Advertisement

Advertisement


Home > Politics - Telangana

ఓహో...ఈడీపై ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించిన క‌విత‌!

ఓహో...ఈడీపై ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించిన క‌విత‌!

ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌లో తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఈడీ విచార‌ణ ఉత్కంఠ రేపుతోంది. ఇప్ప‌టికి రెండుసార్లు ఆమెను ఈడీ విచారించింది. స్కామ్‌లో పాత్ర‌పై క‌విత‌ను ఈడీ ప్ర‌శ్న‌ల‌తో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే ఈడీనే క‌విత ఓ ఆట ఆడుకున్న‌ట్టు బీఆర్ఎస్ అనుకూల మీడియా ప్ర‌చారం మొద‌లు పెట్టింది. క‌విత‌న ఈడీ విచారించ‌డం కాదు, ఆ సంస్థ‌నే త‌మ నాయ‌కురాలు ప్ర‌శ్న‌ల‌తో నిలదీసిన‌ట్టు స‌రికొత్త వాద‌న‌ను తెర‌పైకి తీసుకురావ‌డం గ‌మ‌నార్హం.

ఇవాళ మ‌రోసారి ఈడీ విచార‌ణ‌కు క‌విత హాజ‌రు కానున్న నేప‌థ్యంలో నిన్న ఏం జ‌రిగిందో బీఆర్ఎస్ కొన్ని అంశాల‌ను తెర‌పైకి తెచ్చింది. ఈడీ, క‌విత మ‌ధ్య విచార‌ణ ఎలా సాగింది? ఎవ‌రు ఎవరిని ప్ర‌శ్నించారో వివ‌రాలు బ‌య‌టికి వ‌చ్చాయి. మొత్తం ప్ర‌క్రియ‌లో క‌వితే ఈడీపై ఆధిప‌త్యం చెలాయించిన‌ట్టు స‌మాచారం. ఈడీని క‌విత ఎలాంటి ప్ర‌శ్న‌లు సంధించిందో కూడా తెలంగాణ అధికార పార్టీ వివ‌రాలు వెల్ల‌డించ‌డం స‌రికొత్త‌గా చ‌ర్చ‌కు దారి తీస్తోంది.  

మొద‌ట త‌న‌ను నిందితురాలిగా విచారిస్తున్నారా? లేక అనుమానితురాలిగానా? అని ఈడీని క‌విత ప్ర‌శ్నించారు. అనుమానితురాలిగా అని ఈడీ నుంచి స‌మాధానం. ఢిల్లీ ప్ర‌భుత్వం అధికారికంగా మ‌ద్యం విధానాన్ని మార్చుకుంటే దాంతో త‌న‌కేంటి సంబంధం అని ఈడీని క‌విత ప్ర‌శ్నించారు. రాజ‌కీయ క‌క్ష‌తో మీరు ఇలా ఎంత మందిని విచార‌ణ‌కు పిలుస్తార‌ని గ‌ట్టిగా క‌విత నిల‌దీశారు. అలాగే హిమంత బిశ్వ‌శ‌ర్మ‌, నారాయ‌ణ రాణె. సుజ‌నాచౌద‌రిల‌పై గ‌తంలో మీరు పెట్టిన కేసులు ఏమ‌య్యాయి? బీజేపీలో వారంతా చేర‌గానే విచార‌ణ ఎందుకు ఆగింది? అని ఈడీని క‌విత ప్ర‌శ్న‌ల‌తో చిత‌క్కొట్టారు. 

విచారణ పేరుతో పిలిచి గంటల తరబడి ఒంటరిగా గదిలో కూర్చోబెట్టి మానసికంగా ఒత్తిడి చేస్తే లొంగిపోతామనుకుంటున్నారా? అని క‌విత అడిగిన ప్ర‌శ్న‌కు ఈడీ మౌన‌మే స‌మాధానం అయ్యింది. విచార‌ణ‌లో అస‌లు పార‌ద‌ర్శ‌క‌త‌, నిజాయ‌తీ లేవ‌ని, రాజ‌కీయ కుట్ర‌లో మీ సంస్థ భాగ‌స్వామ్యం అవుతోంద‌నే భావ‌న క‌లుగుతోంద‌ని ఈడీ అధికారుల‌తో క‌విత అన్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది.  

అలాగే విచార‌ణ‌లో జ‌ర‌గ‌ని విష‌యాల‌ను జ‌రిగిన‌ట్టుగా లీక్‌ చేస్తుండటంపై ఈడీ అధికారుల‌పై క‌విత ఫైర్ అయ్య‌నట్టు బీఆర్ఎస్ చెబుతోంది. అలాగే త‌న కేసుపై ఈ నెల 24న సుప్రీంకోర్టులో విచార‌ణ జ‌ర‌గాల్సి వుండ‌గా, త‌న‌ను పిల‌వాల్సినంత తొంద‌ర ఏంట‌ని ఈడీని నిల‌దీసిన‌ట్టు స‌మాచారం. మొత్తానికి క‌విత ప్ర‌శ్న‌ల‌కు ఈడీ అధికారులు స‌మాధానం చెప్ప‌లేక కొన్ని సంద‌ర్భాల్లో మౌనంగా, మ‌రికొన్ని స‌మ‌యాల్లో నీళ్లు న‌మిలినట్టు బీఆర్ఎస్ అనుకూల మీడియా చెబుతోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?