2019లో ఏ టీం అయితే వైసీపీ అధికారంలోకి దోహదం చేసిందో, ప్రస్తుతం అదే శాపంగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలో ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలిస్తూ, ఎప్పటికప్పుడు వైసీపీకి ఏది లాభమో…. అదే చేసేవారు. ఇప్పుడు ఐ-ప్యాక్ పని చేస్తోంది. అయితే ప్రశాంత్ కిశోర్ నేరుగా బాధ్యత వహించని టీం వైసీపీ కోసం పని చేస్తోంది. ఈ టీమ్‌తో ప్రధాన సమస్య ఏంటంటే… పెద్దరికం లేకపోవడం.
వైసీపీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ఐ-ప్యాక్ టీమ్ పని చేయాలి. కానీ క్షేత్రస్థాయిలో ఈ టీమ్ పనితీరు గమనిస్తే… వైసీపీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా పని చేస్తోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత కొంత కాలంగా ఐ-ప్యాక్ టీమ్ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ, ఎప్పటికప్పుడు నివేదికలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు సమర్పిస్తోంది. నిజాలను రిపోర్ట్ చేస్తే ఇబ్బంది లేదు. కానీ వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో ఇగో సమస్యలు తలెత్తాయి. దీంతో తమకు నచ్చని వారిపై ఇష్టానుసారం నివేదికలు ఇస్తున్న పరిస్థితి.
అంతేకాదు, తమకు గిట్టని నేతల నియోజకవర్గాలకు సంబంధించి పనిగట్టుకుని వ్యతిరేకులతో మాట్లాడుతూ అదే జనాభిప్రాయంగా నివేదికలు సమర్పిస్తున్నారని సమాచారం. ఉదాహరణకు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నగరి, పూతలపట్టు, పలమనేరు, సత్యవేడు, శ్రీకాళహస్తి, తిరుపతి, చంద్రగిరి నియోజకవర్గాలను తీసుకుందాం. అక్కడ వైసీపీ శ్రేణులతో ఐ-ప్యాక్ టీమ్ మాట్లాడుతున్న సందర్భంలో అసలు వైసీపీ తిరిగి అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని చెబుతున్నట్టు తెలిసింది. దీంతో ఐ-ప్యాక్ టీమ్ అధికారంలోకి రాలేమని చెబుతున్నప్పుడు, ఇక తమ పరిస్థితి ఏంటనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఐ-ప్యాక్ టీమ్ అవగాహన, అనుభవ రాహిత్యంతో పార్టీకి నష్టం వాటిల్లే ప్రమాదం వుందని కొందరు ఎమ్మెల్యేలు అసలు తమ నియోజకవర్గాల్లోకి వారిని అడుగు పెట్టనివ్వని పరిస్థితి కూడా నెలకుంది. మరికొన్ని చోట్ల వారిని అసలు పరిగణలోకే తీసుకోవడం లేదు.
ఐ-ప్యాక్ టీమ్‌లో చాలా వరకు యువత ఉంది. తమ అనుభవం అంత వయసు కూడా లేని వారు నియోజకవర్గాలకు వచ్చి పెత్తనం చేస్తుంటే కొన్ని చోట్ల ఫైర్ అవుతున్నారని సమాచారం. మరికొన్ని చోట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతినిధులమని, తాము చెప్పినట్టు నడుచుకోవాలనే ఆదేశాలను ఐ-ప్యాక్ టీమ్ ఇస్తోంది. ఈ క్రమంలో మంత్రుల్ని సైతం లెక్కలేకుండా మాట్లాడుతున్నారని సమాచారం. తాము చెప్పింది మాత్రమే చేయాలని, సొంత అభిప్రాయాలు చెప్పొద్దని మంత్రులకు సైతం హుకుం జారీ చేస్తున్నారని కోస్తాంధ్రకు చెందిన ఓ సీనియర్ మంత్రి వాపోవడం గమనార్హం.
అంతేకాదు, రీజినల్ కోఆర్డినేటర్ల సమావేశానికి ఎవరెవరిని పిలవాలో ఐ-ప్యాక్ టీమ్ నిర్ణయిస్తోంది. దీంతో వైసీపీ జిల్లా అధ్యక్షులు ఇదెక్కడి గొడవ అని వాపోతున్నారు. ఐ-ప్యాక్ టీమ్ అతి పెత్తనం వల్ల కొన్ని చోట్ల ఎంపీలను సైతం సమావేశాలకు పిలవని దయనీయ స్థితి. దీంతో వారు మనస్తాపానికి గురి అవుతున్నారు.
రాజకీయాల్లో తలపండిన తమకు ఎన్నికల్లో ఎలా వ్యవహరించాలో ఐ-ప్యాక్ టీమ్ దిశానిర్దేశం చేయడం ఏంటో ఏమీ అర్థం కాలేదని వైసీపీ నేతలు వాపోతున్నారు. 2019లో ప్రశాంత్ కిశోర్ (పీకే) టీమ్ జగన్‌ను అధికారంలోకి తీసుకురావడంలో సక్సెస్ అయ్యిందనే ప్రచారం రాజకీయాల్లో కొత్త ఒరవడికి నాంది పలికింది. చివరికి టీడీపీ కూడా వ్యూహకర్తను నియమించుకున్న పరిస్థితి. రాజకీయాలంటే ఏమీ తెలియని యువత ….మీరు ఇలా చేయండి, అలా చేయండి అని చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోందని నేతలు వాపోతున్న పరిస్థితి. కొన్ని నియోజకవర్గాల్లో ఐ-ప్యాక్ టీమ్ అతికి ఆగ్రహానికి గురవుతున్న నాయకులు కూడా ఉన్నారు.
అలాంటి చోట ఐ-ప్యాక్ టీమ్ ప్రతినిధులు పనిగట్టుకుని, పార్టీలోనూ, పౌర సమాజంలోనూ ఆ నాయకుడికి వ్యతిరేకులను గురించి ఆరా తీసి, పిలిపించుకుని మాట్లాడుతున్న వైనం గురించి కథలుకథలుగా చెప్పుకుంటున్నారు. తాము చెప్పిందే ఫైనల్ అని, దాని ప్రకారమే టికెట్ ఇవ్వడం, ఇవ్వకపోవడం అనేది ఆధారపడి వుంటుందని ఐ-ప్యాక్ టీమ్ హెచ్చరిస్తున్న పరిస్థితి కూడా లేకపోలేదు.
అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రం నాలుగైదు సర్వే టీమ్‌లతో క్షేత్రస్థాయి పరిస్థితులను ఎప్పటికప్పుడు తెప్పించుకుంటున్నారని సమాచారం. కానీ వైసీపీ అంటే ప్రస్తుతం ఐ-ప్యాక్ టీమ్ అనే ముద్ర పడింది. అందుకే వీళ్ల గురించి ఎక్కువ మాట్లాడుకోవడం. వైసీపీ పాలిట ఐ-ప్యాక్ టీమ్ కాస్త ప్యాకప్ టీమ్‌గా వ్యవహరించడమే విమర్శలకు దారి తీసింది.