అమరావతి గొడవ ఒక ప్రాంతానికి సంబంధించిన అంశం. అందులోనూ సంబంధిత రైతులకు సంబంధించినది మాత్రమే. ఒక వర్గం మీడియాలో దానిని పదే పదే చూపించి రాష్ట్రస్థాయి సమస్యను చేద్దామనుకున్నారు గానీ పని జరగలేదు. స్థానిక ఎన్నికల్లో ఈ ప్రాంతంలో కూడా వైకాపాయే నెగ్గి జనం అమరావతి గొడవకి కనెక్ట్ కాలేదన్న విషయం బయటపెట్టింది.
దేవాలయాల మీద దాడులు ఒక మతానికి సంబంధించిన అంశం. దానిలో ప్రభుత్వప్రమేయం ఉందని ప్రతిపక్షం, వారి మీడియా ఏదో రకంగా కల్లబొల్లి కథనాలల్లి నిరూపిద్దామని చూసినా మళ్లీ పని జరగలేదు. జనం పట్టించుకోలేదు. స్థానిక ఎన్నికల ఫలితాల్లో ఈ విషయం ఋజువయ్యింది.
డా సుధాకర్ మరణాన్ని దళితుల మీద దాడిగా రంగుపులిమే ప్రయత్నం చేసింది ప్రధాన ప్రతిపక్షం. కానీ దళితులు దానిని ఒకానొక వ్యక్తి సమస్యగా చూశారు తప్ప దళితులమీద దాడిగా భావించలేదు. ఈ విషయం కూడా స్థానిక ఎన్నికల ఫలితమే చెప్పింది.
అలాగే రాష్ట్రం అప్పులపాలౌతోందన్నా, రోడ్లు బాగోలేదన్నా, కంపెనీలు వెళ్లిపోతున్నాయని కథలు చెప్పినా జనం విని ఊరుకుని స్థానిక ఎన్నికల్లో ఓట్లేసి ప్రతిపక్షాల దిమ్మ తిరిగే మెజారిటీతో గెలిపించారు.
ఎందుకిలా జరిగింది?
పైన చెప్పుకున్న గొడవలేవీ ప్రజల ఇళ్లళ్లోకి రాలేదు. టీవీల్లోనే ఆగి వార్తల రూపంలో కనిపించాయి. వారి జీవితం డైరెక్టుగా ఎఫెక్ట్ కాలేదు కాబట్టి ప్రభుత్వవ్యతిరేకత రాలేదు.
అయితే రెండున్నరేళ్ల పాలనలో మొట్టమొదటిసారి తేనెపట్టుని కెలికింది వైకాపా ప్రభుత్వం. ఎయిడెడ్ పాఠశాలల్ని కదిలించడం రాజకీయంగా వైకాపా చేసిన పెద్ద తప్పు.
ఎయిడెడ్ పాఠశాలలకి ఇకపై ప్రభుత్వం నుంచి ఆర్థికసాయం అందదని, కనుక పాఠశాలని ప్రభుత్వంలో విలీనం చేసేయాలని, కాని పక్షంలో ప్రైవేట్ పాఠశాలలుగా నడుపుకోవచ్చని ప్రభుత్వం ఎయిడెడ్ పాఠశాలలకి నోటీసులు పంపింది.
ఆ నోటీసు చూడగానే అధికశాతం టీచర్లకి కలలుపండినట్టయ్యింది. ఎందుకంటే తాము కోరుకుంటే ఉన్నపళంగా గవర్న్మెంట్ టీచర్స్ అయిపోవచ్చు. చాలామంది సంతకాలు పెట్టేసి ఒప్పేసుకున్నారు. అంటే ఈ టీచర్లు వేరు వేరు ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలకి బదిలీలైపోతారు.
మరి విద్యార్థుల మాటేవిటి?
వాళ్లని నచ్చిన వేరే బడిలో చేరమని చెప్పేయమని ఆయా ఎయిడెడ్ పాఠశాలల యాజమాన్యాలకు చెప్పింది ప్రభుత్వం.
ఇక్కడ వచ్చింది అసలు తంటంతా.
ఉన్నట్టుండి బడి మారమంటే ఇంతమందికీ ప్రభుత్వ పాఠశాలల్లో సీట్లు దొరకవు. అలాగని వేరే నాన్-ఎయిడెడ్ ప్రైవేట్ స్కూల్లో చేరాలంటే ఫీజులు మోత తట్టుకోలేని తల్లిదండ్రులు లక్షల్లో ఉంటారు. అంటే రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి లక్షలమంది తల్లిదండ్రుల ఆగ్రహానికి, అసంతృప్తికి గురికావడమే.
