Advertisement

Advertisement


Home > Politics - Telangana

ఆ ఎన్నికలను కేసీఆర్-భారాస పక్కన పెట్టినట్టేనా?

ఆ ఎన్నికలను కేసీఆర్-భారాస పక్కన పెట్టినట్టేనా?

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని, భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చి విస్తరించిన తొలి సందర్భం నుంచి పొరుగు రాష్ట్రాలకు వ్యాపించే ప్రయత్నంలో కర్ణాటక రాష్ట్రం మీదనే కేసీఆర్ మొదటి ఫోకస్ ఉంటుందని అంతా అనుకుంటూ వచ్చారు. పార్టీ పరిణామాలు కూడా దానికి తగ్గట్టుగానే నడిచాయి. 

కర్ణాటకలో కీలక పార్టీ జేడీఎస్ నాయకుడు కుమారస్వామి తొలివిడిత భారాస మీటింగులకు చాలా చురుగ్గా హాజరయ్యారు. కేసీఆర్ -జాతీయ పార్టీ ప్రకటనను శాలువాలు కప్పి మరీ ఆహ్వానించారు. ఆ తర్వాత కొన్ని కీలక సమావేశాలకు ఆయన మొహం చాటేశారు. 

అయితే ఈ పరిణామాలు అన్నీ కూడా కర్ణాటక ఎన్నికల్లో భారాస ప్రవేశిస్తుందని, తద్వారా జాతీయ పార్టీగా తన అస్తిత్వాన్ని చాటుకోవడంలో తొలి ప్రయత్నం మొదలవుతుందని అందరూ భావించారు. కేసీఆర్ కూడా భారాసను ప్రకటించిన రోజునే కర్ణాటక ఎన్నికల్లో తమ పార్టీ పోటీలో ఉంటుందని అప్పట్లో వెల్లడించారు. ఆ తర్వాత.. కుమారస్వామి కన్నడ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీచేస్తుందని వేరే సందర్భంలో అన్నారు. 

ఈ ఇద్దరూ కొంతకాలం మైత్రీబంధం కనబరచిన నేపథ్యంలో ఈ విరుద్ధ ప్రకటనలేమిటో ఎవ్వరికీ అర్థం కాలేదు. జేడీఎస్ కుమారస్వామి సంగతి ఎలా ఉన్నప్పటికీ కన్నడ ఎన్నికల్లో భారాసగా అరంగేట్రం గ్యారంటీ అని అంతా అనుకున్నారు. 

కానీ.. కేసీఆర్ తాజాగా నిర్వహించిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంతో ఆ నమ్మకం పోయింది. ఏపీ అధ్యక్షుడిని కూడా పక్కన కూర్చోబెట్టుకుని.. అచ్చమైన జాతీయ పార్టీ సమావేశంలాగా దీనిని నిర్వహించిన కేసీఆర్.. మహారాష్ట్రలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేయడం గురించి కూడా ఇక్కడ ప్రస్తావించారు. అయితే మరో రెండు నెలల్లో జరగనున్న కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ప్రస్తావన మాత్రం తేలేదు. 

కన్నడ ఎన్నికల్లో బరిలోకి దిగకూడదని భారాస నిర్ణయించుకున్నదా అనే అనుమానం ఇప్పుడు ప్రజలకు కలుగుతోంది. నిజానికి తెలంగాణకు ఆ రాష్ట్రంతో సరిహద్దు ఉంటుంది గనుక.. చాలా ప్రాంతాల్లో కేసీఆర్ ప్రభావం నడుస్తుంది. అయినా సరే అక్కడ ఎన్నికల గురించి మాట్లాడడం లేదంటే.. జేడీఎస్ తో ఆ మేరకు ఒప్పందం ఏమైనా చేసుకున్నారా? ఒకవేళ పార్టీ స్వయంగా పోటీచేయకుండా.. జేడీఎస్ అనుకూల ప్రచారానికి మాత్రం కేసీఆర్ వెళ్తారా? 

ప్రతి రాష్ట్రంలోనూ అలాగే జరిగేట్లయితే.. భారాస అనేది జాతీయ పార్టీ రూపంలో వేళ్లూనుకునేది ఎప్పటికి అనే తరహా అనుమానాలు విశ్లేషకులకు కలుగుతున్నాయి. ఏదేమైనా కన్నడ ఎన్నికల గులాబీ దళాలను మోహరిస్తారో లేదో.. జాతీయ పార్టీ రూపంలో ప్రజాదరణను, ప్రజల ఆశీర్వాదాలను సమీకరించే ప్రయత్నంలో బోణీ కొడతారో లేదో మరో రెండు నెలల్లో తేలిపోతుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?