Advertisement

Advertisement


Home > Politics - Telangana

పిడుక్కీ బియ్యానికీ ఒకటే మంత్రమా?

పిడుక్కీ బియ్యానికీ ఒకటే మంత్రమా?

పిడుగు పడినప్పుడు ధైర్యం కోసం, క్షేమం కోసం జపించే మంత్రం ఒకరకంగా ఉంటుంది. అలాగే.. బియ్యం కోసం భిక్షాటన చేస్తూ ఇల్లిల్లూ తిరుగుతున్నప్పుడు.. దాతల క్షేమం కోరుతూ జపించే మంత్రం ఇంకో రకంగా ఉంటుంది. ఆ రెండు సందర్భాల్లోనూ ఒకటే మంత్రం చెప్పేస్తా అంటే ఎలా కుదురుతుంది? అందుకే పిడుక్కీ బియ్యానికీ ఒకటే మంత్రం పఠించాలని అంటే ఎలా కుదురుతుంది? కానీ ప్రస్తుతం తెలంగాణలో అదే రాజకీయం నడుస్తోంది. మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యే ప్రభుత్వాన్ని కార్నర్ చేయడానికి చెబుతున్న మాటలు.. ఈ సామెతనే గుర్తు చేస్తున్నాయి.

కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి రావడానికి ముందు.. ఆరుగ్యారంటీలను ప్రకటించి ప్రజలను ఆకట్టుకుంది. ఫలితంగా వారికి అధికారం దక్కింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు, ఆరోగ్య శ్రీ పరిమితిని పదిలక్షల రూపాయలకు పెంచడం ద్వారా రేవంత్ ప్రమాణ స్వీకారం చేసిన ముహూర్తంలోనే రెండు గ్యారంటీలను అమలు చేశారు. ఆ తర్వాత మిగిలిన గ్యారంటీల అమలుకోసం విధివిధానాలు రూపొందించాలంటూ.. అధికార్లను ఆదేశించారు. ఒకవైపు ఆ కసరత్తు జరుగుతూండగా, ఒక్కొక్కటిగా వాటిని అమల్లోకి తెచ్చే ప్రయత్నంలో ఉన్నారు.

ఈలోగా గులాబీదళాలు మాత్రం.. మిగిలిన గ్యారంటీల విషయంలో రేవంత్ సర్కారు మోసం చేస్తుందని, పార్లమెంటు ఎన్నికలు పూర్తయ్యేదాకా వాటిని అమలు చేసేది ఉండబోదని.. అప్పటిదాకా సాగదీసి మొండిచెయ్యి చూపిస్తారని రకరకాలుగా నిందలు వేయడం చేస్తున్నారు.

మిగిలిన వాటిలో ఒక కీలకమైన హామీ, రాష్ట్రవ్యాప్తంగా అందరు ప్రజల్లోనూ ఎంతో ప్రభావం చూపించగల - 200 యూనిట్లు దాటని వారికి ఉచిత విద్యుత్తు కల్పించే హామీని ఫిబ్రవరి నుంచి ప్రభుత్వం అమలు చేస్తోంది. గులాబీ దళాలకు నోటమాట రావడం లేదు. కిమ్మనకుండా ఉంటున్నారు. అయితే ఈ ఉచితం అమలు కావడానికి తెల్ల రేషన్ కార్డులు ఉండడం అనే నిబంధనను ప్రభుత్వం నిర్దేశించింది.

మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మాత్రం ఈ వైఖరిని తప్పుపడుతున్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి లేని తెల్ల రేషన్ కార్డు నిబంధన, ఉచిత కరెంటుకు మాత్రం ఎందుకు ఉండాలని నిలదీస్తున్నారు. తద్వారా.. ఆర్టీసీలో కూడా ఈ నిబంధన తెచ్చి లబ్ధి పొందగల మహిళల సంఖ్యను తగ్గించవచ్చునని భావిస్తున్నారో..లేదా, 200 యూనిట్ల కంటె తక్కువ కరెంటు వాడే వాళ్లు ఎంతగొప్ప కులీనులు, సంపన్నులు అయినా సరే.. వారికి కూడా ఉచితంగా ఇవ్వాలని ప్రతిపాదిస్తున్నారో అర్థం కావడం లేదు.

ఒక్కొక్క పథకంలో లబ్ది పొందే వారి సంఖ్య, నిబంధనలను అమలుచేయడంలో ఉండగల ఆచరణాత్మక ఇబ్బందులు, వారికి ఉచిత లబ్ధి కల్పించడం ద్వారా ప్రభుత్వానికి పడే భారం.. ఇత్యాది అనేక విషయాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాలు పథకాలకు రూపకల్పన చేస్తాయి. ఉచితం అనే పేరు పెట్టాం కదా అని.. ప్రతి పథకానికీ ఒకే తరహా రూల్స్ అమలు కావడం అనేది ఎక్కడా జరగదు. ఈ మాత్రం చిన్న సంగతి బోధపరచుకోకుండా.. ప్రభుత్వం ఏదో ఒక నింద వేస్తూ గడిపేయాలనే ధోరణిలోనే అక్బరుద్దీన్ ఉన్నట్టుగా పలువురు విమర్శిస్తున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?