Advertisement

Advertisement


Home > Politics - Telangana

కౌంట‌ర్ మామూలుగా లేదు

కౌంట‌ర్ మామూలుగా లేదు

దేశ వ్యాప్తంగా ప్ర‌తిప‌క్షాల‌ను న‌యాన్నో, మ‌రో ర‌కంగానే బీజేపీ భ‌య‌పెడుతోంది. రాజ‌కీయంగా ప‌బ్బం గ‌డుపుకునేందుకు కేంద్ర ప్ర‌భుత్వం చేత‌ల్లో వున్న సీబీఐ, ఈడీ ద‌ర్యాప్తు సంస్థ‌ల‌ను బీజేపీ బాగా వాడుకుంటోంది. కానీ తెలంగాణ‌లో మాత్రం బీజేపీ ఆట‌లు సాగ‌డం లేదు. బీజేపీ నేత‌లు ఒక మాటంటే, అందుకు దీటుగా అధికార టీఆర్ఎస్ వంద విమ‌ర్శ‌ల‌తో విరుచుకుప‌డుతోంది.

అగ్నిప‌థ్ స్కీంకు వ్య‌తిరేకంగా నిన్న సికింద్రాబాద్‌లో ఆర్మీ అభ్య‌ర్థులు భారీ విధ్వంసానికి పాల్ప‌డ్డారు. దీని వెనుక టీఆర్ఎస్‌, ముఖ్య‌మంత్రి కార్యాల‌యం హ‌స్తం ఉంద‌ని బీజేపీ ఘాటు విమ‌ర్శ‌లు చేసింది. విధ్వంసం జ‌రుగుతున్నా రాష్ట్ర ప్ర‌భుత్వం శాంతిభ‌ద్ర‌ల‌ను ప‌రిర‌క్షించ‌డంలో ఉద్దేశ‌పూర్వ‌కంగానే అల‌స‌త్వం ప్ర‌ద‌ర్శించింద‌ని బీజేపీ నేత‌లు తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు.

ఈ నేప‌థ్యంలో మంత్రి హ‌రీష్‌రావు త‌న‌దైన స్టైల్‌లో బీజేపీకి అదిరిపోయే కౌంట‌ర్ ఇచ్చారు. తెలంగాణ‌లో అగ్నిప‌థ్‌పై నిర‌స‌న‌కు, విధ్వంసానికి అధికార పార్టీ అయిన తాము కార‌ణ‌మైతే, మ‌రి ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో అక్క‌డి బీజేపీ ప్ర‌భుత్వ‌మే బాధ్య‌త వ‌హిస్తుందా? అని నిల‌దీశారు. సికింద్రాబాద్‌లో అల్ల‌ర్ల‌ను టీఆర్ఎస్ చేయించింద‌ని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ ఆరోపించార‌న్నారు.

సికింద్రాబాద్‌లో టీఆర్ఎస్ చేయిస్తే, మ‌రి ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో పోలీస్‌స్టేస‌న్‌పై దాడి జ‌రిగింద‌న్నారు. బండి సంజ‌య్ చెబుతున్న‌ట్టుగా అర్థం చేసుకుంటే... ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో యోగి, బీహార్‌లో నితీష్ అల్ల‌ర్లు చేయించారా? అని ప్ర‌శ్నించారు. అగ్నిప‌థ్ విధానం యువ‌త‌కు అర్థం కాలేద‌ని కేంద్ర ప్ర‌భుత్వం చెప్ప‌డం హాస్యాస్ప‌ద‌మ‌న్నారు. 

కేంద్ర ప్ర‌భుత్వ అనాలోచిత నిర్ణ‌యంతో దేశ‌మంతా అట్టుడుకుతోంద‌న్నారు. బీజేపీ ప్రతి ఒక్క‌రి ఉసురుపోసుకుంటోంద‌న్నారు. సైన్యాన్ని కూడా ప్రైవేట్ ప‌రం చేయాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తోంద‌ని మండిపడ్డారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?