Advertisement

Advertisement


Home > Politics - Telangana

అన్న నిర్ణయం తప్పని చెప్పిన చెల్లెలు

అన్న నిర్ణయం తప్పని చెప్పిన చెల్లెలు

ఏ పాలకుడైన ఎప్పుడూ మంచి నిర్ణయాలే తీసుకుంటాడని ఆశించలేం. ముఖ్యంగా ఇప్పటి పాలకులు ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు బాగా కసరత్తు చేస్తారని, ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారని అనుకోవడం భ్రమ. ఏ నిర్ణయమైనా ఓటు బ్యాంకును దృష్టిలో పెట్టుకొని తీసుకుంటారు. రాగద్వేషాలకు అతీతంగా ఏ పాలకుడూ ఉండలేడు. ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయానికి తన తండ్రి వైఎస్సార్ పేరు పెడుతూ జగన్ తీసుకున్న నిర్ణయం తీవ్ర విమర్శలకు గురవుతోంది. విచిత్రమేమిటంటే వైసీపీ నాయకుల్లోనూ కొందరు ఈ నిర్ణయాన్ని బహిరంగంగానే విమర్శించారు.

కొందరు ఏమీ స్పందించలేదు. అలాగని వారు ఈ నిర్ణయాన్ని సమర్ధిస్తున్నారని అనుకోలేం. జగన్ రాత్రికి రాత్రి ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో, దీని వెనుక ఉన్న లాజిక్ ఏమిటో ఎవరికీ అర్ధం కావడంలేదు. పేరు ఎందుకు మార్చిందీ జగన్ కూడా స్పష్టంగా చెప్పలేదు.  హఠాత్తుగా ఎన్టీఆర్ పేరును తీసేసి ఆయన ఏం సాధించాలనుకున్నారు? చాలా మందికి ఇదే డౌట్ వచ్చింది. ఎందుకంటే ఈ నిర్ణయంలో ఎంత వెదుక్కున్నా రాజకీయ విశ్లేషకులకు ప్లస్ పాయింట్లు కనిపించడం లేదు మరి. కొత్తగా వైఎస్ఆర్‌ను ఆకాశానికెత్తడం వల్ల ఎలాంటి ఓటు బ్యాంక్ ద్గగరకు రాదు.

కానీ సీఎం జగన్ రాత్రికి రాత్రి ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ పేరును  వైఎస్ఆర్ పేరు మీదకు మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. ఉదయం అమలు చేసేశారు. ఆయనకు తిరుగులేని మెజార్టీ ఉంది. అనుకున్నట్లే చేయగలరు.. చేశారు. కానీ ఇందులో అసలు రాజకీయ లాభం ఏమిటనేది వైఎస్ఆర్‌సీపీ నేతలకూ అర్థం కావడం లేదు. ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ పేరు మార్పు అనే అంశం గత మూడున్నరేళ్లలో ఎప్పుడూ చర్చకు రాలేదు. సీఎం జగన్ అలాంటి ఆలోచన చేస్తున్నారని ఎవరూ అనుకోలేదు.

చివరికి సెప్టెంబర్ 20 మంగళవారం రాత్రి తొమ్మిది  గంటల వరకూ ఎవరికీ తెలియదు. కానీ ఆ తర్వాత మాత్రం.. ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ పేరును మార్చాలని కేబినెట్ నిర్ణయించిందన్న సమాచారం బయటకు వచ్చింది. ఆన్ లైన్‌లోనే అంగీకారం తీసుకున్నారని.. అసెంబ్లీలో బిల్లు పెడతారని ఆ సారాంశం. ఇంత వేగంగా పని పూర్తి చేశారంటే హఠాత్తుగా తీసుకున్న నిర్ణయమైనా అయి ఉండాలి లేదా.. పకడ్బందీ వ్యూహం ప్రకారం బయటకు పొక్కకుండా పని పూర్తి చేశారనైనా అనుకోవాలి. అయితే ఇలా చేసినా అసలు మోటో ఏమిటన్నది మాత్రం క్లారిటీ లేదు. 

వైఎస్ఆర్‌సీపీలో కొంత మంది కరుడుగట్టిన తెలుగుదేశం నేతలు ఉన్నారు. వారు తెలుగుదేశానికి దూరమయ్యారు. కానీ ఎన్టీఆర్‌ను దైవంగా చెబుతూ ఉంటారు. వారిలో అసంతృప్తి బయటపడింది. అధికార భాషా సంఘం పదవికి యార్లగడ్డ లక్ష్మిప్రసాద్ రాజీనామా చేసేశారు. తెలుగు మీడయాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా ఆయన ప్రభుత్వాన్ని సమర్థించారు. వల్లభనేని వంశీ మరోసారి నిర్ణయాన్ని పరశీలించాలని సోషల్ మీడియా ద్వారా కోరారు. కొడాలి నాని, లక్ష్మి పార్వతి లాంటి నేతుల స్పందించడానికి తటపటాయిస్తున్నారు. 

సోషల్ మీడియాలో కరుడు గట్టిన వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు కొందరు.. ఇది మంచి నిర్ణయం కాదని నిర్మోహమాటంగానే చెబుతున్నారు. ఈ మాత్రం స్పందన వైఎస్ఆర్‌సీపీ హైకమాండ్ ఊహించి ఉండదని అనుకోలేం. ఇక అన్న నిర్ణయాన్ని చెల్లెలు షర్మిల తీవ్రంగా తప్పుబట్టింది. తెలంగాణలో అలుపు సొలుపూ లేకుండా పాదయాత్ర చేస్తున్న షర్మిల పాదయాత్ర చేస్తూనే ఒక టీవీ ఛానెల్ తో మాట్లాడుతూ ఒక ఇలా పేర్లు మార్చటం పైన తన అభిప్రాయం స్పష్టం చేసారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఇలా పేర్లు మార్చకూడదని అభిప్రాయపడ్డారు. ఆ పేరు కొనసాగిస్తే వారికి గౌరవం ఇచ్చినట్లవుతుందని చెప్పుకొచ్చారు. 

కారణాలు ఏవైనా ఎవరి పేర్లు ఉన్నాయో, ఆ పేర్లే కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. దీని ద్వారా ఆ పేరుకు మరింత గౌరవం పెరుగుతుందని చెప్పారు. పేర్లు మార్చుతూ కొత్త పేర్లను డిసైడ్ చేస్తే అయోమయం ఏర్పడుతుందని షర్మిల వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పైన షర్మిల వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న టీడీపీ ఇప్పుడు షర్మిల వ్యాఖ్యలను తమకు అనుకూలంగా.. సీఎం జగన్ ను రాజకీయంగా ఫిక్స్ చేయటానికి అస్త్రంగా మలచుకొనే అవకాశం కనిపిస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?