మోడీ వ్యాఖ్యలపై మండిపడుతున్న గులాబీ దళాలు!

పాత పార్లమెంటు భవనం సాక్షిగా కొన్ని చేదు నిర్ణయాలు కూడా చోటు చేసుకున్నాయని.. పరోక్షంగా తమ ప్రత్యేక పార్టీ నిందించడానికి ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రయత్నం ఇప్పుడు బ్యాక్ ఫైర్ అవుతున్నట్లుగా కనిపిస్తోంది.…

పాత పార్లమెంటు భవనం సాక్షిగా కొన్ని చేదు నిర్ణయాలు కూడా చోటు చేసుకున్నాయని.. పరోక్షంగా తమ ప్రత్యేక పార్టీ నిందించడానికి ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రయత్నం ఇప్పుడు బ్యాక్ ఫైర్ అవుతున్నట్లుగా కనిపిస్తోంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించినప్పుడు అటు తెలంగాణ గాని, ఇటు అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గాని పండగ చేసుకోలేకపోయాయని.. ఈ విభజన ఇరువర్గాలకు అయిష్టంగా జరిగిందని.. సరైన రీతిలో జరిగి ఉంటే తెలంగాణ ఇప్పటికి మరి ఎంతో అభివృద్ధి సాధించి ఉండేదని నరేంద్ర మోడీ లోక్సభలో అన్నారు. విభజనను కాంగ్రెస్ పార్టీ అరాచకంగా చేసిందని నిందించడంతోపాటు, విభజన తర్వాత బారాస ప్రభుత్వం సరిగా అభివృద్ధి చేయలేకపోయిందని  విమర్శించడం కూడా ఈ వ్యాఖ్యల ద్వారా మోడీ ఉద్దేశం అయి ఉండొచ్చు. తెలంగాణలో త్వరలో శాసనసభకు ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో మోడీ రాజకీయ మేలేజీ కోసం ఈ ప్రస్తావన తెచ్చి ఉండవచ్చు.

ఈ వ్యాఖ్యలపై ఇప్పుడు భారాస నాయకులు తీవ్రస్థాయిలో మండిపడుతూ ఉన్నారు. మోడీ తెలంగాణ విరోధి అని, పార్లమెంటు అమృతకాల సమావేశాలు అని పేరు పెట్టి తెలంగాణ మీద మనసులో ఉన్న విషం చెప్పడానికి ప్రయత్నిస్తున్నారని,  ఆయన వ్యాఖ్యలు దిగ్భ్రాంతి కలిగించాయని మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ధ్వజమెత్తుతున్నారు. 

తెలంగాణ అంటేనే గిట్టనట్టుగా, పగ పట్టినట్టుగా రాష్ట్ర పుట్టుకనే మోడీ అవమానిస్తున్నారని కేటీఆర్ దెప్పిపొడుస్తున్నారు. తమ ఆత్మ గౌరవాన్ని గాయపరుస్తున్నారని అంటున్నారు. మోడీ వ్యాఖ్యలకు కౌంటర్ గా కేటీఆర్ ట్విట్టర్ ఖాతాలో సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఏ ద్రోహాలు చేసిందో అందులో ఏకరవు పెట్టారు. ఆవు చేలో మేస్తే, దూడ గట్టును మేస్తుందా అన్న సామెత చందంగా.. తెలంగాణ మీద మోడీ విషం చిమ్ముతోంటే ఆయన పార్టీకి చెందిన మంత్రులు కూడా తెలంగాణకు తీరని ద్రోహం చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు.

మొత్తానికి ఎన్నికల ముంగిట్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి మోడీ చేసిన వ్యాఖ్యలను రాజకీయంగా  వీలైనంత ఎక్కువ మైలేజీ వచ్చేలా వాడుకోవడానికి భారత రాష్ట్ర సమితి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లుగా కనిపిస్తోంది.

కేటీఆర్ మాత్రమే కాకుండా, కల్వకుంట్ల కవిత కూడా మోడీ వ్యాఖ్యలపై విమర్శలు చేశారు. రాబోయే కొన్ని రోజుల తరబడి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కడపడితే అక్కడ ప్రెస్ మీట్ లు పెడుతూ.. బిజెపి తెలంగాణ మీద విషం చిమ్ముతున్నదనే ప్రచారానికి సిద్ధపడతారని అనుకోవచ్చు. మొత్తానికి మోడీ తన మాటల ద్వారా తెలంగాణలో తేనె తుట్టెను కదిపినట్లుగా అయింది.