Advertisement

Advertisement


Home > Politics - Telangana

జగన్‌ను శెభాష్ అన్న కేటీఆర్ : పచ్చకళ్లలో నిప్పులు!

జగన్‌ను శెభాష్ అన్న కేటీఆర్ : పచ్చకళ్లలో నిప్పులు!

బహుశా ఈ వార్త చూసి పచ్చ మీడియా కళ్లలో నిప్పులు పోసుకుంటూ ఉండొచ్చు. జగన్ ను బద్నాం చేయడానికి.. తమ వంతుగా శక్తివంచన లేని ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉంటే.. ప్రజల దృష్టిలో నిష్పాక్షికమైన మీడియా సంస్థగా పేరున్న ది హిందూ ఆంగ్లపత్రిక జగన్ కు మంచి కీర్తి దక్కేలా వార్త ఇవ్వడం వారికి మింగుడుపడడం లేదు. 

నాయకులు ఎవరు ఏం మాట్లాడినా సరే.. ఆ మాటలను తమ కళ్లజోడులోంచి గమనించి, తమకు తోచిన రీతిలో వక్రీకరించి.. ఎలా చెబితే.. జగన్ ను బద్నాం చేయడం సాధ్యం అవుతుందో అలా మాత్రమే ప్రజలకు అందించే పాపాన్ని నిత్యక్రతువులుగా పచ్చమీడియా కొనసాగిస్తూ ఉంటుంది. అందుకే వారికి ప్రజల దృష్టిలో కించిత్ క్రెడిబిలిటీ కూడా లేకుండా పోయింది. అయితే ఎన్ని పత్రికలు ఎలా గాడి తప్పిపోతున్నా.. ప్రజల వద్ద క్రెడిబిలిటీ ఉన్న ది హిందూ నిష్పాక్షికంగా చేసిన రిపోర్టింగ్, అన్నది అన్నట్టుగా, ఉన్నది ఉన్నట్టుగా అందించిన తీరు ఒక రకంగా చెప్పాలంటే.. పచ్చమీడియాకు చెంపపెట్టు లాంటిది. 

ది హిందూ దినపత్రిక నిర్వహించిన ఓ కార్యక్రమానికి తెలంగాణ మంత్రి కేటీఆర్ అతిథిగా వచ్చారు. హిందూ సంపాదకవర్గంతో ముచ్చటించే సమయంలో.. పొరుగు రాష్ట్రం రాజకీయాలు కూడా చర్చకు వచ్చాయి. జగన్ విధానాలు, పథకాలు, తీసుకుంటున్న నిర్ణయాలకు కేటీఆర్ ఏకపక్షంగా కితాబుల వర్షం కురిపించారు. 

అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా సోదరుడు జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎంతో సమర్థంగా ముందుకు తీసుకువెళుతున్నారు అంటూ కేటీఆర్ ప్రశంసించడం విశేషం. అదే సమయంలో.. జగన్మోహన్ రెడ్డి ఉచిత పథకాల మీద మాత్రమే దృష్టి పెట్టి, పరిపాలనను విస్మరిస్తున్నారనే వాదనలను కూడా కేటీఆర్ తోసిపుచ్చారు. కొవిడ్ పరిస్థితుల తర్వాత ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడంలో జగన్ తీసుకున్న చర్యలను కూడా కేటీఆర్ అభినందించారు. 

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్తితి కుప్పకూలుతుందని చాలా మంది తమ తమ అంచనాలను ఊహించుకున్నప్పటికీ.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా సమర్థంగా పథకాల అమలును కొనసాగిస్తున్నారని కేటీఆర్ అనడం విశేషం. ఆ మాటకొస్తే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానా దివాలా తీసిందనే వ్యాఖ్యలను కూడా ఆయన ఒప్పుకోవడం లేదు. పోల్చిచూస్తే.. ఏపీ పరిస్థితి.. బిజెపి పాలనలో ఉన్న యూపీ పరిస్థితికంటె చాలా మెరుగ్గా ఉన్నదని కేటీఆర్ అన్నారు.

కేటీఆర్ అంటే.. వైఎస్సార్ సీపీ నాయకుడు కాదు. చాలా విషయాల్లో ఏపీ సర్కారుతో ఘర్షణపడుతూ ఉండే తెలంగాణ రాష్ట్రానికి ఒక కీలక నాయకుడు. జగన్ ను అనుచితంగా కీర్తించాల్సిన అవసరం ఆయనకు ఎంతమాత్రమూ లేదు. అయినా సరే.. రాజకీయ వేదికలు కాకుండా.. సందర్భం వచ్చినప్పుడు.. ఆయన తన మనసులోని మాటలను బయటపెట్టినట్టుగానే.. ఈ వ్యాఖ్యలన్నీ ఉన్నాయి. 

ఏపీ రాష్ట్రంలో పరిస్థితుల్ని వాస్తవంగా గమనించే ఎవ్వరైనా సరే.. ఇలాంటి వ్యాఖ్యలే చేస్తారు. అయితే అవేవీ పచ్చ మీడియాలో కనిపించవు. పచ్చ కామెర్లతో కళ్లుమూసుకుపోయిన వారు.. అమరావతి పెట్టుబడులు మురిగిపోతాయని ఏడుస్తున్న వారు ఏదైనా మాట్లాడితే.. ఆ మాటలను మాత్రమే మేధావుల విశ్లేషణ కింద ప్రచారంలోకి తెస్తుంటారు. 

నిజానికి కేటీఆర్ కితాబులు.. వైఎస్సార్ సీపీ నాయకులకు సంతోషం కలిగించడంలో వింత లేదు. రాష్ట్రం గురించి.. తమలోనే ఉన్న సైంధవుల్లాంటి ప్రతిపక్ష నాయకులు సాగించే దుష్ప్రచారాలకు విరుగుడు కూడా. యావత్ ఆంధ్రప్రదేశ్ లోని ప్రజలు..రాష్ట్ర ఎదుగుదలపై విషం కక్కే విషనాగుల వంటి నాయకులను సరైన కోణంలో అర్థం చేసుకోవడానికి ఇలాంటి కేటీఆర్ వ్యాఖ్యలు ఉపయోగపడతాయి.

నేను రెడ్డి అని ఎందుకు పెట్టుకున్నానంటే...

జ‌గ‌న్ ను చూసి నేను మారను