Advertisement

Advertisement


Home > Politics - Telangana

సీక్రెట్ బయటపెట్టేసిన హరీశ్ రావు!

సీక్రెట్ బయటపెట్టేసిన హరీశ్ రావు!

రాజకీయ నాయకులు కొన్ని సందర్భాల్లో నోరు జారి మాట్లాడేస్తుంటారు. వాస్తవాలు వెలుగులోకి వచ్చేస్తుంటాయి. మరికొన్ని సందర్భాల్లో చాలా ఆలోచించి ఆచితూచి మాట్లాడుతారు గానీ.. వారి మాటల యొక్క అసలు అర్థం నర్మగర్భంగా వేరే ఉంటుంది. అది వారి లోగుట్టునే బయటపెట్టే విధంగా ఉంటుంది.

ఇప్పుడు మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతున్న మాటలు కూడా అలాగే ఉంటున్నాయి. భారత రాష్ట్ర సమితినుంచి పెద్దసంఖ్యలో నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు చివరికి ఎంపీ టికెట్లు పొందిన అభ్యర్థులు కూడా ఇతర పార్టీల్లోకి ఫిరాయించేస్తున్న నేపథ్యంలో హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. అవికాస్తా బూమరాంగ్ అవుతున్నాయి.

ఇంతకూ హరీశ్ రావు ఏమన్నారంటే.. ‘రేవంత్ రెడ్డి తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనగలరే తప్ప ఉద్యమకారులను కొనలేరు’ అని వ్యాఖ్యానించారు. తద్వారా.. ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. అయితే హరీశ్ వ్యాఖ్యల్లోనే భారాస పతనం అయిపోవడానికి ప్రధాన కారణం కూడా ఉన్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

విషయం ఏంటంటే భారత రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన తర్వాత.. రాష్ట్ర సాధన కోసం పోరాడిన వారినందరినీ పక్కన పెట్టిందనే ఆరోపణలు ఎదుర్కొంది. ఎన్నికలు రాగానే.. డబ్బులున్న వారు, ఇతర పార్టీలనుంచి ఫిరాయించి వచ్చిన వారికి మాత్రమే కేసీఆర్ పెద్దపీట వేశారు. రాష్ట్ర సాధన పూర్తి అయిపోయిన తర్వాత.. ఆయనకు ఉద్యమకారులు కనిపించలేదు.

ఉద్యమంలో తనతో సమానంగా పోరాడిన, తనకంటె కీలకంగా అన్ని పార్టీలను ఏకతాటి మీదకు తెచ్చిన కోదండరాం లాంటి వారిని కూడా కేసీఆర్ కరివేపాకులాగా తీసిపారేశారు. కిందిస్థాయి ఉద్యమకారుల సంగతి సరేసరి. శ్రీకాంతాచారి కుటుంబానికి ఏం మేలు జరిగిందో కూడా అందరికీ తెలుసు.

ఇప్పుడు తన మాటల ద్వారా హరీశ్ రావు కూడా అదే సంగతిని ధ్రువీకరిస్తున్నారని ప్రజలు తలపోస్తున్నారు. ఎమ్మెల్యేలను మాత్రమే రేవంత్ కొనగలరని, అనడంలో మరో అర్థం ఏంటంటే.. ఉద్యమకారులు ఎవ్వరినీ భారాస ఎమ్మెల్యేలు చేయకుండా పక్కన పెట్టిందని కూడా అర్థం వస్తోంది. ఉద్యమకారుల్ని జెండాలు మోయడానికి పార్టీ వాడుకున్నదే తప్ప.. వారిని ఎదగనివ్వలేదు... అనే వాదన ప్రజలనుంచి వస్తోంది.

మెజారిటీ అవకాశవాదులకు ఎమ్మెల్యే పదవులు కట్టబెట్టినందువల్లే.. ఈ పరిస్థితి దాపురించిందని, పార్టీ ఉద్యమకారులను నెత్తిన పెట్టుకుని వారికే అవకాశం ఇచ్చి ఉంటే.. ఇవాళ ఒక్క ఫిరాయింపు కూడా జరిగేది కాదని ప్రజలు అంటున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?