ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం రాజ్యాంగ వ్యవస్థలు నడుస్తున్న తీరుపై ఆవేదన , ఆక్రోశాన్ని వెల్లగక్కడం ద్వారా జాతీయ దృష్టిని ఆకర్షించారు. రాజకీయాల్లో తమ్మినేని సీతారాంది ప్రత్యేక శైలి. మొదట తాను ప్రజలకు జవాబుదారీ తనంతో వ్యవహరించాలని, ఆ తర్వాతే ఎవరైనా, ఏమైనా అని ఆయన బలంగా నమ్ముతారు.
నమ్మిన సిద్ధాంతం కోసం రిస్క్‌ను కూడా ఎదుర్కొనేందుకు సిద్ధపడే నైజం ఆయనది. ఆ మధ్య ఒకసారి తమ్మినేని తిరుపతి పర్యటన సందర్భంగా పాలనలో న్యాయస్థానాల జోక్యంపై ఘాటు వ్యాఖ్యలు చేయడం తీవ్ర సంచలనం రేకెత్తించిన విషయం తెలిసిందే.
ఇప్పుడు మరోసారి ఆయన న్యాయస్థానాల వ్యవహార శైలిపై తన దృఢమైన అభిప్రాయాలను ప్రకటించి జాతీయస్థాయిలో ఓ చర్చకు తెరలేపారు.
గుజరాత్‌లోని వడోదరలో నిర్వహించిన అఖిల భారత స్పీకర్ల సదస్సులో స్పీకర్ తమ్మినేని ప్రసంగం ఆలోచింపజేయడంతో పాటు అందర్నీ ఆకట్టుకుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
శాసన, అధికారిక వ్యవస్థల్లో న్యాయస్థానాలు మితిమీరి జోక్యం చేసుకోవడం భారత రాజ్యాంగ స్ఫూర్తికి, ప్రజాస్వామ్య వ్యవస్థకు పెనుముప్పు అని ఆయన హెచ్చరించారు. విధానపరమైన లోపాల సాకుతో శాసనసభ వ్యవహారాలు, నిర్ణయాల్లో కోర్టులు జోక్యం చేసుకోడానికి వీల్లేదని రాజ్యాంగంలోని ఆర్టికల్ 212 పేర్కొన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
ఈ ఆర్టికల్‌కు విరుద్ధంగా ఇటీవల న్యాయస్థానాలు తరచూ శాసన వ్యవస్థ పరిధిలోకి చొచ్చుకు వస్తుండటం రాజ్యాంగ అతిక్రమణే అని తమ్మినేని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒక రకంగా ఈ మాటలు ఆ సదస్సులో కలకలం రేపాయని చెప్పొచ్చు.
ఈ సందర్భంగా ఆయన ఏపీ శాసనసభ ఆమోదించిన ‘పరిపాలన వికేంద్రీకరణ– ప్రాంతీయ సమానాభివృద్ధి బిల్లు, ‘సీఆర్‌డీయే చట్టం రద్దు బిల్లు’లపై కోర్టు స్టే ఇవ్వడాన్ని గుజరాత్ వేదికగా తమ్మినేని ఎండగట్టి దేశ వ్యాప్త దృష్టిని ఆకర్షించారు.
కీలక, సున్నితమైన అంశాలపై వ్యాఖ్యలు చేయడానికి రాజ్యాంగ వ్యవస్థలు సిద్ధంగా ఉండటం విస్మయానికి గురి చేస్తోందని స్పీకర్ సీతారాం ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగ వ్యవస్థలు స్వీయ నియంత్రణ పాటించాల్సిన అవసరం ఉందని ఆయన హితవు పలికారు. కొందరు రాజకీయ దురుద్దేశ పూర్వకంగా కోర్టులను ఆశ్రయించడం వల్లే రాజ్యాంగ ప్రతిష్టంభన ఏర్పడు తోందన్నారు.
రాజ్యాంగ వ్యవస్థలైన శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థల మధ్య ఘర్షణపూరిత వాతావరణం నెలకొంటోందని చెప్పారు. శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు తమ పరిధులను గుర్తించి పరస్పరం గౌరవించుకుంటేనే రాజ్యాంగం లక్ష్యాలను సాధించగలమన్నారు. అయితే ఇదే గుజరాత్‌లో నిర్వహించిన సదస్సులో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా కోర్టులు తమ పరిధి దాటి వ్యవహరిస్తున్నాయని వాపోవడం గమనార్హం.