Advertisement

Advertisement


Home > Politics - Telangana

బ‌ర్త‌ర‌ఫ్ కాదు...చంచ‌ల్‌గూడ జైల్లో పెట్టాలి!

బ‌ర్త‌ర‌ఫ్ కాదు...చంచ‌ల్‌గూడ జైల్లో పెట్టాలి!

తెలంగాణ‌లో టీఎస్‌పీఎస్సీ ప‌రీక్ష ప్ర‌శ్నాప‌త్రాలు లీకేజీ వ్య‌వ‌హారం రాజ‌కీయ రంగు పులుముకుంది. మంత్రి కేటీఆర్ కేంద్రంగా ప్ర‌తిప‌క్షాలు తీవ్ర ఆరోప‌ణ‌లు చేస్తున్నాయి. ఈ మొత్తం ఎపిసోడ్‌లో కేటీఆర్ హ‌స్తం వుంద‌ని కాంగ్రెస్‌, బీజేపీ ముఖ్య నాయ‌కులు ఘాటు విమ‌ర్శ‌ల‌తో విరుచుకుప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి కామారెడ్డి జిల్లా గాంధారిలో ఒక్క‌రోజు నిరాహార దీక్ష చేప‌ట్టారు.

ఈ సంద‌ర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ మంత్రి కేటీఆర్‌ను బ‌ర్త‌ర‌ఫ్ చేయ‌డ‌మే కాకుండా, చంచ‌ల్‌గూడ జైల్లో పెట్టాల‌ని డిమాండ్ చేశారు. టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ క‌థ‌ను కేటీఆర్ పీఏ తిరుప‌తి న‌డించార‌ని ఆరోపించారు. కేటీఆర్కు షాడో మంత్రి ఆయన పీఏ అని రేవంత్‌రెడ్డి వెట‌క‌రించారు. కేటీఆర్ మంత్రి కార్యాల‌య‌మే అన్ని వ్య‌వ‌హారాలు న‌డిపింద‌ని రేవంత్ సంచ‌ల‌న ఆరోప‌ణ చేయ‌డం గ‌మ‌నార్హం. ఏ విచార‌ణ జ‌రిపినా కేటీఆర్ పేషీ నుంచి మూలాలు బ‌య‌ట‌ప‌డుతున్నాయ‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు.  

గ్రూప్‌-1లో 100కు పైగా మార్కులు వ‌చ్చిన అంద‌రి వివ‌రాలు బ‌య‌ట‌పెట్టాల‌ని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. కేటీఆర్ పీఏ తిరుప‌తి సూచ‌న‌తోనే లీకు కేసులో నిందితుడైన‌ రాజ‌శేఖ‌ర్‌కు టీఎస్ పీఎస్సీలో ఉద్యోగం ఇచ్చిన‌ట్టు ఆయ‌న చెప్పుకొచ్చారు. రాజ‌శేఖ‌ర్‌, కేటీఆర్ పీఏ తిరుప‌తి ఊర్లు ప‌క్క‌ప‌క్క‌నే అని చెప్పారు. కేటీఆర్ పీఏ, రాజ‌శేఖ‌ర్ స‌న్నిహితుల‌కు ఎక్కువ మార్కులు వ‌చ్చాయ‌న్నారు. టీఎస్‌పీఎస్సీలో ప‌ని చేస్తూ పోటీ ప‌రీక్ష‌ల‌కు ఎలా స‌న్న‌ద్ధం అవుతార‌ని రేవంత్‌రెడ్డి నిల‌దీశారు.

పేపర్ లీకేజీలో ఇద్దరి వ్యక్తులకే సంబంధం ఉందని కేటీఆర్ ఎలా చెప్తారని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. టీఎస్పీఎస్సీలో  కాన్ఫిడెంటల్ సెక్షన్ ఆఫీసర్ శంకర్ లక్ష్మి పాత్ర ఏంటో చెప్పాలని రేవంత్ డిమాండ్ చేశారు. కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాతే నిందితులను కస్టడీలోకి తీసుకున్నారని రేవంత్ విమర్శించారు.   

పేపర్ లీక్ కేసులో ప్రభుత్వ పెద్దలను తప్పించడానికి తామే నేరం చేసినట్లు ఒప్పుకునేలా కస్టడీలో నిందితుల‌ను బెదిరిస్తున్నారని రేవంత్ ఆరోపించారు. చంచల్ గూడ జైల్ సీసీ ఫుటేజ్‌ను, వివరాలను ప్రభుత్వం బటయపెట్టాలని రేవంత్ డిమాండ్ చేశారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?