Advertisement

Advertisement


Home > Politics - Analysis

కాకినాడ రూరల్.. టఫ్ ఫైట్

కాకినాడ రూరల్.. టఫ్ ఫైట్

కాకినాడ రూరల్.. ఈస్ట్ గోదావరిలో కాస్త పెద్ద నియోజక వర్గం. భౌగోళికంగా ఇటు అటు సాగిన నియోజకవర్గం. ఇక్కడ పోటీ అన్నా ప్రచారం అన్నా కాస్త కష్టమే. ఇక్క‌డ పూర్తిగా అర్బన్ మనస్తత్వం వున్న ఓటర్లు.. పూర్తిగా రూరల్ మెంటాలిటీ వున్న ఓటర్లు వున్నారు. సెమీ అర్బన్ ఓటర్లు కూడా వున్నారు. సకల అగ్రవర్ణాల ఓట్లతో పాటు బిసి, ఎస్ సి, కాపు, బలిజ ఓట్లు గణనీయంగా వున్న నియోజకవర్గం ఇది. అందువల్ల ఇక్కడ ఓటింగ్ ఓ పాట్రన్ గా, ఒకే మాదిరిగా వుండదు.

ఇక్కడ నుంచి కురసాల కన్నబాబు ఇప్పటికి రెండు సార్లు గెలిచారు. ఒకసారి ఓడారు. ఓడింది స్వతంత్ర అభ్యర్ధిగా. అప్పుడు కూడా దాదాపు 43 వేల ఓట్లు సాధించారు. అది కూడా స్వతంత్ర అభ్యర్ధిగా. కనీసం 30శాతం నుంచి వేవ్ వుంటే నలభై శాతం వరకు ఓట్ బ్యాంక్ వుంది కన్నబాబుకు. తెలుగుదేశం పార్టీకి కూడా మంచి ఓటు బ్యాంక్ వుంది కానీ ఈసారి ఈ స్ధానాన్ని జనసేనకు కేటాయంచారు. గత అయిదేళ్లుగా వీలయినంత వరకు ప్రజల్లోనే వుంటూ వస్తున్న పంతం నానాజీ జనసేన అభ్యర్ధి. ఎన్నికలు అంటూ వస్తే, జనసేన అభ్యర్ధి ఆయనే అని ముందుగానే డిసైడ్ అయిపోవడం అన్నది నానాజీకి ప్లస్ అయింది. అందువల్లే చిరకాలంగా పంతం నానాజీ పేరు జనాల్లో బాగా ప్రచారంలోకి వెళ్లింది.

ఒక్కసారి అయినా పంతం నానాజీ గెలవాలి, పాపం అనే జనాల సంఖ్య గట్టిగానే వుంది. కానీ ఈ జనాలు అంతా సకల ఈక్వేషన్లు దాటి ఆయనకు ఓటు వేస్తారా? అన్నదే చూడాలి. కన్నబాబుకు ప్లస్ పాయింట్ ఏమిటంటే నాన్ కాంట్రావర్సీ. ఎవరు వచ్చినా, ఎవరు పిలిచినా పలుకుతారు అన్నది ఆయనకు వున్న అదనపు బలం.

నియోజకవర్గంలో ఇప్పుడు కన్నబాబు టఫ్ ఫైట్ ను ఎదుర్కొంటున్నారు. గతంలో మాదిరిగా భారీ మెజార్టీని ఆశించడం కష్టం. గెలుపు సాధ్యమైనా కూడా అది అయిదు నుంచి పదివేల ఓట్ల మేరకే వుండే అవకాశం వుంది. జనసేన అధినేత పవన్ పక్కనే వున్న పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన సన్నిహితుడు టి టైమ్ ఉదయ్ ఎంపీగా పోటీ చేస్తున్నారు. దీని ప్రభావం కాకినాడ రూరల్ మీద అంటే కన్నబాబు గెలుపు మీద ప్రభావం చూపిస్తుందనే అనుమానం స్ధానికుల్లో వ్యక్తం అవుతోంది.

బిసి, ఎస్సీ, ఎస్టీ ఓటు బ్యాంక్ మీద కన్నబాబు గట్టి నమ్మకంతో వున్నారు. అలాగే క్షత్రియులు ఈ నియోజవర్గం వరకు ప్రస్తుతానికి అయితే కన్నబాబుకు అనుకూలంగానే వున్నారు. మిగిలిన ఫార్వార్డ్ కులాల వారు అటు ఇటుగా చీలిపోయి వున్నారు. బిసిల్లో మెజారిటీ ఓట్ల తమకు వస్తాయనే ధీమా వైకాపాలో వుంది. నియోజకవర్గంలో అధికంగా వున్న కాపు ఓట్లు మొత్తం తమకే వస్తాయనే ధీమా జనసేనలో వుంది. అలాగే శెట్టిబలిజ ఓటు బ్యాంక్ కు తేదేపాకు వుంది. అది ఇప్పుడు జనసేనతో కలిసింది. అలాగే యువత ఈసారి తమకే కులాలకు అతీతంగా ఓటు వేస్తారని జనసేన మద్దతు దారులు అంటున్నారు.

గ్రౌండ్ లెవెల్ కార్యకర్తల్లో చూసుకుంటే జనసేన జనాల్లో వున్నంత గెలుపు ధీమా వైకాపా జనాల్లో కనిపించడం లేదు. చూడాలి.. మార్జిన్ లో వచ్చేస్తాం, లాస్ట్ వన్ వీక్ లో అంతా మారిపోతుంది, ఇలాంటి మాటలు వినిపిస్తున్నాయి. జనసేన వరకు వున్న ప్రధాన బలం అభ్యర్ధి మీద వున్న సింపతీ.

అయితే బిసి ఓట్లలో 80శాతం వరకు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఓట్లు, కాపు ఓట్లలో కనీసం 30శాతం కన్నబాబుకు వస్తాయనే విశ్లేషణలు కూడా వున్నాయి. అందువల్ల పోటీ చాలా గట్టిగా, ఎటూ తేల్చి చెప్పలేనంతగా వుంది. చివరి వారంలో ఎలా తిరుగుతుందో చూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?