చరిత్రలో అడుగు అడుగునా వుంది. సినిమా రంగంలో మరీ ఎక్కువగా వుంది. కాదని ఎవరు పైకి అన్నా అది అబద్దమే అవుతుంది ..ఆత్మ వంచనే అవుతుంది. దానికి ఉదాహరణలు రాసుకుంటూ పోతే అది పెద్ద ఉద్గ్రంధమే అవుతుంది.

చరిత్ర అన్నది కుర్రకారుకు తెలియదు కనుక..కాపు కుర్రాళ్లకను మిమ్మల్ని జ‌గన్ ఎగసం దోస్తున్నాడు అని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్ లో ఎక్కడి వాస్తవాలు అక్కడ పదిలంగా వున్నాయి.

-వెంకట్

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?