మ‌ళ్లీ ఆ గ‌ట్టు చేరిన ష‌ర్మిల అనుచ‌రులు

వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ ష‌ర్మిల అనుచ‌రులు మ‌ళ్లీ బీఆర్ఎస్ గ‌ట్టుకే చేరారు. గ‌తంలో బీఆర్ఎస్ నుంచి ష‌ర్మిల పార్టీలో చేరిన గట్టు రామ‌చంద్ర‌రావుతో పాటు మ‌రికొంద‌రు తిరిగి అధికార పార్టీ నీడ‌లోకే వెళ్ల‌డం గ‌మ‌నార్హం.…

వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ ష‌ర్మిల అనుచ‌రులు మ‌ళ్లీ బీఆర్ఎస్ గ‌ట్టుకే చేరారు. గ‌తంలో బీఆర్ఎస్ నుంచి ష‌ర్మిల పార్టీలో చేరిన గట్టు రామ‌చంద్ర‌రావుతో పాటు మ‌రికొంద‌రు తిరిగి అధికార పార్టీ నీడ‌లోకే వెళ్ల‌డం గ‌మ‌నార్హం. రాజ‌న్న రాజ్యం తీసుకొస్తానంటూ వైఎస్ ష‌ర్మిల తెలంగాణ‌లో సొంతంగా పార్టీ పెట్టారు. ఊరూరా తిరుగుతూ ప్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకున్నారు. సుదీర్ఘ పాద‌యాత్ర చేస్తూ, అధికార పార్టీ నేత‌ల‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు.

కొంత మంది ష‌ర్మిల పార్టీలో చేరారు. అయితే ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో రాజ‌కీయంగా ఊపు లేక‌పోవ‌డాన్ని గ‌మె గ‌మ‌నించారు. పాలేరులో పోటీ చేస్తాన‌ని ష‌ర్మిల ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ, అక్క‌డ నెగ్గే ప‌రిస్థితి లేద‌ని గ్ర‌హించారు. కాంగ్రెస్‌లో త‌న పార్టీని విలీనం చేసేందుకు ష‌ర్మిల ప్ర‌య‌త్నించారు. కానీ రేవంత్‌రెడ్డి అడ్డుకున్నారు. చివ‌రికి ఎలాంటి ష‌ర‌తులు లేకుండానే, ఎవ‌రూ అడ‌గ‌కుండానే కాంగ్రెస్ పార్టీకి ఆమె మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు.

ష‌ర్మిల నిర్ణ‌యాన్ని సొంత పార్టీ నాయకులు, కార్య‌క‌ర్త‌లు తీవ్రంగా వ్య‌తిరేకించారు. ష‌ర్మిల‌ను తెలంగాణ నుంచి బ‌హిష్క‌రిస్తు న్న‌ట్టు గ‌ట్టు రామచంద్ర‌రావు నేతృత్వంలోని వైఎస్సార్‌టీపీ నేత‌లే ప్ర‌క‌టించ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఇక‌పై తెలంగాణ‌లో ఆమెను ఎక్క‌డా పోటీ చేయ‌నివ్వ‌మ‌ని వారంతా హెచ్చ‌రించారు. పార్టీకి మూకుమ్మ‌డిగా రాజీనామా ప్ర‌క‌టించారు. ఈ నేప‌థ్యంలో గ‌ట్టు నేతృత్వంలో వైఎస్సార్టీపీ నాయ‌కులు, జిల్లా కోఆర్డినేట‌ర్లు మంత్రి హ‌రీష్‌రావు స‌మ‌క్షంలో బీఆర్ఎస్‌లో చేరారు.

హ‌రీష్‌రావు మాట్లాడుతూ వైఎస్సార్‌టీపీని విలీనం చేయ‌డానికి వ‌చ్చిన నాయకుల‌ను స్వాగ‌తిస్తున్నామ‌న్నారు. రాజ‌కీయం కోసం తండ్రి సమానులైన కేసీఆర్‌ను నానా మాటలు తిట్టి, చివ‌రికి పార్టీని గాలికి వదిలేసిన నాయకురాలు షర్మిల అని హ‌రీష్‌రావు విమ‌ర్శించారు. కాంగ్రెస్‌లో త‌న పార్టీని విలీనం చేయాల‌ని ష‌ర్మిల అనుకుంటే, ఆ పార్టీ నాయ‌కులు మాత్రం బీఆర్ఎస్‌లో విలీనం చేసిన‌ట్టు ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం.