Advertisement

Advertisement


Home > Politics - Telangana

సుజ‌నాచౌద‌రి, సీఎం ర‌మేశ్‌ల‌పై కేసులు ఏమ‌య్యాయ్‌?

సుజ‌నాచౌద‌రి, సీఎం ర‌మేశ్‌ల‌పై కేసులు ఏమ‌య్యాయ్‌?

త‌న సోద‌రి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత‌కు ఈడీ నోటీసులు ఇవ్వ‌డంపై మంత్రి కేటీఆర్ త‌న‌దైన స్టైల్‌లో విరుచుకుప‌డ్డారు. కేంద్ర ప్ర‌భుత్వ విధానాల‌ను ఎండ‌గ‌ట్ట‌డంలో కేటీఆర్ ముందు వ‌రుస‌లో వుంటారు. కేంద్ర ప్ర‌భుత్వంపై పంచ్‌లు విసురుతూ తీవ్ర విమ‌ర్శ‌ల‌తో విరుచుకుప‌డ‌డం కేటీఆర్‌కు అల‌వాటే. త‌న చెల్లికి ఈడీ నోటీసులు ఇవ్వ‌డంపై ఆయ‌న ఘాటుగా స్పందించారు.

తెలంగాణ భ‌వ‌న్‌లో మంత్రుల‌తో క‌లిసి మీడియా స‌మావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ క‌విత‌కు పంపింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) స‌మ‌న్లు కాద‌ని, అవి మోదీ స‌మ‌న్ల‌ని పంచ్ విసిరారు. క‌విత‌కు ఈడీ స‌మ‌న్లు ఇవ్వ‌గానే ఏదో జ‌రుగుతోంద‌ని భ‌యాన‌క ప‌రిస్థితులు సృష్టిస్తున్నార‌ని మండిప‌డ్డారు. త‌మ మంత్రుల‌పై ఇప్ప‌టికే ఈడీ, సీబీఐ, ఐటీ దాడులు చేశార‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు.

నీతిలేని పాలకుల అవినీతి ప్రభుత్వంగా కేంద్రం మారిందని కేటీఆర్ దుయ్య‌బ‌ట్టారు. నీతిలేని పాల‌న‌కు, నిజాయితీ లేని ద‌ర్యాప్తు సంస్థ‌ల‌కు ఎన్డీఏ ప్ర‌భుత్వం ప‌ర్యాయ‌ప‌దంగా మారింద‌ని  కేటీఆర్ విమ‌ర్శించారు.  మోదీ చేతుల్లో ఈడీ కీలుబొమ్మ, సీబీఐ తోలుబొమ్మ అని కేటీఆర్ తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. అదానీ మోదీ బినామీ అని చిన్న‌పిల్లాడిని అడిగినా చెబుతాడ‌ని అన్నారు. అవినీతికి పాల్ప‌డే అదానీ మీద ఏ కేసు ఉండ‌ద‌న్నారు.

అదానీకి చెందిన ముంద్రా పోర్ట్‌లో 21 వేల కోట్ల విలువైన‌ హెరాయిన్ దొరికితే కేసు కాలేద‌న్నారు. అదానీని విచారించే ద‌మ్ము ద‌ర్యాప్తు సంస్థ‌ల‌కు ఉందా ? అని కేటీఆర్ నిల‌దీశారు. ఎల్ఐసీ డబ్బులు ఆవిరైతే ప్రధాని ఉలకడు పలకడని ఎద్దేవా చేశారు. దేశంలో ప్రతిపక్షాలేవీ లేకుండా చేయాలని కుట్ర చేస్తున్నారని ధ్వ‌జ‌మెత్తారు. ఈడీ, సీబీఐ విపక్షాలపైనే 90 శాతం దాడులు చేశాయని కేటీఆర్ విమర్శించారు. 

ప్రధాని మోదీ దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని మంత్రి కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. బీజేపీలో చేర‌గానే కేసుల‌న్నీ ఏమై పోతున్నాయని కేటీఆర్ ప్ర‌శ్నించారు. సుజ‌నా చౌద‌రి, సీఎం ర‌మేశ్ బీజేపీలో చేర‌గానే కేసుల‌న్నీ మాయ‌మ‌య్యాయ‌ని తూర్పార‌ప‌ట్టారు. సుజ‌నా చౌద‌రిపై 6 వేల కోట్ల కేసు ఏమైంద‌ని ఆయ‌న నిల‌దీశారు. ఈ దేశంలో ఏం జ‌రుగుతోంద‌ని కేటీఆర్ ప్ర‌శ్నించారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?