Advertisement

Advertisement


Home > Politics - Telangana

రాములమ్మకు ఎన్నికల్లో పోటీ చేసే ఛాన్స్ వస్తుందా?

రాములమ్మకు ఎన్నికల్లో పోటీ చేసే ఛాన్స్ వస్తుందా?

ఇటు తెలంగాణలో గానీ, అతి ఆంధ్రాలో గానీ అన్ని పార్టీలు రాబోయే ఎన్నికల గురించే ఆలోచిస్తున్నాయి. వివిధ పార్టీల్లోని నాయకులూ అదే ఆలోచనల్లో ఉన్నారు. ఎవరి వ్యూహాలు వారు రచించుకుంటున్నారు. నాయకులు ఏ నియోజకవర్గం (అసెంబ్లీ అండ్ లోక్ సభ) నుంచి పోటీ చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నారు. పార్టీలు ఏ నాయకులను ఎక్కడి నుంచి పోటీ చేయించాలో ప్లాన్ చేస్తున్నాయి.

పార్టీల, నాయకుల ఆలోచనలు, ప్రణాళికలు మీడియాలో అప్పుడప్పుడు లీక్ అవుతున్నాయి. అవి నిజమో కాదో సరిగ్గా తెలియదు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రావాలని గట్టి పట్టుదలతో ఉన్న బీజీపీ కేంద్ర నాయకత్వం అందుకు తగ్గట్లుగా ప్రణాళికలు రూపొందిస్తోంది, కార్యక్రమాలు చేస్తోంది. తెలంగాణాకు ప్రాధాన్యం ఇస్తున్నామని నమ్మకం కలిగించడానికి ప్రయత్నాలు చేస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణపై ఆ పార్టీ అగ్రనాయకత్వం సీరియస్‌గా దృష్టి సారించింది.

ఈ క్రమంలోనే తెలంగాణలోని పలువురు నేతలను ఇతర రాష్ట్రాల నుంచి రాజ్యసభకు పంపింది. బీజేపీ మాజీ ఎమ్మెల్యే, ఆ పార్టీ సీనియర్ నేత లక్ష్మణ్‌ను యూపీ కోటా నుంచి రాజ్యసభకు పంపింది బీజేపీ జాతీయ నాయకత్వం. ఈ రకంగా తెలంగాణపై తాము ఏ స్థాయిలో దృష్టి పెట్టామనే అంశంపై సంకేతాలు పంపింది. అయితే యూపీ నుంచి ఒకరిని రాజ్యసభకు పంపాలని భావించిన ఆ పార్టీ నాయకత్వం.. లక్ష్మణ్‌తో పాటు పలువురు ఇతర నేతల పేర్లను కూడా పరిశీలించింది.

వారిలో ఆ పార్టీ నాయకుడు మురళీధర్ రావు కూడా ఉన్నారు. అయితే సామాజిక సమీకరణాల నేపథ్యంలోనే ఆయనకు ఛాన్స్ రాలేదు. బీసీ నాయకుడికే అవకాశం ఇవ్వాలని బీజేపీ నాయకత్వం భావించడంతో.. ఆ అవకాశం లక్ష్మణ్‌కు దక్కింది. అయితే పలు ఇతర రాష్ట్రాల్లో బీజేపీ బలోపేతం కోసం కృషి చేసిన మురళీధర్ రావు విషయంలో ఆ పార్టీ నాయకత్వం ఇప్పటికే ఓ నిర్ణయం తీసుకుందని సమాచారం.

రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలోని కీలక నియోజకవర్గాల్లో ఒకటైన మల్కాజ్‌గిరి నుంచి పోటీ చేసే అవకాశం మురళీధర్ రావుకు ఇచ్చేందుకు ఆ పార్టీ హైకమాండ్ ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు బీజేపీ తరపున అనేక మంది నేతలు ఆసక్తి చూపిస్తున్నారు. వారిలో విజయశాంతి ఉరఫ్ రాములమ్మ కూడా ఉన్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో మల్కాజ్ గిరి నుంచి పోటీ చేయాలని విజయశాంతి భావిస్తున్నారు.

ఇందుకోసం ఆమె ఇప్పటి నుంచే ప్రయత్నాలు కూడా మొదలుపెట్టారని.. ఈ విషయాన్ని పార్టీ నాయకత్వం దృష్టికి కూడా తీసుకెళ్లారని సమాచారం. అయితే బీజేపీ హైకమాండ్ మాత్రం ఈ విషయంలో మురళీధర్ రావుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వార్తలు వస్తున్నాయి. పార్టీ అధిష్టానం కనుక అదే నిర్ణయానికి కట్టుబడి ఉంటే విజయశాంతి ఆశలు నీరుగారినట్లే. మరి ఆమెకు అసెంబ్లీ టిక్కెట్టు ఇస్తారా అనేది తెలియదు.

ఆమె రాజకీయాల్లోకి వచ్చాక ఇప్పటివరకు ఒక్కసారే టీఆర్ఎస్ తరపున ఎంపీగా గెలిచారు. ఆమె, కేసీఆర్ ఎంపీలుగా ఉన్నప్పుడే రాష్ట్ర విభజన బిల్లు పార్లమెంటు ఆమోదం పొంది తెలంగాణా ఏర్పడింది. ఆ తరువాత ఆమె కేసీఆర్ తో విభేదాల కారణంగా గులాబీ పార్టీ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి దారుణంగా ఓడిపోయారు. వివిధ కారణాలతో కాంగ్రెస్ పార్టీలో ఇమడలేకపోయారు. 

దాన్నుంచి బయటకు రావాలనుకున్నప్పుడు తాను రాజకీయ జీవితం ప్రారంభించిన బీజేపీలోనే చేరారు. ఇప్పటివరకైతే పార్టీలో చురుగ్గానే ఉన్నారు. ఆమెకు పార్టీ గుర్తింపు ఇస్తుందా? ఇవ్వదా? అనేది పార్లమెంటు లేదా అసెంబ్లీ ఎన్నికల్లో తేలిపోతుంది. ఏ ఎన్నికల్లోనూ టిక్కెట్ ఇవ్వకపోయినా చురుగ్గా, ఉత్సాహంగా పనిచేస్తారా అనేది చెప్పలేం. 

మల్కాజ్ గిరి లోక్ సభ నియోజకవర్గం నుంచి గత లోక్ సభ ఎన్నికల్లో పోటీ కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య నువ్వా నేనా అన్నట్టుగా సాగింది. చివరకు ఉత్కంఠభరిత పోరులో రేవంత్ రెడ్డి స్వల్ప మెజార్టీతో విజయం సాధించారు.

అంతకుముందు ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. అయితే ఈసారి ఆయన ఎమ్మెల్యేగా బరిలోకి దిగనున్న నేపథ్యంలో మల్కాజ్ గిరి ఎంపీగా పోటీ చేసేందుకు కాంగ్రెస్ తరపున ఎవరు రేసులో ఉంటారు? ఒకవేళ ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి స్థాయిలో ఓటర్లను ప్రభావితం చేస్తారా? అన్నది చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ బీజేపీ తరపున మురళీధర్ రావు వంటి వాళ్లు బరిలో ఉంటే.. రాబోయే ఎన్నికల్లో మల్కాజ్ గిరిలో బీజేపీ గట్టి పోటీ ఇవ్వడం మాత్రం ఖాయమనే చర్చ సాగుతోంది.

2008లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా మల్కాజిగిరి ఏర్పాటైంది. ఈ నియోజకవర్గం పరిధిలో దాదాపు 31 లక్షల మంది ఓటర్లలున్నారు. 2009లో ఈ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సర్వే సత్యనారాయణ 93 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. తర్వాత ఆయన కేంద్ర మంత్రిగానూ పని చేశారు. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి మల్లారెడ్డి 28 వేల ఓట్ల తేడాతో టీఆర్ఎస్ అభ్యర్థి మైనంపల్లి హన్మంతరావును ఓడించారు. తర్వాత ఆయన టీఆర్ఎస్‌లో చేరారు. మల్లారెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో మేడ్చల్‌ నుంచి విజయం సాధించి మంత్రిగా పని చేస్తున్నారు.

ఈసారి టీఆర్ఎస్ నుంచి ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి బరిలో ఉన్నారు. 2014 ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి 15 మంది ఇండిపెండెంట్లు సహా 30 మంది అభ్యర్థులు పోటీ చేయడం విశేషం. టీడీపీ నుంచి మల్లారెడ్డి, కాంగ్రెస్ నుంచి సర్వే సత్యనారాయణ, టీఆర్ఎస్ నుంచి మైనంపల్లి హనుమంతరావు, లోక్‌సత్తా పార్టీ నుంచి జయప్రకాశ్‌ నారాయణ్, వైఎస్ఆర్సీపీ నుంచి మాజీ డీజీపీ దినేశ్‌ రెడ్డి పోటీ చేశారు. మల్కాజ్ గిరి దేశంలో అతి పెద్ద లోక్ సభ నియోజకవర్గం. 

-ఎం. నాగేందర్ 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?