Advertisement

Advertisement


Home > Politics - Telangana

కేసీఆర్ నవ్వుల పాలవుతున్నారా?

కేసీఆర్ నవ్వుల పాలవుతున్నారా?

తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ నవ్వుల పాలవుతున్నారా? ఇప్పుడిది తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. మరోలా చెప్పాలంటే దేశవ్యాప్తంగా కూడా అనుకోవచ్చు. ప్రత్యేక తెలంగాణా సాధించానని చెప్పుకుంటున్న కేసీఆర్, రాష్ట్రాన్ని బంగారు తెలంగాణా చేశానని చెప్ప్పుకుంటున్న కేసీఆర్, అన్ని విషయాల్లో దేశానికే  ఆదర్శంగా తెలంగాణా నిలిచిందని ప్రతిరోజూ ప్రచారం చేసుకుంటున్న కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో ప్రధానపాత్ర పోషించాలని ఆశ పడుతున్నా అది నెరవేరడంలేదు. దీంతో ఆయన నవ్వుల పాలవుతున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

2018 తెలంగాణా అసెంబ్లీ ఎన్నికలకు ముందు దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తెస్తానని, బీజేపీయేతర, కాంగ్రెసేతర కూటమి ఏర్పాటు చేస్తానని గర్జించిన కేసీఆర్ ఇప్పటివరకు తన ప్రయత్నాల్లో విఫలమవుతూ వస్తున్నారు. ఇందుకు ఫలానా కారణమని స్పష్టంగా చెప్పలేం. కేసీఆర్ జాతీయ పర్యటనలు చేయడం, అవి ఎలాంటి ఫలితాలు రాబట్టకుండానే విఫలం కావడం లేదా అర్ధాంతరంగా ముగిసిపోవడం వెనుక రకరకాల విశ్లేషణలు వస్తున్నాయి. ఎవరి కోణంలో వారు భాష్యాలు చెబుతున్నారు. 

తాజాగా కేసీఆర్ జాతీయ పర్యటన కూడా అనుకున్నదానికంటే ముందే ముగిసింది. 

దీనిపై ఇప్పటివరకు కేసీఆర్ ఏమీ వ్యాఖ్యానించలేదు. టీఆర్ఎస్ నాయకులు కూడా నోరు మెదపడంలేదు. ప్రతిపక్షాలు మాత్రం విమర్శలు కురిపిస్తున్నాయి. కారణాలేమైతేనేం కేసీఆర్ దేశవ్యాప్త పర్యటన అర్ధంతరంగా ముగిసింది. వారం రోజులకు పైగా షెడ్యూల్ వేసుకుని దేశ వ్యాప్తంగా పర్యటించి జాతీయ రాజకీయాలలో గ్రాండ్ గా  ల్యాండ్ అవ్వాలన్న వ్యూహంతో బయలు దేరిన కేసీఆర్ హఠాత్తుగా హైదరాబాద్ కు పీఛేముఢ్ అంటూ వెనుదిరిగి వచ్చేశారు.

ఇంతకీ ఆయన తన దేశ వ్యాప్త పర్యటనలో ఇంత వరకూ కలిసినదెవరంటే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ లను మాత్రమే షెడ్యూల్ ప్రకారం పంజాబ్ , కర్నాటక తదిత రాష్ట్రాలలో కూడా పర్యటించాల్సి ఉన్నా, పంజాబ్ లో రైతులకు సాయం అందించడంతో తన పర్యటనను ముగించారు.

దీనికి కారణాలేమిటన్నదానిపై భిన్న కథనాలు వెలువడుతున్నాయి. 

పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ విదేశీ పర్యటనలో ఉండటం, తానూ విదేశీ పర్యటనలో మరిన్ని రోజులు ఉంటే రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా మారుతాయన్న భయంతో తిరిగి వచ్చేశారనీ, కేటీఆర్ దావోస్ పర్యటన ముగించుకుని తిరిగి రాగానే మళ్లీ దేశ వ్యాప్త పర్యటనను కొనసాగిస్తారనీ టీఆర్ఎస్ వర్గాల కథనం. మరో వైపు దేశంలో ఏ పార్టీ అధినేత కూడా ప్రస్తుత పరిస్థితుల్లో కేసీఆర్ తో భేటీకి పెద్దగా సుముఖత చూపడం లేదనీ, ఆ కారణంగానే దేశ వ్యాప్తంగా పర్యటించి ప్రయోజనం లేదన్న భావనతోనే కేసీఆర్ తన పర్యటనను అర్ధంతరంగా ముగించుకుని వెనుదిరిగారనీ విపక్షాలు విమర్శల దాడి చేస్తున్నాయి.

