Advertisement

Advertisement


Home > Politics - Telangana

రూ.6 లక్షలు ఇడ్లీలు తినేశాడు.. హైదరాబాదీ రికార్డ్

రూ.6 లక్షలు ఇడ్లీలు తినేశాడు.. హైదరాబాదీ రికార్డ్

బ్రేక్ ఫాస్ట్ చేయాలంటే చాలా ఆప్షన్లున్నాయి. ఇడ్లీ, దోశ, వడ, పూరి, ఊతప్పం.. ఇలా చెప్పుకుంటూపోతే చాలా రకాలున్నాయి. గుడ్డుతో చేసే అల్పాహారం రకాలే బోలెడన్ని ఉన్నాయి. ఓవైపు ఇన్ని ఆప్షన్లు ఉన్నప్పటికీ, ఓ హైదరాబాదీ మాత్రం ఒకే ఒక్క రకానికి ఫిక్స్ అయ్యాడు. అదే ఇడ్లీ.

హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తి ఏడాదిలో 6 లక్షల రూపాయల ఖరీదు చేసే ఇడ్లీల్ని భోంచేశాడు. ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ ఈ విషయాన్ని బయటపెట్టింది. ఏడాదిలో ఏకంగా 8,428 ప్లేట్ల ఇడ్లీల్ని ఇతగాడు ఆర్డర్ చేశాడంట.

ఈరోజు వరల్డ్ ఇడ్లీ డే. ఈ సందర్భంగా స్విగ్గీ సంస్థ ఇడ్లీపై ఆసక్తికర విషయాల్ని బయటపెట్టింది. గతేడాది మార్చి 30 నుంచి, ఈ ఏడాది మార్చి 25వరకు తమ యాప్ పై జరిగిన ఇడ్లీల లావాదేవీల్ని వెలికితీసింది. ఈ క్రమంలో హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తి, 6 లక్షల రూపాయల విలువ చేసే ఇడ్లీల్ని ఏడాదిగా ఆర్డర్ చేస్తున్న విషయాన్ని బయటపెట్టింది.

ఇడ్లీల్ని ఎక్కువగా ఆర్డర్ చేసే టాప్-3 నగరాల్ని కూడా ఇది వెల్లడించింది. ఈ లిస్ట్ లో మొదటి స్థానంలో బెంగళూరు నిలవగా, 2,3 స్థానాల్లో హైదరాబాద్, చెన్నై నిలిచాయి. ఇడ్లీ ఆన్ లైన్ ఆర్డర్ విషయంలో సాంబార్ ఇడ్లీకి ఫేమస్ అయిన చెన్నై మూడో స్థానానికి పడిపోవడం ఆశ్చర్యం. ఇక ఢిల్లీ, కోల్ కతా, ముంబయి, వైజాగ్ సిటీస్ కూడా రేసులో ముందున్నాయి.

అయితే స్విగ్గీలో ఎక్కువగా ఆర్డర్ చేస్తున్న బ్రేక్ ఫాస్ట్ మాత్రం ఇడ్లీ కాదంట. ముందుగా మసాలా దోశకే ఎక్కువ మంది మొగ్గుచూపుతున్నారట. ఆ తర్వాత స్థానంలో ఇడ్లీ నిలిచిందని సదరు సంస్థ ప్రకటించింది. ఇక బెంగళూరులో ఎక్కువమంది రవ్వ ఇడ్లీని.. నెయ్యి కారంపొడి ఇడ్లీని చెన్నై, హైదరాబాద్ లో ఎక్కువమంది ఆర్డర్ చేస్తున్నట్టు స్విగ్గీ తెలిపింది.

హైదరాబాద్ వరకు చూసుకుంటే వరలక్ష్మి టిఫిన్స్, ఉడిపి ఉపాహార్ అనే రెండు హోటల్స్ నుంచి ఎక్కువగా ఇడ్లీల్ని ఆర్డర్ చేస్తున్నారు జనం.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?