Advertisement

Advertisement


Home > Politics - Telangana

మునుగోడు...సెమీ ఫైన‌ల్‌!

మునుగోడు...సెమీ ఫైన‌ల్‌!

తెలంగాణ‌లో మునుగోడు ఉప ఎన్నిక సెమీ ఫైన‌ల్ మ్యాచ్ లాంటిద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. వ‌చ్చే ఏడాది తెలంగాణ‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. కాంగ్రెస్ బ‌ల‌హీన‌ప‌డ‌డం, బీజేపీ బ‌లోపేతం అవుతున్న నేప‌థ్యంలో ఉప ఎన్నిక అత్యంత ప్రతిష్టాత్మ‌కం కానుంది. తెలంగాణ‌లో 2018 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కూ నాలుగు ఉప ఎన్నిక‌లు జ‌రిగాయి. టీఆర్ఎస్‌, బీజేపీ చెరో రెండు అసెంబ్లీ స్థానాల‌ను ద‌క్కించుకున్నాయి.

రెండు అసెంబ్లీ స్థానాల‌ను గెలుచుకోవ‌డం ద్వారా టీఆర్ఎస్‌కు తామే ప్ర‌త్యామ్నాయం అనే సంకేతాల్ని తెలంగాణ స‌మాజానికి బీజేపీ పంపింది. దీన్ని మ‌రింత బ‌లంగా జ‌నంలోకి తీసుకెళ్లేందుకు మునుగోడు ఉప ఎన్నిక‌లో గెలిచి తీరాల‌ని బీజేపీ ప‌ట్టుద‌ల‌తో వుంది. కాంగ్రెస్ పార్టీ స‌భ్య‌త్వానికి, ఎమ్మెల్యే ప‌ద‌వికి కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి రాజీనామా చేయ‌డంతో మునుగోడు ఉప ఎన్నిక తెర‌పైకి వ‌చ్చింది. ఇంకా 18 నెల‌ల ప‌ద‌వీ కాలం ఉండ‌గానే కోమ‌టిరెడ్డి రాజీనామా చేయ‌డం ఆస‌క్తిక‌ర ప‌రిణామం.

ముచ్చ‌ట‌గా మూడోసారి అధికారంలోకి రావాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్న టీఆర్ఎస్‌కు మునుగోడు ఉప ఎన్నిక అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కం. ఇదే సంద‌ర్భంలో దుబ్బాక‌, హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల్లో ఓట‌మి అధికార పార్టీ టీఆర్ఎస్ వెన్నులో వ‌ణుకు పుట్టిస్తోంది. మునుగోడులో కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి రూపంలో బ‌ల‌మైన అభ్య‌ర్థి వుండ‌డం టీఆర్ఎస్‌ను భ‌య‌పెడుతోంది. మ‌రో ఏడాదిన్న‌ర‌లో అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో దుబ్బాక‌, హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను మునుగోడు పున‌రావృతం చేస్తే... రాజ‌కీయ ప‌రిస్థితులు ఎలా వుంటాయ‌నే దానిపై టీఆర్ఎస్ త‌ర్జ‌న‌భ‌ర్జ‌న ప‌డుతోంది.

కోమ‌టిరెడ్డి అభ్య‌ర్థిత్వానికి తోడు కేంద్రంలో అధికారంలో ఉండ‌డం బీజేపీకి అద‌న‌పు బ‌లాల‌ని చెప్పొచ్చు. తెలంగాణ‌లో నెమ్మ‌దిగా బీజేపీ వైపు నేతలు వెళుతున్నారు. మునుగోడులో గెలిస్తే మాత్రం తెలంగాణ‌లో అధికారం త‌మ‌దే అనే ధీమాలో బీజేపీ వుంది. వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న తుది స‌మ‌రానికి మునుగోడు ఉప ఎన్నిక సెమీ ఫైన‌ల్ మ్యాచ్ లాంటిది. అందుకే ఆ మ్యాచ్‌లో గెలిచేందుకు బీజేపీ త‌ప్ప‌కుండా స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డుతుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.

మ‌రోవైపు మునుగోడులో గెలుపు త‌మ‌దే అని టీఆర్ఎస్ పైకి గాంభీర్యం ప్ర‌ద‌ర్శిస్తున్నా... లోలోప‌ల భ‌యంగా ఉంది. 2018లో కాంగ్రెస్ త‌ర‌పున కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి గెలిచిన‌ప్ప‌టికీ, ఆ త‌ర్వాత ఆరు మండ‌లాల‌కు జ‌రిగిన స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో ఐదు మండ‌లాల్లో టీఆర్ఎస్ పాగా వేసిన విష‌యాన్ని అధికార పార్టీ నేత‌లు గుర్తు చేస్తున్నారు. ఇది నిజ‌మే అయిన‌ప్ప‌టికీ తెలంగాణ‌లో ప్ర‌స్తుతం బీజేపీ సానుకూల‌, టీఆర్ఎస్ వ్య‌తిరేక ప‌వ‌నాలు వీస్తున్నాయ‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. ఏది ఏమైనా బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల‌కు మునుగోడు ఉప ఎన్నిక పెద్ద స‌వాల్‌గా మారింది.

వలయంలో జగన్

నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా