Advertisement

Advertisement


Home > Politics - Telangana

త‌మ్ముడిని ఓడించ‌డానికి అన్న ప‌నిచేస్తాడా?

త‌మ్ముడిని ఓడించ‌డానికి అన్న ప‌నిచేస్తాడా?

తెలంగాణ‌లో రెడ్డి బ్ర‌ద‌ర్స్ రాజ‌కీయాల‌పై స‌ర్వ‌త్రా చ‌ర్చ జ‌రుగుతోంది. కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి, ఆయ‌న త‌మ్ముడు రాజ‌గోపాల్‌రెడ్డి ఇంత కాలం కాంగ్రెస్‌లోనే ఉంటూ వ‌చ్చారు. ఇప్పుడు త‌మ్ముడు రాజ‌గోపాల్‌రెడ్డి దారి వేరైంది. అన్న వెంక‌ట‌రెడ్డి కాంగ్రెస్‌లోనే కొన‌సాగుతుండ‌గా, త‌మ్ముడు మాత్రం బీజేపీ పంచ‌న చేరారు. కాంగ్రెస్ పార్టీ స‌భ్య‌త్వానికి, ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజ‌గోపాల్‌రెడ్డి రాజీనామా చేయ‌డంపై టీపీసీసీ ఘాటుగా స్పందించింది.

ప్ర‌ధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలు విసిరిన ఎంగిలి మెతుకుల కోసం రాజ‌గోపాల్‌రెడ్డి పార్టీ వీడిన‌ట్టు టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి తీవ్రంగా విమ‌ర్శించారు. కాంట్రాక్టుల కోసం క‌న్న‌త‌ల్లి లాంటి పార్టీని వీడార‌ని మండిప‌డ్డారు. అంతేకాదు, రాజ‌గోపాల్‌రెడ్డిని విశ్వాస‌ఘాత‌కుడ‌ని రేవంత్‌రెడ్డి విమ‌ర్శించారు.

ఇదే సంద‌ర్భంలో రేవంత్‌రెడ్డిపై రాజ‌గోపాల్‌రెడ్డి ఘాటు వ్యాఖ్య‌ల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాల్సి వుంటుంది. నాలుగు పార్టీలు మారిన రేవంత్‌రెడ్డిని పీసీసీ అధ్య‌క్షుడిని చేయ‌డం కాంగ్రెస్ శ్రేణులు జీర్ణించుకోలేక‌పోతున్నాయ‌న్నారు. అలాగే పార్టీని న‌మ్ముకున్న వాళ్ల‌కు కాకుండా కొత్త‌గా వ‌చ్చిన వాళ్ల‌కే కీల‌క ప‌ద‌వులు ఇచ్చార‌ని ఆరోపించారు. టీడీపీ నుంచి వ‌చ్చిన రేవంత్‌రెడ్డికి టీపీసీసీ బాధ్య‌త‌ల్ని అప్ప‌గించ‌డాన్ని రెడ్డి బ్ర‌ద‌ర్స్ గ‌తంలో బ‌హిరంగంగానే త‌ప్పు ప‌ట్టారు.

ఒక ద‌శ‌లో గాంధీభ‌వ‌న్‌లో అడుగే పెట్ట‌న‌ని కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య చేశారు. అలాంటి వ్య‌క్తి త‌ర్వాత కాలంలో రేవంత్‌రెడ్డితో స‌ర్దుకుపోతున్నారు. కానీ రాజ‌గోపాల్‌రెడ్డి మాత్రం అన్న‌లా లౌక్యంగా కాంగ్రెస్‌లో కొన‌సాగ‌లేక‌పోయారు. మ‌రోవైపు కాంగ్రెస్‌లో భ‌విష్య‌త్ లేద‌నే నిర్ణ‌యానికి వచ్చారు. క‌నుచూపు మేర‌లో కోలుకుంటుంద‌నే న‌మ్మ‌కం లేని కాంగ్రెస్‌లో కొన‌సాగ‌డం కంటే, బీజేపీలో చేరడ‌మే ఉత్త‌మ‌మ‌ని నిర్ణ‌యించుకున్నారు. త‌న మ‌న‌స్సాక్షి చెప్పిన‌ట్టు రాజ‌గోపాల్‌రెడ్డి ముందుకెళుతున్నారు.

మునుగోడు ఉప ఎన్నిక బాధ్య‌త‌ల్ని కాంగ్రెస్ అధిష్టానం టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి,  ఎంపీ, కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి అన్న కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి, టీపీసీసీ మాజీ అధ్య‌క్షుడు , ఎంపీ ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి,  సీనియ‌ర్ నేత కె.జానారెడ్డిల‌కు అప్ప‌గించ‌డం ప్రాధాన్యం ఏర్ప‌డింది. వీరిలో కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి ఉండ‌డంపై పెద్ద ఎత్తున చ‌ర్చ‌కు తెర‌లేచింది.  

త‌మ్ముడు రాజ‌గోపాల్‌రెడ్డి రాజ‌కీయ మార్పు, ఇత‌ర అంశాల‌పై వెంక‌ట‌రెడ్డి ఇంత వ‌ర‌కూ నోరు తెర‌వ‌లేదు. త‌మ్ముడిపై రేవంత్‌రెడ్డి ఘాటు వ్యాఖ్య‌లు చేస్తున్నా ఏమీ అన‌లేని నిస్స‌హాయ స్థితిలో వెంక‌ట‌రెడ్డి ఉన్నారు. ఈ నేప‌థ్యంలో త‌మ్ముడిని ఓడించ‌డానికి కాంగ్రెస్ అధిష్టానం ఏర్పాటు చేసిన టీంలో కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి కొన‌సాగుతారా? అనే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మ‌వుతోంది. వెంక‌ట‌రెడ్డి నిజ స్వ‌రూపం ఏంటో తెలుసుకునే క్ర‌మంలో వ్యూహాత్మ‌కంగా కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డికి బాధ్య‌త‌లు అప్ప‌గించార‌నే చ‌ర్చ జ‌రుగుతోంది.

కాంగ్రెస్‌లో అన్న‌, బీజేపీలో త‌మ్ముడు ఉంటూ డ్రామాలు ఆడుతున్నార‌ని, వాటిని క‌ట్ట‌డి చేసేందుకే వెంక‌ట‌రెడ్డి నిబ‌ద్ధ‌త‌ను కాంగ్రెస్ అధిష్టానం ప‌రీక్ష‌కు పెట్టింద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. కాంగ్రెస్‌లో కీల‌క నాయ‌కుడిగా ఉంటూ త‌మ్ముడి ఓట‌మి కోసం ప‌ని చేయ‌డ‌మా? లేక తాను బీజేపీలో చేర‌డ‌మా? అనేది నిర్ణ‌యించుకునే ప‌రిస్థితి త‌లెత్తింది. మొత్తానికి వెంక‌ట‌రెడ్డికి ఇర‌కాటమే అని చెప్ప‌క త‌ప్ప‌దు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?