తన తండ్రి వైఎస్ వివేకా హత్య కేసులో దోషులను సమాజం ఎదుట నిలబెట్టేందుకు డాక్టర్ వైఎస్ సునీత అలుపెరగని పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో మరో సారి ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించడం విశేషం. తనను సీబీఐ విచారిస్తున్న నేపథ్యంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో రకరకాల అంశాల్ని ఆయన ప్రస్తావించారు.
రెండో భార్య కొడుకును వారసుడిగా ప్రకటించే క్రమంలో వివేకా హత్య జరిగి ఉండొచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. 2010లో షేక్ షమీమ్ అనే మహిళను వివేకా వివాహం చేసుకున్నారని, దీంతో ఆయన కూతురు సునీతతో సంబంధాలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. 2015లో షమీమ్, వివేకాకు ఓ కుమారుడు పుట్టాడని తెలిపారు. తమ కుటుంబం నుంచి దూరంగా ఉండాలంటూ వైఎస్ సునీత బెదిరించిందని సీబీఐకి ఇచ్చిన వాగ్మూలంలో షమీమ్ స్పష్టంగా చెప్పిందని రిట్ పిటిషన్లో అవినాష్ పేర్కొన్నారు.
రెండో వివాహం తర్వాత కుటుంబ సభ్యులు వివేకా చెక్ పవర్‌ను తొలగించారని పేర్కొన్నారు. వైఎస్ సునీత, వివేకా సతీమణి హైదరాబాద్‌లో ఉంటే, వివేకా మాత్రం ఒంటరిగా పులివెందుల ఇంట్లో ఉండేవారని తెలిపారు. వివేకా వారసత్వం ఎవరికి అన్న విషయంలో ఆయన హత్య జరిగి ఉండొచ్చని అవినాష్ అనుమానం వ్యక్తం చేయడం గమనార్హం.
ఈ నేపథ్యంలో రిట్ పిటిషన్లో తన పేరు ప్రస్తావించారని, కావున తన వాదన వినాలని ఇవాళ డాక్టర్ సునీత హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు ఆమె పిటిషన్‌పై ఎలా స్పందిస్తుందో అనే చర్చకు తెరలేచింది. డాక్టర్ సునీత పోరాటం వల్లే సీబీఐ విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే.
దీంతో సునీతపైనే అనుమానం వచ్చేలా అవినాష్ రిట్ పిటిషన్ దాఖలు చేయడం, తన వాదన వినాలని ఆమె కోరుతున్న నేపథ్యంలో హైకోర్టు సానుకూలంగా స్పందించే అవకాశం ఉందనే వాదన వినవస్తోంది. అక్కాతమ్ముడి పిటిషన్లపై హైకోర్టులో ఎలాంటి వాదనలు వుంటాయో చూడాలి.