Advertisement

Advertisement


Home > Politics - Telangana

కేటీఆర్ కెలుకుడుకు మూల్యం చెల్లించక తప్పదా?

కేటీఆర్ కెలుకుడుకు మూల్యం చెల్లించక తప్పదా?

పడుకున్న వాళ్లని లేపి కొట్టించుకున్నట్టుగా భారాస పరిస్థితి తెలంగాణలో తయారవుతుందా? మిత్రపక్షం వారినే కెలికి.. వారితో లేని వైరాన్ని సృష్టించుకున్నారా? లేని ఇబ్బందులను కొనితెచ్చుకుంటున్నారా? అనే చర్చ నడుస్తోంది. 

తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా.. కేటీఆర్- అక్భరుద్దీన్ ఓవైసీల మాటలయుద్ధం ఇప్పుడు హాట్ టాపిక్! ఏడు సీట్లున్న వారికే అంత సేపు మాట్లాడే అవకాశం ఇస్తే.. మా సంగతేంటి? అని కేటీఆర్ ప్రశ్నించినందుకు ఒవైసీ సీరియస్ కావడం ఈ తాజా చర్చకు మూలం!

తెలంగాణలో భారాసకు, మజ్లిస్ పార్టీ మిత్రపక్షమే. అలాగని వారి మధ్య పొత్తులు ఉండవు. సీట్లను పంచుకోవడం జరగదు. కానీ ఇద్దరు మైత్రితోనే అడుగులు వేస్తుంటారు. అలాంటిది.. కేటీఆర్ మాటలను ఒవైసీ అవమానంగా భావించడం తాజాగా రాష్ట్ర రాజకీయాల్లో చిన్న కుదుపునకు, మార్పునకు దారితీస్తుందా? అనిపిస్తోంది!

మజ్లిస్ పార్టీ ద్వారా భారాసకు లాభమే తప్ప నష్టం లేదు. వాళ్లు కేవలం వారికి ఖచ్చితంగా దక్కే 7 సీట్లను, ఒక ఎంపీ స్థానాన్ని మాత్రమే సీరియస్ గా తీసుకుంటూ ఉంటారు. రాష్ట్రంలో వేరే ప్రాంతాల్లో ఒకటిరెండు చోట్ల పోటీచేసినా కూడా అంత సీరియస్ ప్రయత్నం ఉండదు. కానీ ఇప్పుడు ఏడు సీట్లు మాత్రమే కలిగి ఉండడం వారి చేతగానితనం అన్నట్టుగా కేటీఆర్ చులకన చేసి మాట్లాడడం కొత్త అంకానికి తెరతీసింది. అక్భరుద్దీన్ చాలా స్పష్టంగా తాము ఆ మాటలను ఎంత సీరియస్ గా తీసుకుంటున్నామో వివరించారు. 

తన పార్టీ అధ్యక్షుడితో మాట్లాడతానని, ఈసారి ఎన్నికల్లో కనీసం యాభై సీట్లకు పోటీచేస్తాం అని, కనీసం 15 మంది ఎమ్మెల్యేలు తమ పార్టీ తరఫున సభలో ఉండేలా చూస్తామని సభ వేదికగానే ప్రకటించారు. కేటీఆర్ తన మాటలతో వారిని అనవసరంగా రెచ్చగొట్టినట్టు అయింది. 

రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడైనా సరే.. మజ్లిస్ కు పడగల ఓటు అంటే.. అది ఆటోమేటిగ్గా బిజెపి వ్యతిరేక ఓటు అయి ఉంటుంది. ఇప్పుడు మజ్లిస్ గెలవగల స్థానాలను పెంచుకోవాలనే ఆలోచన చేస్తే.. సీట్ల పరంగా నష్టం భారాసకే, బిజెపికి కాదు! అలాగే.. వారు గనుక యాభై నియోజకవర్గాల్లో బరిలోకి దిగితే.. ఆయా నియోజకవర్గాల్లో బిజెపి వ్యతిరేక ఓటు ఖచ్చితంగా చీలిపోతుంది. ఓట్ల పరంగా కూడా భారాసకు తీవ్రమైన నష్టం వాటిల్లుతుంది. రెండు రకాలుగానూ పార్టీకి చేటు జరుగుతుంది.

మజ్లిస్ ఎక్కువ సీట్లు గెలిచినా సరే.. వారితో స్నేహబంధం వీడిపోతుందని అనుకోవడానికి వీల్లేదు. బిజెపి, కాంగ్రెస్ లకు దక్కే సీట్ల సంఖ్య పెరిగి.. వాటితో పాటు మజ్లిస్ సీట్ల సంఖ్య కూడా పెరిగితే.. భారాసకు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అధికారంలోకి వచ్చే వైభవానికి దెబ్బ పడుతుంది. అదే జరిగితే.. మజ్లిస్ వారికి ఖచ్చితంగా సహకరిస్తుంది. వారు ప్రభుత్వంలోకి రావడానికి చేయూత అందిస్తుంది. 

కానీ.. ఏడు సీట్లకు పరిమితమైనంత కాలం.. భారాస ప్రతినిర్ణయానికి మద్దతు ఇస్తున్న మజ్లిస్, రేపు తమ సీట్ల సంఖ్య పెంచుకుంటే.. తమ మీద ఆధారపడి ప్రభుత్వం ఏర్పడే పరిస్థితి వస్తే.. ప్రభుత్వంలో కూడా భాగం కోరుకుంటుంది. కేటీఆర్ నోరుజారిన మాటల ఫలితం అక్కడ దాకా వెళ్లినా ఆశ్చర్యం లేదు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?