Advertisement

Advertisement


Home > Politics - Telangana

ఆతృతగా బీజేపీ ...తాపీగా కోమటిరెడ్డి బ్రదర్

ఆతృతగా బీజేపీ ...తాపీగా కోమటిరెడ్డి బ్రదర్

ఏ విషయంలోనైనా మాటలు చెప్పడం సులభం. కానీ ఆచరణ కష్టం. ఇప్పుడు కోమటిరెడ్డి బ్రదర్స్ లో ఒకడైన మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఎదుర్కొంటున్న పరిస్థితి ఇదే. ఆయన్ని అర్జెంట్ గా బీజేపీలోకి లాక్కొని, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించి ఉపఎన్నిక తెప్పించాలని కాషాయం పార్టీ నాయకులు తహతహలాడిపోతున్నారు. 

కాంగ్రెస్ లో ఉండను ...బీజేపీలోకి పోతా...పోతా అంటూ చాలా ఏళ్లుగా పాట పాడిన రాజగోపాల్ రెడ్డి నిర్ణయం తీసుకోవలసిన సమయంలో విషయాన్ని నానబెడుతున్నారు. టెన్షన్ పడుతున్నారు. బీజేపీ వాళ్లకు ఏ సమాధానం చెప్పకుండా విషయాన్ని నానబెడుతున్నారు. ఏ సంగతీ తేల్చుకోవడానికి మరో పదిహేను రోజులు సమయం తీసుకోవాలని నిర్ణయించుకున్నారు.

నియోజకవర్గ ప్రజలతో సమావేశాలు పెడతారట. బీజేపీలో చేరితే ఏం జరుగుతుందోనని ఆలోచిస్తున్నారట. రాజగోపాల్ రెడ్డి విషయంలో బీజేపీలో చేరితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలనే నిబంధన పెద్దగా పట్టించుకోనక్కరలేదని కొందరు బీజేపీ నాయకులు అంటున్నారని సమాచారం. రాజీనామా చేయకుండా బీజేపీలో చేరితే సస్పెన్షన్ వేటు పడుతుందనే భయం ఆయనకు అక్కరలేదని, కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరిన కొందరు రాజీనామా చేయకుండానే మంత్రి పదవులు అనుభవిస్తున్నారని అంటున్నారు. 

ఒకవేళ రాజగోపాల్ రెడ్డి మీద చర్య తీసుకుంటే టీఆర్ఎస్ నిర్వాకం మీద కోర్టుకు వెళతామని చెబుతున్నారు. కానీ బీజేపీ ముఖ్య నాయకులు మాత్రం మునుగోడుకు ఉప ఎన్నిక తెప్పించి టీఆర్ఎస్ ను దెబ్బ కొట్టాలని పట్టుదలగా ఉన్నారు. ఇదివరకు రాజగోపాల్ రెడ్డి కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా బీజేపీలో చేరతానంటే బీజేపీ పెద్దలు ఒప్పుకోలేదు. 

ఉప ఎన్నిక తేవాలనే ఆత్రం వాళ్ళది. ఒకవేళ ఉపఎన్నిక వస్తే రాజగోపాల్ రెడ్డి గెలుస్తాడని నమ్మకం ఏముంది? గతంలో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి నాగార్జున సాగర్లో ఓడిపోలేదా? మరో విషయం ఏమిటంటే ...రాజీనామా ఆమోదించకుండా స్పీకర్ తొక్కి పెట్టవచ్చు. కేసీఆర్ ఎంత చెబితే స్పీకర్ అంతే కదా. ఒకవేళ మునుగోడులో ఉపఎన్నిక వస్తే కాంగ్రెస్ పార్టీ రాజగోపాల్ రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డినే నిలబెడుతుందని ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది. ఆయన తనకు పోటీగా నిలబడితే కుటుంబంలో వివాదాలు వస్తాయి. నిలబడకపోతే కాంగ్రెస్‌లో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి విలువ లేకుండా పోతుంది. 

ఈ కారణంగా తన రాజీనామా వల్ల రాజకీయంగా ఎంత లాభమో, నష్టమో రాజగోపాల్ రెడ్డి లెక్కలు వేసుకుంటున్నారని, కానీ స్పష్టత రాకపోవడంతో డైలమాలో ఉన్నారని చెబుతున్నారు. నిజానికి మునుగోడులో ఆయన అనుచరులు కూడా పార్టీ మార్పుపై సానుకూలంగా లేరని సమాచారం. అదే సమయంలో ఆయన ఎన్నికల ఖర్చు గురించి కూడా ఆలోచిస్తున్నట్లుగా చెబుతున్నారు.  ఉపఎన్నిక వస్తే.. ఎంత ఖర్చు పెట్టుకోవాలో ఊహించడం ఆయనకు కష్టమేం కాదు.

సర్వశక్తులు ఒడ్డే టీఆర్ఎస్..తాడోపేడో తేల్చుకోవాలనుకునే కాంగ్రెస్ ఖర్చు విషయంలో ఏ మాత్రం తగ్గవు. వారికి పోటీగా రాజగోపాల్ రెడ్డి కూడా ఖర్చు పెట్టాలి. అలా భారీగా ఖర్చు పెట్టుకుని గెలిస్తే పదవి ఉండేది మరో ఎడెనిమిది నెలలు మాత్రమే. ఆ తర్వాత మళ్లీ సాధారణ ఎన్నికల్లో ఖర్చు పెట్టుకోవాలి. అందుకే రాజగోపాల్ రెడ్డి డైలమాలో ఉన్నారంటున్నారు. మొత్తం మీద రాజగోపాల్ రెడ్డి చుట్టూ అనేక ఇబ్బందులు పొంచి ఉన్నాయని చెప్పుకోవచ్చు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?