ప‌వ‌న్‌కు అంతా నీతులు చెప్పేవాళ్లే… అర్థం చేసుకోరు!

తెలంగాణ‌లో బీజేపీతో పొత్తులో భాగంగా జ‌న‌సేన 8 నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీ చేస్తోంది. అయితే ఎన్నిక‌ల‌కు కేవ‌లం ప‌ది రోజులు మాత్ర‌మే గ‌డువు ఉన్న‌ప్ప‌టికీ జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప్ర‌చారం చేయ‌క‌పోవ‌డం ఏంట‌నే నిల‌దీతలు, విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.…

తెలంగాణ‌లో బీజేపీతో పొత్తులో భాగంగా జ‌న‌సేన 8 నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీ చేస్తోంది. అయితే ఎన్నిక‌ల‌కు కేవ‌లం ప‌ది రోజులు మాత్ర‌మే గ‌డువు ఉన్న‌ప్ప‌టికీ జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప్ర‌చారం చేయ‌క‌పోవ‌డం ఏంట‌నే నిల‌దీతలు, విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ప్ర‌శ్నించ‌డానికే పార్టీ పెట్టాన‌ని ప్ర‌గల్భాలు ప‌లికిన ప‌వ‌న్‌ను ఆ మాత్రం ప్ర‌శ్నించ‌డం న్యాయ‌మైందే. అయితే ప‌వ‌న్‌క‌ల్యాణ్ స‌మ‌స్య‌ను ఏ ఒక్క‌రూ అర్థం చేసుకోవ‌డం లేద‌ని జ‌న‌సేన నేత‌లు వాపోతున్నారు.

ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వారాహియాత్ర‌లు చేసిన సులువుగా, తెలంగాణ‌లో చేయ‌లేర‌ని జ‌న‌సేన నేత‌లు అంటున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌తో ప్ర‌ధానంగా ప‌వ‌న్ రాజ‌కీయం ముడిప‌డి వుంది. ఎందుకో ఆయ‌న తెలంగాణ బ‌రిలో నిలిచారు. తెలంగాణ‌లో జన‌సేన పోటీపై భిన్నాభిప్రాయాలున్నాయి. వాట‌ని ప‌క్క‌న పెడితే, ఎన్నిక‌ల్లో అభ్య‌ర్థుల‌ను నిలిపి ప్ర‌చారం చేయ‌క‌పోవ‌డం ఏంట‌నే ప్ర‌శ్న‌కు మాత్రం ఆయ‌న సమాధానం చెప్పాల్సిన అవ‌స‌రం వుంది.

అయితే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప‌వ‌న్ ప్ర‌చారం, ఇత‌ర‌త్రా ఖ‌ర్చుల‌ను మ‌రో పార్టీ భ‌రిస్తోంద‌ని, తెలంగాణ‌లో భ‌రించ‌డానికి ఎవ‌రున్నార‌ని జ‌న‌సేన నేత‌లు ప్ర‌శ్నిస్తున్నారు. ఎన్నిక‌ల ఖ‌ర్చును ప‌వ‌నే భ‌రించాల్సి వ‌స్తోంద‌ని, ఆయ‌న ద‌గ్గ‌ర ఎక్క‌డి నుంచి వ‌స్తుంద‌ని జ‌న‌సేన నేత‌లు అడుగుతున్నారు. ఈ మాత్రం అర్థం చేసుకోకుండా ప‌వ‌న్‌ను ఊరికే విమ‌ర్శిస్తే ఎలా అని జ‌న‌సేన నేత‌లు వాపోతున్నారు. ఒక్క‌రోజు ఎన్నిక‌ల ప్ర‌చారానికి ప‌వ‌న్ వెళ్లిన క‌నిష్టంగా రూ.2 కోట్లు ఖ‌ర్చు అవుతుంద‌ని, అంత మొత్తాన్ని బీజేపీ ఇచ్చే ప‌రిస్థితి లేద‌ని జ‌న‌సేన నేత‌లు చెబుతున్నారు.

ఇదే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అయితే ఖ‌ర్చు గురించి ప‌వ‌న్ ఆలోచించే ప‌రిస్థితే ఉత్ప‌న్నం కాద‌నేది జ‌న‌సేన నేత‌ల అభిప్రాయం. ఏపీలో ప‌వ‌న్ ఖ‌ర్చుల‌న్నీ ఎవ‌రు చూసుకుంటున్నారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేద‌నేది జ‌న‌సేన నేత‌ల అభిప్రాయం. చేతి నుంచి ఖ‌ర్చు పెట్టే ప‌నైతే, అస‌లు తెలంగాణ‌లో ఎన్నిక‌ల గోదాలోకే ప‌వ‌న్ దిగేవారు కాద‌ని, తీరా ఇప్పుడు ఎవ‌రి కోస‌మైతే జ‌న‌సేన పోటీ చేస్తున్న‌దో, ఆ పార్టీనే ప‌ట్టించుకోలేద‌నే అసంతృప్తి వుంది.