ఈ విషయంలో కేసీఆర్ నే ఫాలో అవుతున్నాడు

రాజకీయ నాయకులు, సినిమా వాళ్ళు, సామాన్య ప్రజలు …ఎవరైనా కావొచ్చు నమ్మకాలు, సెంటిమెంట్లు ఉంటాయి. వీటికి భయాలే కారణం. ఈ భయాలు రాజకీయ నాయకులకు కాస్త ఎక్కువగా ఉంటాయి. ఉన్న పదవి ఎక్కడ ఊడిపోతుందేమోనని…

రాజకీయ నాయకులు, సినిమా వాళ్ళు, సామాన్య ప్రజలు …ఎవరైనా కావొచ్చు నమ్మకాలు, సెంటిమెంట్లు ఉంటాయి. వీటికి భయాలే కారణం. ఈ భయాలు రాజకీయ నాయకులకు కాస్త ఎక్కువగా ఉంటాయి. ఉన్న పదవి ఎక్కడ ఊడిపోతుందేమోనని వారు అనుక్షణం భయపడుతుంటారు. సీఎం పదవిలో ఉన్నప్పుడు కేసీఆర్ భయపడ్డాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా భయపడుతున్నట్లుగానే ఉంది.

సచివాలయంలో వాస్తు మార్పులు చేస్తుండటం చూస్తుంటే ఇదే అనుకోవాల్సి వస్తోంది. వాస్తు కారణాలు చూపించే కదా కేసీఆర్ కొత్త సచివాలయం కట్టింది. వాస్తు నిపుణుల సలహాల మేరకే కేసీఆర్ సచివాలయం కట్టాడు. ఆయన హయాంలో కేబినెట్ హోదాతో ప్రభుత్వంలో ఒక వాస్తు నిపుణుడినే నియమించాడు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడం కోసం పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ లో కూడా మార్పులు చేశాడు. వాస్తును, యజ్ఞాలను, యాగాలను ఎంత నమ్ముకున్నా ప్రజల నిర్ణయం ముందు అవేవీ పని చేయలేదు. వారు ఓడించాలనుకొని దిగ్విజయంగా ఆ పని పూర్తి చేశారు.

సరే … ఆయన కథ ముగిసింది. కానీ కొత్త సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆయన దారిలోనే నడుస్తున్నట్లుగా కనబడుతోంది. ఈయనకూ భయాలు ఉన్నట్లుగా ఉంది. అందుకే సచివాలయంలో మార్పులు చేస్తున్నారు. కేసీఆర్ కు తొమ్మిది అంకె లక్కీ నెంబర్ అని అనేవారు. కానీ సచివాలయం వరకు వచ్చేసరికి ఆరో నెంబర్ లక్కీ నెంబర్ అయింది. అందుకే సచివాలయంలో ఆరో అంతస్తులో ఆయన చాంబర్ ఉండేది. ఇప్పుడు రేవంత్ చాంబర్ తొమ్మిదో అంతస్తుకు మారుస్తున్నారట. ఎందుకంటే ఆయన లక్కీ నెంబర్ తొమ్మిది కాబట్టి.

ఆయన కార్ల నెంబర్లు కూడా తొమ్మిదితో మొదలవుతాయి. సచివాలయంలో గేట్లు మారుస్తున్నారు. అంటే సీఎం, అధికారుల రాకపోకల దిశా మారుతుంది. ఏ దిక్కు నుంచి రాకపోకలు సాగిస్తే మంచిదో వాస్తు పండితులు చెబుతుంటారు. ద్వారాలు మార్చడమే కాకుండా, నడక కూడా అంటే రాకపోకలు కూడా మన జీవితం మీద ప్రభావం చూపిస్తాయని వాస్తు పండితులు చెబుతుంటారు.

పాత సచివాలయంలో హిందూ దేవాలయం, మసీదు, చర్చి ఉండేవి. అప్పట్లో పాత సచివాలయం భవనాలు కూలగొట్టినప్పుడు శిథిలాలు వాటి మీద పడ్డ కారణంగా అవి కూలిపోయాయి. ఈ మూడింటిని కొత్త సచివాలయంలో బ్రహ్మాండంగా కట్టిస్తానని చెప్పాడు. అన్నట్లుగానే కట్టించాడు. హిందూ దేవాలయమైన నల్ల పోచమ్మ గుడి సచివాలయం వెనుక వైపు ఉంది. పాత సచివాలయంలో ముందు భాగంలో ఉండేదట. ఇప్పుడు వెనుక వైపు ఉండటం మంచిది కాదంటున్నారు.

వెనుక వైపు ఉండటమే కాకుండా సచివాలయం కంటే దిగువగా ఉందట. ఇది అసలు మంచిది కాదంటున్నారు. సెక్రటేరియట్ తూర్పు వైపు ఉన్న ద్వారం కూడా వాస్తు ప్రకారం లేదట. ఇవన్నీ రేవంత్ రెడ్డి మీద ప్రభావం చూపిస్తాయి. గతంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయమైన గాంధీ భవన్ లో వాస్తు మార్పులు చేయించాడు రేవంత్. ఆ తరువాత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలిచింది. ఎవరూ ఊహించని విధంగా రేవంత్ సీఎం అయ్యాడు. ఇప్పుడు సచివాలయంలో మార్పులు చేయించడం కూడా తన పదవి పదిలంగా ఉండాలనే ఉద్దేశంతోనే అంటున్నారు.

చూడబోతే సచివాలయంలో చాలా మార్పులు జరిగేలా ఉన్నాయి. వాస్తు కేసీఆర్ కు ఒక విధంగా, రేవంత్  రెడ్డికి మరో విధంగా ఉంటుందా? మనిషికో విధంగా ఉంటుందనే కదా మార్పులు చేర్పులు చేస్తున్నారు. వాస్తు శాస్త్రం కాదనే వారు ఉన్నారు. వాస్తు శాస్త్రమేనని, ఇదో సైన్స్ అనే వారూ ఉన్నారు. మనుషుల నమ్మకాలకు అనుగుణంగానే శాస్త్రాలు ఉంటాయి. వారికి అనుకూలంగా మారుతాయి.