ఇప్పుడు కొత్తగా కన్నేయడమేంటి.? పార్లమెంటు ఎన్నికల సమయంలోనే తెలంగాణ రాజకీయాలపై బీజేపీ పట్టు సాధించింది. అంతకు ముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని చోట్లా పోటీ చేసి ఒకే ఒక్క చోట గెలుపొందిన బీజేపీ.. పార్లమెంటు ఎన్నికలకొచ్చేసరికి, షాకింగ్ ఫలితాలే సాధించింది. ఎలా.? అంటూ అధికార తెలంగాణ రాష్ట్ర సమితి సైతం ఆశ్చర్యపోయింది బీజేపీ సాధించిన సీట్లు చూసి. 'తెలంగాణలో మజ్లిస్‌తో కలిసి క్లీన్ స్వీప్ చేయబోతున్నాం.. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పబోతున్నాం..' అని ప్రకటించుకున్న కేసీఆర్, నిజంగానే పార్లమెంటు ఎన్నికల ఫలితాలతో కంగుతినేశారు.
ఇక, ఈసారి టీఆర్ఎస్ని కొట్టే దెబ్బ అలా ఇలా కాదు, ఓ రేంజ్లో వుంటుందని కమలనాథులు ధీమా వ్యక్తం చేస్తోంటే, బీజేపీ వ్యూహాలేంటో తెలియక, గులాబీ శ్రేణులు కూడా ఆందోళన చెందుతున్నాయి. పైకి టీఆర్ఎస్ ఎంత ధీమా వ్యక్తం చేస్తున్నా, పార్లమెంటు ఎన్నికల ఫలితాల్ని తలచుకుంటే, టీఆర్ఎస్ అధినాయకత్వంలో గుబులు రేగకుండా వుంటుందా.? 'సెప్టెంబర్‌లో తెలంగాణ రాజకీయ ముఖ చిత్రానికి సంబంధించి కీలకమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయ్..' అంటోంది బీజేపీ.
సెప్టెంబర్ నెలకి.. తెలంగాణ రాజకీయాల్లో తిరుగులేని ప్రాధాన్యత వుంది. ఇదే నెలలో ఒకప్పటి హైద్రాబాద్ స్టేట్‌కి విముక్తి లభించింది.. నిజాంల పాలన నుంచి. అది విముక్తి కాదు, విలీనమంటారు కొందరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విపక్షంగా వున్నప్పుడు టీఆర్ఎస్, తెలంగాణ విలీన (విమోచన అని కూడా అనొచ్చు) దినోత్సవం గురించి చేసిన యాగీ అంతా ఇంతా కాదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత మాత్రం, విలీన ఘట్టాన్ని ఎలా అభివర్ణించాలో తెలియక టీఆర్ఎస్ సతమతమవుతోంది.
సర్దార్ వల్లభాయ్ పటేల్‌ని హైలైట్ చేసే క్రమంలో, ఎంతోమంది జాతీయ స్థాయి నేతల ఇమేజ్‌ని డైల్యూట్ చేస్తూ వస్తోన్న బీజేపీ, ఆ సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరు చెప్పి, తెలంగాణ రాజకీయాల్లోనూ సెప్టెంబర్ నెల వేదికగా హల్చల్ చేయబోతోంది. గతంలోనూ ఈ తరహా హంగామా జరిగినా, ఈసారి అది మరింత ఉధృతంగా వుండబోతోందట. ఆపరేషన్ తెలంగాణ అయిపోయింది.. అక్కడ తమ కనుసన్నల్లో నడిచే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది బీజేపీ. ఆపరేషన్ కర్నాటక కూడా విజయవంతమయ్యింది. ఇప్పుడు ఆపరేషన్ తెలంగాణ అన్న మాట.
సాక్షాత్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా, తెలంగాణ ఆపరేషన్ని చేపట్టిన దరిమిలా, రానున్న రోజుల్లో తెలంగాణ రాజకీయాలు ఎలా మారనున్నాయో వేచి చూడాల్సిందే.