అందుకే స్కూళ్ల ముందు రోడ్లపై బైఠాయించి గొడవ చేస్తున్నారు.
“మాకు అమ్మ ఒడి అక్కర్లేదు, ఈ స్కూలు మూయకండి చాలు” అని గోల పెడుతున్నారు.
ఒకావిడైతే “ఈ స్కూల్లో మా తాత, తండ్రి, నేను చదివాము. మా పిల్లలు కూడా ఇక్కడే చదువుతున్నారు. ఈ స్కూలుతో మాకు విడదీయరాని అనుబంధం ఉంది” అని గోల పెట్టింది.
ఇల్లు, బడి అనేవి ప్రజలకి గుడికన్నా పెద్ద సెంటిమెంటు.
చాలా సినిమాల్లో చూసాం..”ఈ ఏరియాలో గుడిసెలు ఖాళీ చేయండి, వేరే చోట మీకు పక్కా ఇళ్లిస్తాం” అని ఎప్పుడు ప్రభుత్వం అన్నా అక్కడి పేదలనుంచి తిరుగుబాటొస్తుంది. వాళ్లకి ప్రభుత్వం కల్పించాలనుకునే మెరుగైన జీవితం అక్కర్లేదు. తాము గడుపుతున్న జీవితాన్ని డిస్టర్బ్ చేయకూడదంతే.
ఇది కూడా ఒకరకంగా అలాంటిదే. స్కూలు దగ్గరగా ఇల్లు అద్దెకి తీసుకుని ఉండడమో, లేక కట్టుకోవడమో చేస్తారు తల్లిదండ్రులు. ఇప్పుడు పిల్లలకి దూరంగా ఉన్న స్కూల్లో అడ్మిషన్ వస్తే ఇల్లు కూడా మారే అవసరాలుంటాయి కొందరికి. అంటే స్కూలుని కెలికితే పరోక్షంగా కొందరి ఇళ్లని కూడా కదిలించినట్టే. జనం దీనిని తేలిగ్గా తీసుకోరు. ఎన్నికలు ఇంకా రెండున్నరేళ్లున్నాయనుకున్నా అప్పటిదాకా గుర్తుపెట్టుకోగలిగే గాయమయ్యే ప్రమాదం ఉంది.
ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ప్రయోజనాలు, ప్రమాదాలు రెండూ బేరీజు వేసుకుంటుంది. కానీ ఇక్కడ అది జరిగిన విధానం కనపడట్లేదు.
విద్యాశాఖ మీద పెడుతున్న ఖర్చు కొంత తగ్గించి ప్రభుత్వ పాఠశాలల ఫ్యాకల్టీని పెంచడం ఈ నిర్ణయంలోని ప్రధాన ఉద్దేశ్యం. కానీ దీని వల్ల ఎంతమంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఎఫెక్ట్ అవుతున్నారనేది లెక్కేసుకోవాలి కదా.
ఇప్పుడు ఈ సమస్యకి పరిష్కారం ఎలా చేయొచ్చో చూద్దాం.
చాలా ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యార్థులు లేరు. ప్రభుత్వం నుంచి వచ్చే ఎయిడ్ మాత్రం తీసుకుని ఉపాధ్యాయులు పెద్ద పనిలేకుండా గడిపేస్తున్నారు. అటువంటి పాఠశాలల మీద మాత్రమే ఈ చర్య ఉంటే బాగుంటుంది. ఎవరూ గొడవ చేయరు. ఉన్న తక్కువ మంది విద్యార్థులు వారి దారి చూసుకోవడం తప్పదు.
కానీ వందల సంఖ్యలో విద్యార్థులున్న పాఠశాలలకి కూడా ఈ ఆఫర్ వెళ్లడంతో అక్కడి టీచర్స్ గవర్న్మెంటులో విలీనమైపోవడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. అక్కడొస్తోంది సమస్య. అది ఆపాలి.
ప్రభుత్వం ఇప్పుడు తన నిర్ణయాన్ని కాస్త మార్చుకోవాలి. కేవలం విద్యార్థుల సంఖ్య అతి తక్కువగా ఉన్న ఎయిడెడ్ పాఠశాలలకే ఈ నిర్ణయం వర్తించేలా చూడాలి. మిగిలిన పాఠశాలలు యథాతథంగా ప్రభుత్వ ఎయిడ్ తో నడవాలి.
లేకపోతే ఇప్పుడు ప్రజలు పడే ఇబ్బంది రేపు ఎన్నికల వేళ ప్రభుత్వానికి చుట్టుకోవడం ఖాయం.
శ్రీనివాసమూర్తి