Advertisement

Advertisement


Home > Politics - Telangana

కేసీఆర్ విలన్ అని తేల్చాక.. ఇద్దరిదీ ఒకటే వ్యూహం!

కేసీఆర్ విలన్ అని తేల్చాక.. ఇద్దరిదీ ఒకటే వ్యూహం!

‘ఒక కుక్కను చంపదలచుకుంటే గనుక.. ముందుగా అది పిచ్చిది అనే ముద్ర వేయి’ అనేది పురాతన ఇంగ్లిషు సామెత. ఇంచుమించుగా ఆ సామెతకు సరిపోలే విధంగా ఇప్పడు తెలంగాణ రాజకీయాలు కూడా నడుస్తున్నాయి. ‘‘ఒక పార్టీ లేదా ఒక నాయకుడు విలన్ అని ముందుగా ప్రజలందరినీ నమ్మించు ఆ తర్వాత నువ్వు ఎవ్వరిని ఓడించదలచుకుంటావో.. వారికి ఆ పార్టీతో సంబంధం ఉన్నట్టుగా ప్రచారం చేయి’’ అనేది ఆధునిక రాజకీయ నీతి.

తెలంగాణలో ఇప్పుడు అమలు అవుతున్నది అదే. భారత రాష్ట్ర సమితి అనే పార్టీ దుర్మార్గపు పార్టీగా ముద్ర వేసేందుకే అటు కాంగ్రెస్, ఇటు బిజెపి రెండూ కూడా తొలినుంచి ప్రయత్నించాయి. ఎంతో వరకు ఆ పనిలో సక్సీడ్ అయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీని ప్రజలు తిరస్కరించి, గద్దె దించారు కూడా. ఇప్పుడు పార్లమెంటు ఎన్నికలు వచ్చేసరికి.. తమకు ప్రత్యర్థి ఎవరైనా సరే.. వారిని ఓడించడానికి బీఆర్ఎస్ నే ఇరు పార్టీలూ అస్త్రంలాగా వాడుకుంటున్నాయి.

బీఆర్ఎస్ ఇప్పుడు ఓడిపోయిన పార్టీ. అంటే ప్రజలు తిరస్కరించిన పార్టీ. బీఆర్ఎస్ కు సన్నిహితమైన పార్టీ అంటే చాలు.. ఆ పార్టీని కూడా ప్రజలు అసహ్యించుకుంటారనేది ఒక నిరూపించబడిన సిద్ధాంతంలాగా కాంగ్రెస్ భాజపా భావిస్తున్నట్టుగా ఉంది.

బండి సంజయ్ నుంచి లక్ష్మణ్, కిషన్ రెడ్డి వరకు భాజపా నాయకులు ప్రతి ఒక్కరూ కూడా తెలంగాణలో కాంగ్రెస్ కు- భారాసతో రహస్య ఒప్పందం ఉన్నదని అంటూ ఉంటారు. అందుకు వాళ్లు రకరకాల ఉదాహరణలు చెబుతుంటారు. మరొకవైపు రేవంత్ రెడ్డి కూడా అదే పనిచేస్తున్నారు. భారాసకు, భాజపాకు మధ్య అవగాహన ఉన్నదని.. ఎంపీ నియోజకవర్గాల్లో బిజెపికి ఓటు వేయాలని, బీఆర్ఎస్ నాయకులు చాటుమాటు రహస్య ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితకు బెయిల్ రావడం కోసం.. బీఆర్ఎస్, బిజెపితో కుమ్మక్కు అయిందనేది కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణ. తమాషా ఏంటంటే.. కాంగ్రెస్, బిజెపిలు ఉభయులూ తెలంగాణలో ఈసారి 14-15 ఎంపీ సీట్లు సాధిస్తాం అని చెప్పుకుంటున్నాయి. నిజానికి ఎంపీ ఎన్నికల ప్రధాన సమరం ఆ రెండు పార్టీల మధ్యనే ఉంటుందని, బీఆర్ఎస్ పాత్ర నామమాత్రమేనని పలువురు అంచనా వేస్తున్నారు.

ఈ రెండు ప్రధాన పక్షాలు బీఆర్ఎస్ ను విలన్ గా ప్రజల ముందు నిరూపించేసి, తమ ప్రత్యర్థికి వారితో ముడిపెట్టడం ఒక్కటే తమ గెలుపుబాటగా భావిస్తున్నాయి. పాపం పదేళ్లపాటు తెలంగాణను ఏలిన పార్టీ పరిస్థితి.. ఎంతగా దిగజారిపోయిందో కదా అని పలువురు అనుకుంటున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?