Advertisement

Advertisement


Home > Politics - Telangana

కొత్త రాకలతో కమలంలో కలకలం పెరిగేనా?

కొత్త రాకలతో కమలంలో కలకలం పెరిగేనా?

తెలంగాణ రాజకీయాలకు సంబంధించినంత వరకు కమలం పార్టీ ఏదో ఇద్దరు ముగ్గురు కీలక నాయకులతో.. వారి వ్యవహారాలతో గుట్టుచప్పుడు కాకుండా రోజులు గడిపేస్తుండేది. కానీ.. మారిన పరిణామాల్లో ఇప్పుడు నాయకులు పెరుగుతున్నారు. 

తెలంగాణ బిజెపి నాయకుల్లో అధికార కేంద్రాలు పెరుగుతున్నాయి. సహజంగానే అధికారం కోసం పోటీ కూడా పెరుగుతుంది. ఒకరితో ఒకరు కీచులాడుకునే పరిస్థితి వస్తుంది. ఇప్పటికే ఆ సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు కోమటిరెడ్డి కూడా రంగప్రవేశం చేయబోతుండడంతో.. కమలంలో కీచులాటలు ఇంకా పెరుగుతాయా? అనే అనుమానం పలువురికి కలుగుతోంది!

ఒకప్పట్లో తెలంగాణ భారతీయ జనతా పార్టీ అంటే.. వేళ్లమీద లెక్కపెట్టగలిగినంత మంది నాయకులు మాత్రమే ఉండేవారు. వారికే వంతుల వారీగా కీలక పదవులు దక్కుతూ ఉండేవి పెద్దగా తకరారు లేదు. ఆ మధ్య కాలంలో తెలుగుదేశాన్ని వీడి, సొంత పార్టీ పెట్టుకుని భంగపడి కమలతీర్థం పుచ్చుకున్న నాగం జనార్దన రెడ్డి వచ్చిన తర్వాత.. ఆధిపత్య పోరు కొన్నాళ్ల పాటు కనిపించింది. నాగం జనార్దన రెడ్డి ఉక్కిరి బిక్కిరి అయ్యారు. అలాంటి ఆధిపత్య పోరాటం పరిస్థితి మళ్లీ కనిపిస్తోంది. 

ఈటల వచ్చిన తర్వాత బిజెపి సీన్ కొంత మారింది. ఆయనను ఓడించడానికి తెరాస గణాలు మొత్తం విశ్వప్రయత్నాలు చేసినా.. ఆయన ఢంకా బజాయించి గెలిచారు. తన వద్ద గులాబీ పప్పులు ఉడకవని నిరూపించారు. ఒక్కసారిగా బిజెపిలో కూడా ఆయన ప్రాధాన్యం పెరిగింది. 

తాజా పరిణామాల్లో.. కేసీఆర్ నియోజకవర్గమైన గజ్వేల్ లో పోటీచేస్తానని, కేసీఆర్‌ను ఓడించకపోతే తన జీవితానికి సార్థకత లేదని అంటూ.. ఈటల తనను తాను బిజెపిలో అత్యంత కీలక నాయకుడిగా ప్రొజెక్టు చేసుకున్నారు. ఆధిపత్య పోరు ఇక్కడే షురూ అయింది. 

ఆ రకంగా ఈటల తాను సీఎంకు సమానమైన ప్రత్యర్థిని అని చాటుకోగా.. ప్రస్తుతానికి పార్టీ అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ కంగారు పడ్డారు. ఎవరు ఎక్కడినుంచి పోటీచేసేది పార్టీ అధిష్ఠానం మాత్రమే నిర్ణయిస్తుందని అంటూ.. సన్నాయి నొక్కులు నొక్కారు. ఈటల దూకుడుకు బ్రేకులు వేసే ప్రయత్నం ఇది. 

ఇలా ఆధిపత్యం తమదే అని నిరూపించుకోడానికి పాత వారితో పాటు.. వలస వచ్చిన అనేక మంది నాయకులు కూడా కిందామీదా అవుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో.. కాంగ్రెస్ నుంచి కొత్తగా వలస రాబోతున్న కోమటిరెడ్డిని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. 

ధనబలం పరంగా కూడా పార్టీకి అండగా ఉండగలిగిన నాయకుడు ఆయన! ఖచ్చితంగా అందుకు తగిన ప్రాధాన్యం కూడా కోరుకుంటారు. ఏతావతా కొత్త రాకలతో కమలం పార్టీలో కలకలం తీవ్రంగా పెరుగుతుందని పలువురు అంచనా వేస్తున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?