Advertisement

Advertisement


Home > Politics - Telangana

న‌న్ను క్ష‌మించండి

న‌న్ను క్ష‌మించండి

కాంగ్రెస్ ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డికి అదే పార్టీ నాయ‌కుడు అద్దంకి ద‌యాక‌ర్ మీడియా ముఖంగా క్ష‌మాప‌ణ చెప్పారు. మునుగోడు నియోజకవర్గం చండూరులో శుక్ర‌వారం నిర్వహించిన బహిరంగ సభలో అద్దంకి ద‌యాక‌ర్ రెచ్చిపోయారు. మునుగోడు నుంచి ప్రాతినిథ్యం వ‌హిస్తున్న కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి పార్టీకి, ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో మునుగోడులో కాంగ్రెస్‌ను కాపాడుకునేందుకు టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి ఆధ్వ‌ర్యంలో బ‌హిరంగ స‌భ నిర్వ‌హించారు.

ఈ స‌భ‌లో అద్దంకి ద‌యాక‌ర్ మాట్లాడుతూ కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్‌పై తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. రాజ‌గోపాల్‌రెడ్డి పార్టీని అడ్డు పెట్టుకుని ఎదిగార‌న్నారు. ఇప్పుడు అదే పార్టీకి ద్రోహం చేశార‌న్నారు. అదే విధంగా రాజ‌గోపాల్‌రెడ్డి అన్న వెంక‌ట‌రెడ్డి ఏ గ‌ట్టున ఉంటారో తేల్చుకోవాల‌ని కోరారు. ఇక్క‌డ స‌భ నిర్వ‌హిస్తుంటే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను క‌ల‌వాల్సిన అవ‌స‌రం వెంక‌ట‌రెడ్డికి ఏముంద‌ని ప్ర‌శ్నించారు.

పార్టీలో ఉండాలో, వెళ్లిపోవాలో తేల్చుకోవాల‌ని చెప్పే క్ర‌మంలో అభ్యంత‌ర‌క‌ర ప‌దం వాడారు. దీనిపై కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి బ్ర‌ద‌ర్స్‌, వారి అనుచ‌రులు ఆవేద‌న, ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అద్దంకి ద‌యాకర్ క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ శ్రేణులు నిర‌స‌న‌కు దిగాయి. ద‌యాక‌ర్ ప‌రుష ప‌ద‌జాలంపై కాంగ్రెస్ అధిష్టానం కూడా సీరియ‌స్ అయింది. ఈ నేప‌థ్యంలో ద‌యాక‌ర్ మీడియా స‌మావేశం నిర్వ‌హించారు.

పార్టీకి న‌ష్టం చేస్తున్నార‌నే ఆవేద‌న‌తో వెంక‌ట‌రెడ్డిపై మాట్లాడిన‌ట్టు వివ‌ర‌ణ ఇచ్చారు. ప‌రుష ప‌ద‌జాలం వాడ‌డంపై వెంక‌ట‌రెడ్డి, ఆయ‌న అనుచ‌రుల‌కు ద‌యాక‌ర్ వివ‌ర‌ణ ఇచ్చారు. తాను చేసిన వ్యాఖ్య‌తో పార్టీకి న‌ష్టం జ‌రుగుతోంద‌ని త‌న దృష్టికి రావ‌డంతో వ్య‌క్తిగ‌త హోదాలో వెంక‌ట‌రెడ్డి, ఆయ‌న అనుచ‌రుల‌కు క్ష‌మాప‌ణ చెబుతున్నాన‌న్నారు. 

తాను పార్టీ క్ర‌మ‌శిక్ష‌ణ దాటే వ్యక్తిని కాద‌న్నారు. పార్టీకి న‌ష్టం క‌లిగించాల‌ని తాను ఎప్పుడూ అనుకోన‌న్నారు. మీడియా స‌మావేశానికి వ‌స్తున్నప్పుడు షోకాజ్ నోటీసు వ‌చ్చిన‌ట్టు తెలిసింద‌న్నారు. దాన్ని త‌ప్పుగా భావించ‌డం లేద‌న్నారు. షోకాజ్ నోటీసు వ‌చ్చేలోపు తామే అధిష్టానానికి లేఖ రాయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు ద‌యాక‌ర్ తెలిపారు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?