ఓ చానల్ అధిపతి వాదనలను హైకోర్టు కొట్టి పారేసింది. ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేసిన పిటిషన్‌లో ఆయన ఆశించింది నెరవేరలేదు. ఏపీ ప్రభుత్వ నిర్ణయాలపై న్యాయస్థానాలను ఆశ్రయించడం ప్యాషనైంది. ప్రతిదీ కోర్టు మెట్లు ఎక్కుతున్న దుస్థితి. ఇలాంటి ధోరణి ఎప్పుడూ లేదనే వాదన బలంగా వినిపిస్తోంది.
ఈ నేపథ్యంలో కొన్ని మీడియా సంస్థలు కూడా రాజకీయ పార్టీల మాదిరిగా ఏపీ ప్రభుత్వంపై రాజకీయ యుద్ధం ప్రకటించడం గమనార్హం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు రాజకీయ ప్రత్యర్థులతో పాటు మీడియా ప్రత్యర్థులు కూడా అదనం. ఈ పరిస్థితి కేవలం ఆంధ్రప్రదేశ్‌కే పరిమితం.
ఏపీ ప్రభుత్వంపై ఓ చానల్ అధిపతి న్యాయస్థానంలో పిటిషన్ వేశారంటే వాళ్ల వైఖరిని అర్థం చేసుకోవచ్చు. పోలీసులు, సీఐడీ అధికారులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ప్రతులను 24 గంటల్లో వెబ్‌సైట్లో పొందుపరచడం లేదని, ప్రజలకు అందుబాటులో ఉంచడం లేదంటూ టీవీ-5 చానల్ అధిపతి బి.రాజగోపాల్‌నాయుడు హైకోర్టులో పిల్ వేశారు.
ఈ పిల్‌పై హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. పిటిషనర్ తరపు న్యాయవాది పీవీజీ ఉమేశ్‌చంద్ర వాదనలు వినిపిస్తూ.. ప్రాథమిక విచారణ చేయకుండా సీఐడీ పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారన్నారు. ఎఫ్ఐఆర్ ప్రతులను 24 గంటల్లో అధికారిక వెబ్‌సైట్, ఏపీ పోలీసు సేవ మొబైల్ అప్లికేషన్‌లో పొందుపరచడం లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
ఎఫ్ఐఆర్ డౌన్‌లోడు చేసుకోవాలంటే పేరు, ఫోన్ నంబరు, ఫొటో తదితర వ్యక్తిగత సమాచారం కోరుతున్నారని పేర్కొన్నారు. ఇది గోప్యత హక్కును హరించడమేనన్నారు. కోర్టు ముందు తాము దాఖలు చేసిన కౌంటర్లోని అంశాలు ప్రతిబింబించేలా తగిన ఉత్తర్వులివ్వాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.
ప్రభుత్వం తరపు అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ …ఎఫ్ఐఆర్‌లను 24 గంటల్లో వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతున్నామన్నారు. పిటిషనర్ అభ్యర్థనలను ఓ సారి గమనించాలని ఏజీ చదివి వినిపించారు. వాటిని పరిశీలించిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. పిటిషనర్ అభ్యర్థనలు పస లేనివని వ్యాఖ్యానించింది.
అభ్యర్థనల్లో అస్పష్టత ఉందని పేర్కొంది. ఈ విషయమై వివిధ వ్యాజ్యాల్లో సుప్రీంకోర్టు పరిష్కరిస్తూ ఆదేశాలు జారీచేసిందని తెలిపింది. పోలీసు అధికారం లేని రాష్ట్రం మనుగడ సాధించలేదని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్ర, జస్టిస్ ఏవీ శేషసాయితో కూడిన ధర్మాసనం పేర్కొనడం గమనార్హం.