
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు గడువు ముంచుకొస్తోంది. మరో వారంలోపు ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం వుంది. తెలంగాణలోని అన్ని రాజకీయ పక్షాలతో కేంద్ర ఎన్నికల సంఘం సమావేశం కూడా నిర్వహించింది. సలహాలు, సూచనలను కేంద్ర ఎన్నికల సంఘం తీసుకుంది. ఎన్నికల ముంగిట ప్రధాని మోదీ సంచలన కామెంట్స్ తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నాయి.
ప్రధాని కామెంట్స్, అనంతరం తెలంగాణ బీజేపీ నేతల కౌంటర్లు చూస్తే.... బీఆర్ఎస్‌లో చీలక కోసం వ్యూహం రచించినట్టు తెలుస్తోంది. కేటీఆర్‌ను సీఎం చేసేందుకు తన ఆశీస్సులను కేసీఆర్ కోరారని ప్రధాని మోదీ బాంబు పేల్చారు. ఎన్డీఏలో కూడా చేరుతానని తన వద్దకు కేసీఆర్ వచ్చినట్టు ప్రధాని మోదీ వ్యాఖ్యానించడం తెలంగాణలోని ప్రతిపక్షాలకు ఆయుధం ఇచ్చినట్టైంది.
మరోవైపు బీజేపీ జాతీయ కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఘాటు విమర్శలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రధాని మోదీ విమర్శలకు సంజయ్ కౌంటర్ కొనసాగింపుగా చూడాలి. మోదీని చూస్తే కేసీఆర్ కుటుంబం గజగజ వణుకుతోందని ఆయన అన్నారు. కేసీఆర్ నిజస్వరూపాన్ని ప్రధాని మోదీ బట్టబయలు చేశారని ఆయన చెప్పుకొచ్చారు. ప్రగతి భవన్‌లో అలజడి మొదలైందని, బీఆర్ఎస్‌లో చీలిక తప్పదన్నారు. బీఆర్ఎస్ నిట్టనిలువునా చీలుతుందని బండి సంజయ్ జోస్యం చెప్పడం గమనార్హం.
కేటీఆర్‌ను సీఎం చేయాలని అడగారనే ఆరోపణతో మంత్రి హరీష్‌రావుని రెచ్చగొట్టేందుకు బీజేపీ పావులు కదిపిందనే టాక్ వినిపిస్తోంది. హరీష్‌రావుకి తెలంగాణలో మంచి పట్టు వుంది. అందరికీ అందుబాటులో ఉండే నాయకుడిగా ఆయన్ను గుర్తిస్తారు. కేటీఆర్ కంటే హరీష్‌రావుకే బీఆర్ఎస్‌లో ఆదరణ ఉందని బీజేపీ భావన.
కేటీఆర్‌ను సీఎం చేస్తారనడం ద్వారా హరీష్‌రావుని తమ వైపు తిప్పుకునే కుట్రలకు తెరలేపినట్టు బీజేపీపై బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. ప్రాంతీయ పార్టీల్లో చీలక తేవడం బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య. మహారాష్ట్రలో బీజేపీ ఏం చేసిందో అందరికీ తెలుసు. ఇప్పుడు అదే ఫార్ములాను తెలంగాణలో ప్రయోగిస్తోంది. ఇది ఎంత వరకూ ఫలిస్తుందో చూడాలి.
నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా