Advertisement

Advertisement


Home > Politics - Telangana

కేసీఆర్ అవమానించాడు.. కానీ ఇప్పుడు అతనే దిక్కవుతున్నాడా ?

కేసీఆర్ అవమానించాడు.. కానీ ఇప్పుడు అతనే దిక్కవుతున్నాడా ?

అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ లో రాజసం ఉట్టిపడేది. ఎవ్వరినీ కేర్ చేసేవాడుకాదు. పార్టీ నాయకుల్లో కొందరిని పూచిక పుల్లలుగా చూశాడు. ఎంతటివారినైనా ఘోరంగా అవమానించేవాడు.  కానీ కాలం ఆయన్ని కాటేసింది. పరిస్థితి తారుమారైంది. ఆయన ఓడ బండిగా మారింది.

తెలంగాణ ఉద్యమాన్ని కొత్త పుంతలు తొక్కించిన ప్రొఫెసర్ కోదండరాంను అధికారంలోకి రాగానే దారుణంగా అవమానించాడు. ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్ ను భూకబ్జా ఆరోపణలతో మంత్రిపదవి నుంచి తొలగించాడు. కానీ తరువాత ఆ ఆరోపణలకు ఆతీ గతీ లేకుండా పోయింది.

ఆయన బీజేపీలో చేరిపోయి ఉప ఎన్నికలో గెలిచి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాడు. ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. అధికారంలోకి రాగానే అప్పట్లో తన మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రిగా, ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న తాటికొండ రాజయ్యను అవినీతి ఆరోపణల పేరుతో కేబినెట్ నుంచి తొలగించాడు.

ఆ ఆరోపణల గురించి కేసీఆర్ ఎప్పుడూ చెప్పలేదు.  ఆయన ఎంతో కాలం మంత్రిగా పనిచేయలేదు. ప్రతిపక్షాలను దెబ్బ తీయడానికి ఎన్నికల్లో చాలా ముందుగా అభ్యర్థులను ప్రకటించే అలవాటున్న కేసీఆర్ కు ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల కోసం అభ్యర్థులు దొరకని పరిస్థితి ఏర్పడింది. ప్రకటించిన అభ్యర్థులు పార్టీని విడిచిపెడుతున్నారు. దీంతో ఆయనకు ఊహించని షాకులు తగులుతున్నాయి.

వరంగల్ విషయంలో కడియం శ్రీహరి, ఆయన కూతురు షాకిచ్చారు కదా. ఏరికోరి కావ్యను అభ్యర్థిగా ఎంపిక చేస్తే చివరి క్షణంలో ఆమె తాను పోటీ చేయలేనని చెప్పింది. తండ్రీ, కూతురు కాంగ్రెస్ లోకి వెళ్లిపోయారు. అసెంబ్లీ ఎన్నికల్లో తనకు టిక్కెట్ ఇవ్వలేదని కోపగించుకున్న తాటికొండ రాజయ్య పార్టీకి రిజైన్ చేశాడు. ఇప్పుడు ఆయన్నే వరంగల్ అభ్యర్థిగా నిలబెట్టాలని అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇక్కడ రాజయ్యకు ప్లస్ పాయింట్ ఏమిటంటే ... ఆయన గులాబీ పార్టీకి రాజీనామా చేసినా  ఏ పార్టీలో జాయిన్ కాలేదు. అందుకే ఆయనకు టిక్కెట్ ఇవ్వాలని అనుకుంటున్నట్లు సమాచారం. ఇప్పుడు కేసీఆర్ కు ఒకప్పుడు తాను అవమానించిన వ్యక్తికే పిలిచి టిక్కెట్ ఇవ్వక తప్పడంలేదు. ఒకప్పటి రాజుకు ఇలాంటి పరిస్థితి రావడం విధిలీలే అందామా?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?