కేసీఆర్ జాతీయ అజెండా పేరుతో  రచించిన వ్యూహం ఏమిటన్నదానిపై స్పష్టత లేకపోవడం, ఆయన చెబుతున్నట్లుగా రాష్ట్రపతి ఎన్నికలో జరగబోయే సంచలనమేమిటన్నది అర్ధం కాకపోవడంతో రాజకీయ పార్టీల నేతలు, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల అధినేతలు ఆయనతో భేటీ వల్ల ఏం ఒరుగుతుందన్న భావనతోనే దూరంగా ఉన్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆ కారణంగానే కేసీఆర్ పర్యటన అర్ధంతరంగా ముగించుకుని వెనుదిరిగారని వారు చెబుతున్నారు. జాతీయ స్థాయిలో బీజేపీయేతర, కాంగ్రెసేతర ఫ్రంట్ అంటూ ఆయన చేసిన ప్రయత్నంతో బీజేపీతో పూర్తిగా తెగదెంపులు అయిపోయింది. ఇక మళ్లీ బీజేపీతో సంబంధాలు రివైవ్ చేసుకునే పరిస్థితి లేకుండా పోయింది.

ఒక విధంగా చెప్పాలంటే కేసీఆర్ దరి చేరాలని భావించినా బీజేపీ దగ్గరకు రానిచ్చే పరిస్థితి లేదు. దీంతో ఆయన కాంగ్రెస్ కు చేరువ కావడానికి చేసిన ప్రయత్నాలు కూడా బెడిసి కొట్టినట్లు చెబుతున్నారు.

తన హస్తిన పర్యటనలో భాగంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో భేటీ అయ్యేందుకు చేసిన ప్రయత్నాలు కూడా బెడిసికొట్టాయని చెబుతున్నారు. కాంగ్రెస్ లో అత్యంత విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం సోనియా గాంధీతో భేటీ కోసం ఆయన ప్రయత్నించారు, ఆ సమాచారాన్ని కాంగ్రెస్ లోని తన పరిచయస్తుల ద్వారా ఆమెకు చేరవేశారు.

అయతే కేసీఆర్ తో భేటీకి సోనియా తిరస్కరించారు. సోనియా గాంధీని కలసి రాష్ట్రపతి ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిని నిలిపితే తాను బేషరతుగా మద్దతు ఇస్తానని కేసీఆర్ ఆమెకు తెలియ జేయాలని భావించినట్లు చెబుతున్నారు. అయితే కేసీఆర్ తో భేటీకి సోనియా నిరాకరించారనీ ఆ వర్గాలు తెలిపాయి.

కేసీఆర్ సోనియా గాంధీని ఎందుకు కలవడానికి ప్రయత్నించారంటే గతంలో రెండుసార్లు కేసీఆర్ దేశంలోని ప్రాంతీయ పార్టీల అధినేతలను కలుసుకొని  కూటమి గురించి చర్చలు జరిపినప్పుడు కాంగ్రెస్ పార్టీని కలుపుకోకుండా  కూటమి సాధ్యం కాదని తేల్చి చెప్పారు.

కానీ కేసీఆర్ అప్పుడు పట్టించుకోలేదు. కానీ చివరకు కాంగ్రెస్ ను కలుపుకొని పోకపోతే మోడీ వ్యతిరేక కూటమి సాధ్యం కాదనుకున్నారో ఏమో ఈసారి సోనియా గాంధీని కలవడానికి ప్రయత్నాలు చేశారు. కానీ నెరవేరలేదు. ఇంత కాలం కాంగ్రెస్ లక్ష్యంగా కేసీఆర్ విమర్శలు చేశారు. 

తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా సకుటుంబంగా సోనియా గాంధీని కలిసి పార్టీని విలీనం చేస్తామంటూ ఇచ్చిన హామీని ఉల్లంఘించిన దానిపై సోనియా ఇప్పటికీ ఆగ్రహంగా ఉన్నట్లు  సమాచారం. ఆ కారణంగానే కేసీఆర్ తో భేటికీ ఆమె ససేమిరా అన్నట్లు తెలుస్తోంది. ఇటు బీజేపీతోనూ, అటు కాంగ్రెస్ తోనూ చెడి ఇప్పుడు కేసీఆర్ జాతీయ రాజకీయ ఎరీనాపై ఒంటరిగా నిలబడిపోయారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?