
తనపై వచ్చిన లైంగిక ఆరోపణలపై స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్య తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఓ బర్త్ డే వేడుకలో కన్నీళ్లు పెట్టుకున్నారు. కేక్ ముందు కూర్చొని బోరున ఏడ్చారు. రాజకీయంగా ఎదుర్కోలేకే తనపై లైంగిక ఆరోపణలు చేస్తున్నారని భావోద్వేగానికి గురయ్యారు.
స్టేషన్‌ఘన్‌పూర్ లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, తనపై లైంగిక ఆరోపణల నేపథ్యంలో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు రాజయ్య. 63 ఏళ్ల వయసున్న తనపై లైంగిక ఆరోపణలు చేయడమేంటని ప్రశ్నించారు. సొంత చెల్లిని, బిడ్డను కూడా ముట్టుకోలేని పరిస్థితి కల్పించారని కన్నీటి పర్యంతమయ్యారు.
దమ్ముంటే ఫేస్ టూ ఫేస్ రాజకీయాలు చేయాలని.. తాడోపేడో తెలుసుకుందామని ఎమ్మెల్యే సవాల్ చేశారు. మహిళలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారని.. తాను ఏ తప్పు చేయలేదని... ఎవరు ఎన్ని కుట్రలు చేసినా మరో సారి భారీ మెజారిటీతో గెలిచి తీరుతా అంటూ శపథం చేశారు.
గత వారంలో ఎమ్మెల్యే రాజయ్య తనను లైంగింకగా వేధిస్తున్నాడంటూ సర్పంచ్ నవ్య ఆరోపించారు. ఈ క్రమంలో నవ్య ఆరోపణలను సుమోటోగా తీసుకున్న మహిళా కమిషన్ వేధింపుల ఆరోపణలపై విచారణకు ఆదేశించింది. పార్టీ అధిష్ఠానం ఆదేశాలతో ఆరోపణలు చేసిన సర్పంచ్ నవ్య ఇంటికి వెళ్లి సర్ధిచెప్పిన విషయం తెలిసిందే.